Yamuna Floods : ఢిల్లీలో మళ్లీ కురుస్తున్న వర్షాలు.. యమునా నదిలో ప్రమాద స్థాయి దాటిన నీటి మట్టం..
ABN , First Publish Date - 2023-07-16T10:53:42+05:30 IST
ఢిల్లీ ప్రజల వరద కష్టాలు ఇంకా తీరడం లేదు. తాజాగా మళ్లీ మొదలైన వర్షాల వల్ల యమునా నదిలో నీరు ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తోంది. అయితే ఆదివారం రాత్రికి ఈ నదిలో నీటిమట్టం తగ్గే అవకాశం ఉందని సెంట్రల్ వాటర్ కమిషన్ తెలిపింది.
న్యూఢిల్లీ : ఢిల్లీ ప్రజల వరద కష్టాలు ఇంకా తీరడం లేదు. తాజాగా మళ్లీ మొదలైన వర్షాల వల్ల యమునా నదిలో నీరు ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తోంది. అయితే ఆదివారం రాత్రికి ఈ నదిలో నీటిమట్టం తగ్గే అవకాశం ఉందని సెంట్రల్ వాటర్ కమిషన్ తెలిపింది. ఆదివారం కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఓవైపు బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య బురద రాజకీయాలు నడుస్తుండగా, ప్రజలు వరదలతో పోరాడుతున్నారు.
యమునా నదిలో నీటి మట్టం 205.33 మీటర్లు దాటితే ప్రమాద స్థాయిని దాటినట్లు. ఆదివారం ఉదయానికి ఇది 206.02 మీటర్లు ఉంది. ఆదివారం రాత్రి 10 గంటలకు ఇది 205.75 మీటర్లకు తగ్గిపోయే అవకాశం ఉందని సెంట్రల్ వాటర్ కమిషన్ తెలిపింది. 45 ఏళ్లలో తొలిసారి భారీ వర్షపాతం, వరదలు రావడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారని అనుకునేసరికి శనివారం రాత్రి మళ్లీ వర్షాలు మొదలయ్యాయి. ఆదివారం కూడా వర్షాలు కురుస్తున్నాయి. అయితే వర్షాలు పడుతున్నప్పటికీ యమునా నదిలో నీటి మట్టం పెరగడం లేదని అధికారులు చెప్తున్నారు. హర్యానాలోని బీజేపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే హత్నికుండ్ బ్యారేజి నుంచి నీటిని యమునా నదిలోకి వదిలిపెట్టిందని ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. అయితే దీనిని హర్యానా ప్రభుత్వం ఖండించింది.
ప్రధాని మోదీ సమీక్ష
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) ఫ్రాన్స్, యూఏఈ పర్యటన ముగించుకుని ఢిల్లీ చేరుకున్న వెంటనే ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాతో మాట్లాడారు. ఢిల్లీలో వరద పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.
నీటి సరఫరా పునరుద్ధరణ
నగరంలోని వజీరాబాద్, చంద్రావల్ నీటి శుద్ధి కేంద్రాలు ఆదివారం నుంచి కార్యకలాపాలను ప్రారంభిస్తాయని, నగరంలో నీటి సరఫరా సాధారణ స్థాయిలో ఆదివారం నుంచి జరుగుతుందని అధికారులు తెలిపారు.
ఇవి కూడా చదవండి :
Uniform Civil Code : ఉమ్మడి పౌర స్మృతిపై కాంగ్రెస్ రహస్య సమావేశం
S Jaishankar : ఉత్తమ దౌత్యవేత్త హనుమంతుడు : ఎస్ జైశంకర్