Bharat Jodo Yatra : రాహుల్ కొంత దూరం నడిచాక ఇక నావల్ల కాదన్నారు : కాంగ్రెస్ సీనియర్ నేత
ABN , First Publish Date - 2023-02-12T12:18:45+05:30 IST
‘భారత్ జోడో యాత్ర’ను రాహుల్ గాంధీ 2022 సెప్టెంబరు 7న తమిళనాడులోని కన్యా కుమారి నుంచి ప్రారంభించారు.
న్యూఢిల్లీ : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) నిర్వహించిన భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra) కన్యా కుమారి నుంచి కశ్మీరు వరకు విజయవంతమైంది. అయితే కేరళలో ఈ యాత్ర అడుగు పెట్టేసరికి ఆయనను మోకాళ్ల నొప్పులు తీవ్రంగా బాధించాయి. దీంతో తాను ఆగిపోయి, మరొక నాయకుడికి బాధ్యతలను అప్పగించేందుకు రాహుల్ గాంధీ ప్రయత్నించారు. ఆయన సోదరి ప్రియాంక గాంధీ వాద్రా (Priyanka Gandhi Vadra) కూడా ఈ ఆలోచనను సమర్థించారు. కానీ ఫిజియోథెరపీ చేయడంతో ఆయన నడకను కొనసాగించగలిగారు. ఈ వివరాలను కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ (KC Venugopal) తెలిపారు.
‘భారత్ జోడో యాత్ర’ను రాహుల్ గాంధీ 2022 సెప్టెంబరు 7న తమిళనాడులోని కన్యా కుమారి నుంచి ప్రారంభించారు. ఈ ఏడాది జనవరి 30న కశ్మీరులో ముగిసింది. ఆయన దాదాపు 4,080 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. రెండు కేంద్ర పాలిత ప్రాంతాలు, 12 రాష్ట్రాల్లోని 75 జిల్లాలో ఈ యాత్ర సాగింది. మార్గమధ్యంలో అనేక చోట్ల సామాన్య ప్రజలతో ఆయన సంభాషించారు.
రాహుల్ గాంధీ సన్నిహితుడు, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కేరళలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, ఈ యాత్ర ప్రారంభమైన తొలి రోజుల్లో చాలా సున్నితమైన పరిస్థితి ఉందన్నారు. తనకు మోకాళ్ల నొప్పులు తీవ్రంగా ఉన్నాయని రాహుల్ గాంధీ చెప్పారన్నారు. ఈ యాత్ర నుంచి తాను వైదొలగి, మరొక నేత చేత యాత్రను కొనసాగించాలని ఆయన ఆలోచించారన్నారు. యాత్ర ప్రారంభమైన మూడో రోజున కేరళలో ప్రవేశించిందని, అప్పటికే ఆయన మోకాళ్ల నొప్పులు ఆయనను తీవ్రంగా వేధించాయని తెలిపారు.
‘‘ఓ రోజు రాత్రి రాహుల్ గాంధీ తన మోకాళ్ళ నొప్పుల తీవ్రత గురించి చెప్పడానికి నాకు ఫోన్ చేశారు. తనకు బదులుగా వేరొక నేత చేత ఈ యాత్రను కొనసాగించాలని చెప్పారు’’ అని వేణుగోపాల్ చెప్పారు.
ప్రియాంక గాంధీ వాద్రా కూడా తనకు ఫోన్ చేసి, తన సోదరుడు మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారని, ఈ యాత్రను కొనసాగించలేకపోవచ్చునని చెప్పారన్నారు.
అయితే రాహుల్ వైద్య బృందంలో ఓ ఫిజియెథెరపిస్ట్‌ను ఏర్పాటు చేయడంతో పరిస్థితి సద్దుమణిగిందన్నారు. గాంధీకి ఆ ఫిజియోథెరపిస్ట్ చికిత్స చేయడంతో ఆయన యాత్రను కొనసాగించారన్నారు. భగవంతుని దయతో ఆయన నొప్పులు తగ్గి, పరిస్థితి చక్కబడిందని తెలిపారు.