Lokmanya Tilak : తిలక్‌కు ప్రజలే ‘లోకమాన్య’ బిరుదు ఇచ్చారు : మోదీ

ABN , First Publish Date - 2023-08-01T14:29:57+05:30 IST

‘లోకమాన్య’ బాల గంగాధర్ తిలక్ (Lokmanya Bal Gangadhar Tilak) ఘనతను ప్రజలే గుర్తించారని, ఆయనకు ‘లోకమాన్య’ బిరుదును ఇచ్చారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) చెప్పారు. లోకమాన్య తిలక్ జాతీయ పురస్కారాన్ని స్వీకరించడం తనకు మధుర జ్ఞాపకమని తెలిపారు.

Lokmanya Tilak : తిలక్‌కు ప్రజలే ‘లోకమాన్య’ బిరుదు ఇచ్చారు : మోదీ

పుణే (మహారాష్ట్ర) : ‘లోకమాన్య’ బాల గంగాధర్ తిలక్ (Lokmanya Bal Gangadhar Tilak) ఘనతను ప్రజలే గుర్తించారని, ఆయనకు ‘లోకమాన్య’ బిరుదును ఇచ్చారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) చెప్పారు. లోకమాన్య తిలక్ జాతీయ పురస్కారాన్ని స్వీకరించడం తనకు మధుర జ్ఞాపకమని తెలిపారు. స్వాతంత్ర్య సమర యోధుడు తిలక్ 103వ వర్థంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మోదీకి మంగళవారం ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రతిపక్ష కూటమిలో కీలక నేత, ఎన్‌సీపీ వ్యవస్థాపకుడు శరద్ పవార్ హాజరవడం చర్చనీయాంశంగా మారింది.

లోకమాన్య తిలక్ స్మారక్ మందిర్ ట్రస్ట్ మోదీకి ఈ పురస్కారాన్ని ప్రదానం చేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శరద్ పవార్ హాజరయ్యారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్ కూడా వేదికపై ఆసీనులయ్యారు. శరద్ పవార్, మోదీ ఎంతో ఆత్మీయంగా మాట్లాడుకున్నారు. ఇటీవల ఎన్‌సీపీలో చీలిక వచ్చిన తర్వాత వీరిద్దరూ ఒకే వేదికపైకి రావడం ఇదే తొలిసారి. ఇది ప్రతిపక్ష ఇండియా కూటమిలోని పక్షాలకు రుచించడం లేదు.


ప్రముఖుల జాబితాలో మోదీ : శరద్ పవార్

శరద్ పవార్ మాట్లాడుతూ, పుణే నగరానికి గొప్ప చరిత్ర ఉందని తెలిపారు. ఈ నగరానికి దేశంలో చాలా ప్రాధాన్యం ఉందన్నారు. పుణే జిల్లాలోని శివనేరి కోటలో ఛత్రపతి శివాజీ మహారాజు జన్మించారని, చాలా మంది రాజులు తమ పేరుపై రాజ్యాలను స్థాపించారని, శివాజీ మహారాజు మాత్రం హైందవి స్వరాజ్‌ను ఏర్పాటు చేశారని చెప్పారు. లోకమాన్య తిలక్ పురస్కార ప్రదాన కార్యక్రమంలో శరద్ మాట్లాడుతూ, ఇటీవల మన సైనికులు సర్జికల్ స్ట్రైక్స్ చేశారని, అయితే అటువంటి దాడులను మొదట చేసినవారు ఛత్రపతి శివాజీ మహారాజు అని చెప్పారు. ఆయన లాల్ మహల్‌లో సయిష్టా ఖాన్‌పై సర్జికల్ స్ట్రైక్స్ చేశారని చెప్పారు. లోకమాన్య తిలక్ పురస్కారాన్ని స్వీకరిస్తున్న మోదీని ఆయన ప్రశంసించారు. ఈ పురస్కారాన్ని అనేక మంది ప్రముఖులు స్వీకరించారని, ఆ జాబితాలో ఇప్పుడు మోదీ చేరారని తెలిపారు. ఈ పురస్కారాన్ని ఆయన స్వీకరిస్తున్నందుకు ఆయనను అభినందిస్తున్నానని చెప్పారు. ఈ పురస్కారాన్ని పొందినవారిలో మోదీ 41వవారు. గతంలో డాక్టర్ శంకర్ దయాళ్ శర్మ, ప్రణబ్ ముఖర్జీ, అటల్ బిహారీ వాజ్‌పాయి, ఇందిరా గాంధీ, బాలాసాహెబ్ దేవరస్, మన్మోహన్ సింగ్, ఎన్ఆర్ నారాయణ మూర్తి, ఈ శ్రీధరన్ వంటివారు ఉన్నారు.

మోదీ ఆటోగ్రాఫ్ కోరుతున్న ప్రపంచ నేతలు : సీఎం షిండే

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే మాట్లాడుతూ, మోదీని ప్రపంచవ్యాప్తంగా గౌరవిస్తున్నారని, ఇతర దేశాల నేతలు మోదీ ఆటోగ్రాఫ్ తీసుకుంటున్నారని, కొందరు ఆయనను బాస్ అంటున్నారని, మరికొందరు ఆయనకు పాదాభివందనం చేస్తున్నారని చెప్పారు. ఇదంతా తమకు గర్వకారణమన్నారు.


భారతీయులకు అంకితం : మోదీ

లోకమాన్య బాల గంగాధర్ తిలక్ 103వ వర్థంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించిన అనంతరం మోదీ మాట్లాడుతూ, లోకమాన్య తిలక్ జాతీయ పురస్కారాన్ని స్వీకరించడం తనకు మధుర జ్ఞాపకమని తెలిపారు. భారత దేశంలో అశాంతికి పిత తిలక్ అని బ్రిటిషర్లు ముద్ర వేశారన్నారు. బ్రిటిషర్లకు వ్యతిరేకంగా జరిగే పోరాట దిశను తిలక్ మార్చేశారన్నారు. తిలక్ ఆధునిక భారత దేశ పిత అని మహాత్మా గాంధీ అభివర్ణించారన్నారు. భారత దేశ స్వాతంత్ర్య సంగ్రామంలో తిలక్ పాత్రను ఏవో కొన్ని సంఘటనలు, మాటల ద్వారా వర్ణించలేమని చెప్పారు. మన దేశ స్వాతంత్ర్యం కోసం ఆయన విశేష కృషి చేశారని చెప్పారు. స్వాతంత్ర్య సమరయోధుడు తిలక్‌కు, సాంఘిక సంస్కర్త అన్నా భావు సాఠేలకు నివాళులర్పిస్తున్నానని చెప్పారు. ఈ పురస్కారంతో పాటు తనకు లభించిన నగదు మొత్తాన్ని ‘నమామి గంగే’ ప్రాజెక్టుకు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ పురస్కారాన్ని 140 కోట్ల భారతీయులకు అంకితమిస్తున్నట్లు తెలిపారు. ప్రజల సంక్షేమానికి వచ్చే ఏ అవకాశాన్నీ వదిలిపెట్టేది లేదన్నారు.

‘బ్రిటిషర్ల భావన తప్పు అని తిలక్ రుజువు చేశారు’

భారత దేశంలోని మతాచారాలు, సంస్కృతి, సంప్రదాయాలు, నమ్మకాలు, విశ్వాసాలు వెనుకబాటుతనానికి గుర్తులని బ్రిటిషర్లు భావించారని, అదంతా శుద్ధ తప్పు అని తిలక్ నిరూపించారని చెప్పారు. అందుకే భారతీయులు తమంతట తాము ముందుకొచ్చి, తిలక్‌కు ‘లోకమాన్య’ అనే బిరుదును ఇచ్చి, సత్కరించారని తెలిపారు. యువత సత్తాను గుర్తించే ప్రతిభ తిలక్‌కు ఉందన్నారు. అందుకే ఆయన స్వతంత్ర వీర సావర్కర్ సత్తాను గుర్తించారన్నారు. సావర్కర్ విదేశాలకు వెళ్లి, విద్యావంతుడై, దేశ స్వాతంత్ర్యానికి కృషి చేయాలని తిలక్ కోరుకున్నారని చెప్పారు. యువత భవిత కోసం తిలక్ అనేక సంస్థలను ఏర్పాటు చేశారన్నారు.

వ్యవస్థ నిర్మాణం నుంచి సంస్థ నిర్మాణం, సంస్థ నిర్మాణం నుంచి వ్యక్తి నిర్మాణం, వ్యక్తి నిర్మాణం నుంచి దేశ నిర్మాణం - అనేది దేశ నిర్మాణానికి మార్గసూచి వంటిదని చెప్పారు. నేడు భారత దేశం ఈ మార్గసూచీని చురుగ్గా, కర్తవ్య దీక్షతో అనుసరిస్తోందని తెలిపారు.

మోదీ అంతకుముందు పుణేలోని శ్రీమంత్ దగ్డుషేఠ్ హల్వాయ్ గణపతి దేవాలయంలో పూజలు చేశారు.


ఇవి కూడా చదవండి :

Nuh violence : హర్యానాలో మత ఘర్షణలు.. ఇద్దరు హోం గార్డులు సహా ముగ్గురి మృతి..

Karnataka : టీటీడీకి కర్ణాటక డెయిరీ ‘నందిని’ షాక్

Updated Date - 2023-08-01T14:29:57+05:30 IST