Rajastan:జల్ జీవన్ మిషన్ కుంభకోణం.. రాజస్థాన్‌లో 25 ప్రాంతాల్లో ఈడీ దాడులు..
ABN , First Publish Date - 2023-11-03T11:11:28+05:30 IST
రాజస్థాన్ లో సంచలనం సృష్టించిన జల్ జీవన్ మిషన్(Jal Jeevan Mission) కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై ఈడీ(ED) దాడులు కొనసాగుతున్నాయి. ఇవాళ ఏకకాలంలో రాష్ట్రంలోని 25 ప్రాంతాల్లో ఈడీ దాడులు నిర్వహించింది.
జైపుర్: రాజస్థాన్ లో సంచలనం సృష్టించిన జల్ జీవన్ మిషన్(Jal Jeevan Mission) కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై ఈడీ(ED) దాడులు కొనసాగుతున్నాయి. ఇవాళ ఏకకాలంలో రాష్ట్రంలోని 25 ప్రాంతాల్లో ఈడీ దాడులు నిర్వహించింది. జైపుర్(Jaipur)లోని పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన ఐఏఎస్ అధికారి సుబోధ్ కూడా ఇందులో ఉన్నారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం(PMLA) నిబంధనల ప్రకారం సంబంధిత వ్యక్తులను దర్యాప్తు చేస్తున్నామని అధికారులు చెప్పారు. సెప్టెంబర్ లో సైతం ఈ కేసులో ఈడీ ఇన్వెస్టిగేషన్ చేసింది. శ్రీ శ్యామ్ ట్యూబ్‌వెల్ కంపెనీ యజమాని పదమ్‌చంద్ జైన్, శ్రీ గణపతి ట్యూబ్‌వెల్ కంపెనీ యజమాని మహేశ్ మిట్టల్ తో పాటు మరికొందరు ప్రభుత్వ ఉద్యోగులకు లంచాలు ఇవ్వడంలో పాలుపంచుకున్నారని రాజస్థాన్ అవినీతి నిరోధక శాఖ(ACB) ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.
జల్ జీవన్ మిషన్ లో భాగంగా టెండర్ల నుంచి బిల్లుల వరకు వివిధ స్థాయిల్లో అక్రమాలు జరిగాయని ఏసీబీకి సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన ఆ శాఖ ఒక్కొక్కరిగా దర్యాప్తు ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వం చాలా రాష్ట్రాల్లో జల్ జీవన్ మిషన్ పథకాన్ని ప్రారంభించింది. దీని ముఖ్య ఉద్దేశం మారుమూల ప్రాంతాలకు సైతం స్వచ్ఛమైన తాగునీటిని ఇంటింటికీ అందించడం. ఈ పథకం అమలులో రాజస్థాన్(Rajastan)లో అక్రమాలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. త్వరలో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ఈడీ దాడులు రాజకీయ వేడిని రాజేశాయి. అధికార విపక్ష సభ్యుల మధ్య మాటల మంటలు తారాస్థాయికి చేరాయి. ప్రతిపక్షాలను లక్ష్యంగా చేసుకునేందుకు బీజేపీ ఆదేశాల మేరకు కేంద్ర సంస్థలు వ్యవహరిస్తున్నాయని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్(Ashok Gehlot) ఆరోపించారు. ఈ ఆరోపణల్ని బీజేపీ నేతలు ఖండిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అవినీతితో కూరుకుపోయిందని.. రాష్ట్ర ప్రజలు ఆ పార్టీని ఇంటికి సాగనంపేందుకు సిద్ధమయ్యారని విమర్శించారు.