Assembly Elections: రాజస్థాన్‌లో పోలింగ్ ప్రారంభం.. మొత్తం ఎన్ని స్థానాల్లో అంటే..?
ABN , First Publish Date - 2023-11-25T09:20:32+05:30 IST
ఎడారి రాష్ట్రం రాజస్థాన్‌లో పోలింగ్ ప్రారంభమైంది. ఉదయాన్నే అధికారులు ఈవీఎమ్ బాక్స్‌లతో పోలింగ్ బూతులకు చేరుకున్నారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది.
జైపూర్: ఎడారి రాష్ట్రం రాజస్థాన్‌లో పోలింగ్ ప్రారంభమైంది. ఉదయాన్నే అధికారులు ఈవీఎమ్ బాక్స్‌లతో పోలింగ్ బూతులకు చేరుకున్నారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. మొత్తం ఐదు రాష్ట్రాలు రాజస్థాన్, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా నేడు ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో ఓటర్లంతా తమ ఓటు హక్కను వినియోగించుకోవడానికి ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. పలు చోట్లు ఇప్పటికే భారీ ఎత్తును క్యూలైన్‌లు కనిపిస్తున్నాయి. ఇప్పటికే పలువురు ఓటు వేశారు. మరికొన్ని చోట్ల మాత్రం ఓటింగ్ నెమ్మదిగా మొదలైంది. సమయం గడిచే కొద్దీ పుంజుకుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. పోలింగ్ సమయంలో ఎక్కడా ఉద్రికత్త పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటుచేశారు.
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలను నేడు ఒకే దశలో నిర్వహిస్తున్నారు. డిసెంబర్ 3న మిగతా 4 రాష్ట్రాలతో కలిపి రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా వెలువడనున్నాయి. రాజస్థాన్‌లో ప్రధాన పోటీ అధికార కాంగ్రెస్, కేంద్రంలోని బీజేపీ మధ్య ఉంది. రాజస్థాన్‌లో 200 అసెంబ్లీ స్థానాలకు గాను 199 సీట్లకు ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. శ్రీగంగానగర్ జిల్లా కరణ్‌పూర్ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి, సిటింగ్ ఎమ్మెల్యే గుర్మీత్‌సింగ్ కునర్ ఆకస్మిక మరణంతో అక్కడి ఎన్నికను వాయిదా వేశారు. కాగా 199 స్థానాలకు 1,862 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. మొత్తం ఓటర్లు 5,25,38,105 మంది కాగా.. వీరిలో మూడో వంతు మంది (1,70,99,334) 18-30 ఏళ్ల వయసు వారే కావడం గమనార్హం. వీరిలోనూ 22,61,008 మంది (18-19 ఏళ్లవారు) తొలి సారి ఓటు వేస్తున్నవారు ఉన్నారు. ఓటర్లలో పురుషుల సంఖ్య 2.73 కోట్లుగా మహిళా ఓటర్ల సంఖ్య 2.52 కోట్లుగా ఉంది. కాగా 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 100 స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కైవసం చేసుకుంది. 73 స్థానాల్లో గెలిచిన బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నది. స్వతంత్రులు-13, బీఎస్పీ-6, ఆర్‌ఎల్‌పీ-3, సీపీఎం-2, బీటీపీ-2, ఆర్‌ఎల్‌డీ ఒక స్థానంలో విజయం సాధించాయి.