I.N.D.I.A : ఇండియా కూటమికి భారీ ఎదురుదెబ్బ?

ABN , First Publish Date - 2023-08-16T11:58:16+05:30 IST

రానున్న లోక్ సభ ఎన్నికల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi)ని గద్దె దించాలన్న లక్ష్యంతో ఏర్పాటైన ఇండియా (I.N.D.I.A) కూటమికి భారీ ఎదురు దెబ్బ తగలబోతోందా? బీజేపీని గట్టిగా వ్యతిరేకించే పార్టీల జాబితా నుంచి ఎన్‌సీపీ జారిపోబోతోందా?

I.N.D.I.A : ఇండియా కూటమికి భారీ ఎదురుదెబ్బ?

ముంబై : రానున్న లోక్ సభ ఎన్నికల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi)ని గద్దె దించాలన్న లక్ష్యంతో ఏర్పాటైన ఇండియా (I.N.D.I.A) కూటమికి భారీ ఎదురు దెబ్బ తగలబోతోందా? బీజేపీని గట్టిగా వ్యతిరేకించే పార్టీల జాబితా నుంచి ఎన్‌సీపీ జారిపోబోతోందా? కాషాయ పార్టీ భావజాలాన్ని నిరంతరం విమర్శించే అగ్ర నేతల జాబితా నుంచి మరాఠా రాజకీయ దిగ్గజం శరద్ పవార్ వైదొలగబోతున్నారా? అంటే, జాతీయ మీడియా కథనాల ప్రకారం ఇవన్నీ త్వరలో వాస్తవం కాబోతున్నాయేమోనని అనిపిస్తోంది.

మాజీ ముఖ్యమంత్రి అయిన కాంగ్రెస్ సీనియర్ నేతను ఉటంకిస్తూ జాతీయ మీడియా తెలిపిన వివరాల ప్రకారం, ఇటీవల శరద్ పవార్, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సమావేశమయ్యారు. ఈ రహస్య సమావేశంలో శరద్ పవార్‌కు ముఖ్యంగా రెండు ఆఫర్లు ఇచ్చారు. అవి ఏమిటంటే, శరద్ కుమార్తె సుప్రియ సూలేకు కేంద్ర మంత్రి పదవి ఇవ్వడం, శరద్ పవార్‌కు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి పదవి లేదా నీతీ ఆయోగ్ లేదా విపత్తు నిర్వహణ బాధ్యతలు అప్పగించి, మంచి హోదాలో ఉండేలా చూడటం.

అదేవిధంగా శరద్ పవార్‌కు నమ్మకస్థుడైన మహారాష్ట్ర ఎన్‌సీపీ శాఖ అధ్యక్షుడు జయంత్ పాటిల్‌కు రాష్ట్ర ప్రభుత్వంలో కీలక బాధ్యతలు అప్పగిస్తామని కూడా అజిత్ చెప్పారు. అయితే ఈ ఆఫర్లను శరద్ పవార్ నిర్ద్వంద్వంగా తిరస్కరించారని, తాను బీజేపీతో ఎట్టి పరిస్థితుల్లోనూ జత కలిసేది లేదని ఆ కాంగ్రెస్ నేత చెప్పినట్లు జాతీయ మీడియా తెలిపింది. ఎన్‌సీపీని చీల్చకుండా, సమైక్యంగా ఉంచడం కోసమే ఈ వ్యూహాన్ని రచిస్తున్నట్లు తెలిపింది.


రగిలిపోతున్న ఉద్ధవ్, కాంగ్రెస్ నేతలు

శరద్-అజిత్ రహస్య సమావేశం పుణేలోని ఓ డెవలపర్ నివాసంలో శనివారం జరిగింది. దీంతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాఢీ కూటమిలో కాక రేగింది. శరద్ పవార్ స్థాపించిన ఎన్‌సీపీని చీల్చి, తామంతా గట్టిగా వ్యతిరేకిస్తున్న బీజేపీతో చేతులు కలిపిన అజిత్ పవార్‌తో శరద్ పవార్ రహస్యంగా భేటీ అవడాన్ని ఎంవీఏ భాగస్వామ్య పక్షాల నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. శరద్‌పై ఈ కూటమిలోని పార్టీలైన కాంగ్రెస్, శివసేన-యూబీటీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నానా పటోలే, శివసేన-యూబీటీ చీఫ్ ఉద్ధవ్ థాకరే, కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. శరద్ పవార్‌కు ఇది ఎంత మాత్రం తగదని చెప్పారు. అయితే శరద్ పవార్ స్పందిస్తూ, అజిత్ తన మేనల్లుడని, మామాఅల్లుళ్లు కలుసుకోవడంలో తప్పేముందని, దీనిపై అంత రాద్ధాంతం ఎందుకని ప్రశ్నించారు.

రాహుల్ గాంధీ దృష్టికి..

నానా పటోలే మాట్లాడుతూ, శరద్-అజిత్ రహస్యంగా సమావేశమవడం సరికాదని, ఆమోదయోగ్యం కాదని చెప్పారు. ఈ విషయాన్ని రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. శివసేన-యూబీటీ నేత సంజయ్ రౌత్ మాట్లాడుతూ, ఉద్ధవ్, పటోలే ఆదివారం సమావేశమయ్యారని, శరద్-అజిత్ రహస్య భేటీ గురించి చర్చించారని తెలిపారు.

శివసేన-యూబీటీ నేత మరొకరు మాట్లాడుతూ, శరద్ పవార్ మద్దతు లేకపోతే మహారాష్ట్రలోని 48 లోక్ సభ స్థానాల్లో 35 నుంచి 40 స్థానాల వరకు గెలవాలన్న లక్ష్యాన్ని సాధించలేమనే విషయం బీజేపీ పెద్దలకు తెలుసునని చెప్పారు.


ప్లాన్-బీ

మరోవైపు రానున్న లోక్ సభ ఎన్నికలను శరద్ పవార్‌తో కలవకుండానే ఎదుర్కొనేందుకు ప్లాన్-బీని శివసేన-యూబీటీ, కాంగ్రెస్ సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై కాంగ్రెస్ అధిష్ఠానం తుది నిర్ణయం తీసుకుంటుందని నానా పటోలే చెప్పారు.

సుప్రియ సూలే స్పందన

శరద్-అజిత్ రహస్య భేటీ సృష్టించిన అలజడి నేపథ్యంలో శరద్ పవార్ కుమార్తె సుప్రియ సూలే మాట్లాడుతూ, తాను శివసేన-యూబీటీ, కాంగ్రెస్ పార్టీల కీలక నేతలతో మాట్లాడానని, తమ గురించి ఎవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదని చెప్పారు. తాను బీజేపీతో చేతులు కలిపేది లేదని శరద్ స్పష్టం చేసినట్లు తెలిపారు. స్వాతంత్ర్య దినోత్సవాల సందర్భంగా ఎన్‌సీపీ ప్రధాన కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన తర్వాత ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

ఆమ్ ఆద్మీ పార్టీ వర్సెస్ కాంగ్రెస్

ఇండియా కూటమిలో భాగస్వామ్య పక్షాలైన కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య కూడా లుకలుకలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేత సందీప్ దీక్షిత్ మంగళవారం మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై విరుచుకుపడ్డారు. ఈ రెండిటి మధ్య తేడా ఏమీ లేదన్నారు. ప్రజాస్వామ్యంలో అత్యంత చెత్త ప్రభుత్వం ప్రస్తుత కేంద్ర ప్రభుత్వమని దుయ్యబట్టారు. ఢిల్లీ సర్వీసెస్ విషయంలో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ సరైనదేనన్నారు. అవినీతి కేసుల నుంచి తనను తాను కాపాడుకోవడం కోసమే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారని దుయ్యబట్టారు.

నితీశ్ కల

బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ చొరవ తీసుకుని ప్రతిపక్షాలను ఏకం చేసేందుకు ప్రయత్నాలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. పాట్నా, బెంగళూరు సమావేశాల తర్వాత త్వరలోనే ముంబైలో మరోసారి సమావేశమవుతామని ఈ కూటమి నేతలు ప్రకటించారు. బెంగళూరు సమావేశానికి ముందు ఢిల్లీ సర్వీసెస్ బిల్లుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ మాట్లాడటంతో ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్‌ మధ్య బంధం బలపడింది. అయితే, కీలక అంశాల్లో భేదాభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో లోక్ సభ ఎన్నికలను ఇండియా కూటమి కలిసికట్టుగా ఏ విధంగా ఎదుర్కొంటుందో చూడాలి. ‘‘కలిసి ఉంటే నిలబడతాం’’ నినాదం స్ఫూర్తితో ఏ విధంగా పోరాడుతారో చూడాలి.


ఇవి కూడా చదవండి :

Birthday wishes : కేజ్రీవాల్‌కు జన్మదిన శుభాకాంక్షలు చెప్పిన మోదీ

Atal Bihari Vajpayee : మాజీ ప్రధాని ఏబీ వాజ్‌పాయి నాయకత్వంతో దేశానికి గొప్ప మేలు : మోదీ

Updated Date - 2023-08-16T12:08:41+05:30 IST