Opposition Meet Updates: విపక్షాల సమావేశంలో రెండో రోజు పాల్గొననున్న శరద్‌ పవార్

ABN , First Publish Date - 2023-07-17T12:42:08+05:30 IST

బెంగళూరులో జరుగుతున్న విపక్షాల సమావేశంలో ఎన్సీపీ అధినేత శరద్‌పవార్ రెండో రోజు పాల్గొననున్నారు. కూతురు సుప్రియా సూలేతో కలిసి ఆయన ఈ సమావేశానికి హాజరుకానున్నారు.

Opposition Meet Updates: విపక్షాల సమావేశంలో రెండో రోజు పాల్గొననున్న శరద్‌ పవార్

బెంగళూరు: బెంగళూరులో జరుగుతున్న విపక్షాల సమావేశంలో ఎన్సీపీ అధినేత శరద్‌పవార్ రెండో రోజు పాల్గొననున్నారు. కూతురు సుప్రియా సూలేతో కలిసి ఆయన ఈ సమావేశానికి హాజరుకానున్నారు. ఈ మేరకు ఎన్సీపీ పార్టీ వర్గాలు అధికారికంగా వెల్లడించాయి. విపక్షాల సమావేశంలో శరద్‌పవార్ పాల్గొనడం లేదనే వార్తలను ఎన్సీపీ ఖండించింది. 82 ఏళ్ల శరద్ పవార్ విపక్షాల సమావేశంలో మొదటి రోజు పాల్గొనరని, రెండో రోజు పాల్గొంటారని వెల్లడించింది. ఈ సమావేశానికి మహారాష్ట్ర నుంచి శరద్‌ పవార్‌తోపాటు శివసేన అధినేత, మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే కూడా హాజరవుతున్నారు. కాగా గత నెల 23న బిహార్‌లోని పాట్నాలో జరిగిన విపక్షాల సమావేశంలో శరద్‌పవార్ పాల్గొన్నారు. అంతేకాకుండా ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా విపక్షాలను ఏక చేయడంలో శరద్ పవార్ కీలక పాత్ర పోషించారు.


ఇటీవల శరద్ పవార్ పార్టీలో సంక్షోభం ఏర్పడిన సంగతి తెలిసిందే. మేనల్లుడు అజిత్ పవార్.. శరద్ పవార్‌పై తిరుగుబాటు చేశారు. తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వంలో కలిసిపోయారు. ఈ క్రమంలోనే అజిత్ పవార్‌ను డిప్యూటీ సీఎం పదవి వరించగా.. ఆయన వర్గం ఎమ్మెల్యేల్లో పలువురికి మంత్రి పదవులు కూడా దక్కాయి. ఇక బెంగళూరులో జరుగుతున్న ఈ విపక్షాల సమావేశంలో మొత్తం 26 పార్టీలు పాల్గొంటున్నాయి. ఈ సమావేశంలో కాంగ్రెస్, ఆర్‌ఎల్‌డీ, ఎండీఎంకే, కేడీఎంకే, వీసీకే, ఆర్‌ఎస్పీ, ఫార్వర్డ్‌ బ్లాక్‌, ఐయూఎంఎల్‌, కేరళ కాంగ్రెస్‌ తదితర పార్టీలు పాల్గొంటున్నాయి. రెండు రోజుల సమావేశం అనంతరం అంటే మంగళవారం సాయంత్రం విపక్ష నేతలంతా కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఈ సమావేశంలోనే విపక్ష కూటమి పేరును ప్రకటించనున్నారని సమాచారం.

Updated Date - 2023-07-17T12:47:24+05:30 IST