Congress Plenary : కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఎన్నికలపై సంచలన నిర్ణయం

ABN , First Publish Date - 2023-02-24T15:44:53+05:30 IST

కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ మాట్లాడుతూ, సీడబ్ల్యూసీ ఎన్నికల గురించి కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీ స్వేచ్ఛగా, అరమరికలు లేకుండా

Congress Plenary : కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఎన్నికలపై సంచలన నిర్ణయం
85th Plenary Session of the Indian National Congress

రాయ్‌పూర్ : కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC)కి సభ్యులందరినీ నామినేట్ చేసే అధికారాన్ని పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge)కు కట్టబెడుతూ పార్టీ స్టీరింగ్ కమిటీ శుక్రవారం ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంది. సీడబ్ల్యూసీకి ఎన్నికలు అవసరం లేదని పేర్కొంది. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో కాంగ్రెస్ 85వ ప్లీనరీ సమావేశాల్లో ఈ నిర్ణయం తీసుకుంది.

కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ (Jairam Ramesh) మాట్లాడుతూ, సీడబ్ల్యూసీ ఎన్నికల గురించి కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీ స్వేచ్ఛగా, అరమరికలు లేకుండా చర్చించిందన్నారు. సీడబ్ల్యూసీ సభ్యులందరినీ నియమించే అధికారాన్ని పార్టీ అధ్యక్షుడు ఖర్గేకు అప్పగించాలని స్టీరింగ్ కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయించిందన్నారు. స్టీరింగ్ కమిటీ సమావేశంలో 45 మంది సభ్యులు (అందరూ) పాల్గొన్నారని తెలిపారు. వీరిలో కొందరు సీడబ్ల్యూసీ ఎన్నికలకు అనుకూలంగా, మరికొందరు వ్యతిరేకంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారన్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో కాంగ్రెస్ పోషించవలసిన పాత్రను దృష్టిలో ఉంచుకుని, రాజకీయ సవాళ్లను ఎదుర్కొనడం కోసం, సీడబ్ల్యూసీకి ఎన్నికలు నిర్వహించరాదని నిర్ణయించినట్లు తెలిపారు.

మాజీ కాంగ్రెస్ అధ్యక్షులు, మాజీ ప్రధాన మంతులను సీడబ్ల్యూసీలో నియమిస్తారన్నారు. సీడబ్ల్యూసీలో 50 శాతం పదవులను ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మహిళలు, మైనారిటీలు, యువతకు కేటాయించినట్లు తెలిపారు. స్టీరింగ్ కమిటీ తీసుకున్న ఈ ఏకగ్రీవ నిర్ణయాన్ని ఏఐసీసీ, పీసీసీ ప్రతినిధులంతా మద్దతిస్తారనే సంపూర్ణ విశ్వాసం తమకు ఉందని చెప్పారు.

స్టీరింగ్ కమిటీ సమావేశంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా పాల్గొనలేదు. అంతకుముందు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ, ‘‘మీరు మీ భావాలను స్వేచ్ఛగా వ్యక్తీకరించండి, సమష్టి నిర్ణయం తీసుకోండి అని నేను కాంగ్రెస్ అధ్యక్షుడిగా కోరుతున్నాను. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా అది నా నిర్ణయం, ప్రతి ఒక్కరి నిర్ణయం అవుతుంది’’ అని తెలిపారు.

ఇవి కూడా చదవండి :

Khalistan : మా లక్ష్యం చెడ్డది కాదు : అమృత్ పాల్ సింగ్

Meghalaya : బీఫ్ తినే అలవాటుపై మేఘాలయ బీజేపీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు

Updated Date - 2023-02-24T15:44:57+05:30 IST