Narendra Modi: జాతీయ సమైక్యత పట్ల సర్దార్ వల్లభాయ్ పటేల్ నిబద్ధత ఆదర్శం.. 148వ జయంతి సందర్భంగా మోదీ నివాళులు
ABN , First Publish Date - 2023-10-31T11:05:15+05:30 IST
సర్దార్ వల్లభాయ్ పటేల్ 148వ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ ఆయనకు నివాళులర్పించారు. గుజరాత్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం వద్ద ప్రధాని నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేశానికి పటేల్ చేసిన సేవలను మోదీ స్మరించుకున్నారు.
సర్దార్ వల్లభాయ్ పటేల్ 148వ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ ఆయనకు నివాళులర్పించారు. గుజరాత్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం వద్ద ప్రధాని నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేశానికి పటేల్ చేసిన సేవలను మోదీ స్మరించుకున్నారు. జాతీయ సమైక్యత కోసం సర్దార్ వల్లభాయ్ పటేల్ చూపిన నిబద్ధత పౌరులకు మార్గనిర్దేశం చేస్తూనే ఉందని ప్రధాని అన్నారు. ఈ మేరకు ప్రధాని మోదీ ఎక్స్(ట్విట్టర్) వేదికగా ఓ ట్వీట్ చేశారు. “సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి రోజున మేము ఆయన అనిర్వచనీయమైన స్ఫూర్తిని, దూరదృష్టితో కూడిన రాజనీతిజ్ఞతను, మన దేశం విధిని రూపొందించిన అసాధారణ అంకితభావాన్ని గుర్తుచేసుకుంటున్నాం. జాతీయ సమైక్యత పట్ల ఆయన నిబద్ధత మనకు మార్గదర్శకంగా కొనసాగుతోంది. ఆయన సేవకు మేము ఎప్పటికీ రుణపడి ఉంటాము” అని ప్రధాని మోదీ రాసుకొచ్చారు. సర్దార్ పటేల్ జయంతిని పురస్కరించుకుని గుజరాత్‌లోని కెవాడియా సమీపంలోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వద్ద సీఆర్పీఎఫ్ (CRPF) మహిళా సిబ్బంది ఏర్పాటు చేసిన డేర్‌డెవిల్ స్టంట్స్ ఈవెంట్‌లో ప్రధాని పాల్గొన్నారు. కాగా సీఆర్పీఎఫ్ వ్యవస్థాపకుడిగా కూడా పరిగణించబడే సర్దార్ పటేల్ దార్శనికతను అనుసరించి కేంద్ర దళం ఏర్పడింది. ఈ కార్యక్రమంలో భారత్-చైనా సరిహద్దులోని గ్రామాలకు చెందిన కళాకారులు కూడా ప్రదర్శన ఇచ్చారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపాధ్యక్షుడు జగదీప్ ధన్‌కర్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తదితర ప్రముఖులు కూడా న్యూఢిల్లీలోని పటేల్ చౌక్‌లో సర్దార్ పటేల్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మరోవైపు సర్దార్ పటేల్ జయంతిని ‘రాష్ట్రీయ ఏక్తా దివస్’గా కూడా జరుపుకుంటారు. అలాగే మేజర్ ధ్యాన్ చంద్ నేషనల్ స్టేడియంలో 'రన్ ఫర్ యూనిటీ' ర్యాలీని హోంమంత్రి అమిత్ సా జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఐక్యతా ప్రమాణ స్వీకారంతో జెండావిష్కరణ చేశారు. జాతీయ సమైక్యతకు సర్దార్ పటేల్ చేసిన కృషిని ఈ సందర్భంగా అమిత్ షా గుర్తు చేసుకున్నారు. దేశానికి మొదటి హోం మంత్రి అయిన సర్దార్ వల్లభాయ్ పటేల్ అఖండ భారతదేశ ఏర్పాటుకు కారణమని అన్నారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు బ్రిటిష్ వారిచే విభజించబడిన అన్ని సంస్థానాలను ఏకతాటిపైకి తీసుకురావడానికి సర్దార్ పటేల్ ఎంతో కృష్టి చేశారని తన ప్రసంగంలో షా చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో జరిగిన ‘రన్ ఫర్ యూనిటీ’ ర్యాలీలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాల్గొన్నారు. అక్కడ ప్రధాని మోదీ ‘మేరా యువ భారత్’ని ప్రారంభిస్తారని ప్రకటించారు. 'మేరా యువ భారత్' కార్యక్రమాన్ని ప్రధాని మోదీ ప్రారంభించబోతున్నారని, దేశ నిర్మాణంలో భాగంగా ఇందులో యువత పాల్గొనే అవకాశం లభిస్తుందని రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. కాగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు నివాళులర్పించారు.