Congress Vs BJP : రాహుల్ గాంధీపై వినూత్నంగా విరుచుకుపడిన జైశంకర్
ABN , First Publish Date - 2023-03-18T14:48:46+05:30 IST
విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Congress leader Rahul Gandhi)పై తీవ్రంగా విరుచుకుపడ్డారు.
న్యూఢిల్లీ : విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Congress leader Rahul Gandhi)పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. పాండాలను కౌగిలించుకునేవారు చైనా గద్దలుగా మారలేరని, చైనాను చూసి చొంగ కార్చుకునేవారిని చూడటం ఇబ్బందికరంగా ఉందని అన్నారు. రాహుల్ ఇటీవల లండన్‌లో మాట్లాడుతూ, చైనా నుంచి మన దేశానికి ఎదురయ్యే ముప్పు జైశంకర్‌కు అర్థం కాదని విమర్శించిన సంగతి తెలిసిందే.
జైశంకర్ శనివారం ఇండియా టుడే కాన్‌క్లేవ్‌లో పాల్గొన్నారు. రాహుల్ గాంధీ రెండు వారాల క్రితం లండన్‌లో చేసిన వ్యాఖ్యలు ప్రస్తావనకు వచ్చాయి. దీనిపై జైశంకర్ స్పందిస్తూ, చైనాను చూసి చొంగ కార్చుకుంటూ, భారత దేశం పట్ల తృణీకార భావంగల ఓ వ్యక్తిని చూడటానికి ఓ భారతీయ పౌరుడిగా ఇబ్బందికరంగా ఉందన్నారు. పాండాలను కౌగిలించుకునేవారు చైనా గద్దలుగా మారేందుకు ప్రయత్నించినా ఫలితం ఉండదన్నారు. జైశంకర్ ఉపయోగించిన పదజాలంలో పాండా హగ్గర్స్‌కు చైనా విధానాలను సమర్థించే రాజకీయ నాయకుడు అనే అర్థం కూడా ఉంది.
భారత దేశం చైనా (China)ను చూసి భయపడుతోందని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కూడా జైశంకర్ స్పందించారు. రాహుల్ గాంధీ చైనా గురించి ప్రశంసాపూర్వకంగా మాట్లాడుతున్నారని, ఆ దేశం సామరస్యంగా ఉందని చెప్తున్నారని, చైనా చాలా గొప్ప తయారీదారు (greatest manufacturer) అని చెప్తున్నారని, అదే సమయంలో ‘మేక్ ఇన్ ఇండియా’ (Make in India) వల్ల ఏమీ ఉపయోగం ఉండదంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
‘‘ఓ దేశం గురించి మీకు ఓ అభిప్రాయం ఉండవచ్చు, కానీ మీరు మన దేశ ఆత్మస్థయిర్యాన్ని దెబ్బతీయకూడదు’’ అన్నారు. పాండా హగ్గర్స్ చైనా హాక్స్‌గా మారడానికి ప్రయత్నించడం ఆమోదయోగ్యంగా ఉండదన్నారు. (when Panda huggers try to be China hawks... it doesn't fly).
చైనా సరిహద్దుల్లో పరిస్థితిని భారత ప్రభుత్వం నిజాయితీగా వెల్లడించడం లేదని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై జైశంకర్ స్పందిస్తూ, చైనా మన భూభాగంలోకి రావడం సాధ్యం కాకుండా చేయడం కోసం సరిహద్దు ప్రాంతాలను అభివృద్ధి చేయడం మానేద్దామని చెప్పినవారు వీరేనని దుయ్యబట్టారు.
చైనాతో భారత దేశ ప్రస్తుత సంబంధాల గురించి అడిగినపుడు జైశంకర్ మాట్లాడుతూ, చైనాతో మన సంబంధాల్లో ఇది చాలా సవాలుతో కూడుకున్న దశ అని తెలిపారు. పరిస్థితి చాలా సున్నితంగా ఉందన్నారు. దళాల మోహరింపు జరగవలసిన ప్రదేశాలు ఇంకా ఉన్నాయేమో పరిశీలించాలన్నారు.
రాహుల్ గాంధీ లండన్‌లోని భారతీయ పాత్రికేయ సంఘం సభ్యులతో మాట్లాడుతూ, భారత భూభాగంలోకి ఎవరూ ప్రవేశించలేదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) చేసిన ప్రకటన చైనాను ఆహ్వానించినట్లుగా ఉందన్నారు. వాస్తవాధీన రేఖ (LAC) వెంబడి ఆక్రమించుకోవడానికి మళ్లీ రావాలని ఆహ్వానించినట్లు ఉందని వ్యాఖ్యానించారు. చైనా నుంచి సైనికపరంగా ఎదురయ్యే ముప్పును భారత్ ఎలా ఎదుర్కొనాలని ప్రశ్నించినపుడు రాహుల్ స్పందిస్తూ, ఆ ముప్పు స్వభావాన్నిబట్టి సైనికపరంగానే ప్రతిస్పందించాలన్నారు. చైనా నుంచి వాస్తవంగా ఎదురవుతున్న ముప్పును జైశంకర్, భారత ప్రభుత్వం అర్థం చేసుకోలేదన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను బట్టి ఆయనకు ముప్పు గురించి అవగాహన లేదని స్పష్టమవుతోందన్నారు.
ఇవి కూడా చదవండి :
AP Assembly: ఏపీ అసెంబ్లీ ప్రారంభం.. వాయిదా తీర్మానంపై టీడీపీ పట్టు.. గందరగోళం
Rahul Gandhi : చిక్కుల్లో రాహుల్?