Pawar Vs Pawar : శరద్ వర్సెస్ అజిత్.. ఎమ్మెల్యేల మద్దతు ఎవరికి?.. నేడు కీలక సమావేశాలు..

ABN , First Publish Date - 2023-07-05T11:59:55+05:30 IST

మహారాష్ట్రలో ‘పవార్’ గేమ్‌లో కీలక ఘట్టం బుధవారం కనిపించబోతోంది. ఎన్‌సీపీలోని శరద్ పవార్, అజిత్ పవార్ బలాబలాలు తేలిపోబోతున్నాయి. అధికార పక్షంతో చేతులు కలిపిన అజిత్ పవార్‌తోపాటు, మరాఠా రాజకీయ దిగ్గజం శరద్ పవార్ కూడా ఎమ్మెల్యేల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇరువురి మద్దతుదారులు తమ నేత ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరవుతున్నారు.

Pawar Vs Pawar : శరద్ వర్సెస్ అజిత్.. ఎమ్మెల్యేల మద్దతు ఎవరికి?.. నేడు కీలక సమావేశాలు..
Sharad Pawar, Ajit Pawar

ముంబై : మహారాష్ట్రలో ‘పవార్’ గేమ్‌లో కీలక ఘట్టం బుధవారం కనిపించబోతోంది. ఎన్‌సీపీలోని శరద్ పవార్, అజిత్ పవార్ బలాబలాలు తేలిపోబోతున్నాయి. అధికార పక్షంతో చేతులు కలిపిన అజిత్ పవార్‌తోపాటు, మరాఠా రాజకీయ దిగ్గజం శరద్ పవార్ కూడా ఎమ్మెల్యేల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇరువురి మద్దతుదారులు తమ నేత ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరవుతున్నారు. మరోవైపు అసలైన ఎన్‌సీపీ తమదేనని అజిత్ పవార్ వర్గం ఎన్నికల కమిషన్‌ను ఆశ్రయించబోతోంది. అంతకుముందే శరద్ పవార్ అప్రమత్తమై ఎన్నికల కమిషన్ వద్ద కెవియెట్ దాఖలు చేశారు.

ఎన్‌సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రియ సూలే ఇచ్చిన ట్వీట్‌లో, 83 ఏళ్ల యోధుడు శరద్ పవార్‌కు మద్దతివ్వాలని పార్టీ కార్యకర్తలను కోరారు. బుధవారం వైబీ చవాన్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరుకావాలని కోరారు. ఆమె ఈ సమావేశానికి హాజరయ్యారు.

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ముంబైలోని బాంద్రాలో ఎమ్మెల్యేల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఎంఈటీ భుజ్‌బల్ నాలెడ్జ్ సిటీలో జరిగే ఈ సమావేశానికి ఆయన మద్దతుదారుల రాక ప్రారంభమైంది. ఆయన నివాసం దేవగిరి బంగళాలో ఆయనను కొందరు మద్దతుదారులు కలిశారు.

ఎమ్మెల్యేలకు విప్ జారీ

శరద్ పవార్, అజిత్ పవార్ ఎన్‌సీపీ ఎమ్మెల్యేలకు విప్ జారీ చేశారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఆఫీస్ బేరర్లు హాజరు కావాలని ఇరువురూ ఆదేశించారు. అజిత్ పవార్ వర్గంపై అనర్హత వేటు పడకుండా ఉండాలంటే కనీసం 36 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర శాఖ అధ్యక్షుడు జయంత్ పాటిల్ వీడియో సందేశాలను విడుదల చేశారు. పార్టీ ఆఫీస్ బేరర్లు, నేతలు వైబీ చవాన్ సెంటర్‌లో జరిగే సమావేశానికి హాజరుకావాలని కోరారు. మనందరికీ శరద్ పవార్ మార్గదర్శనం చేస్తారన్నారు. చీఫ్ విప్ జితేంద్ర అవధ్ కూడా విప్ జారీ చేశారు.

అజిత్ పవార్ కూడా ఎన్‌సీపీ సీనియర్ నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు, ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి మాట్లాడుతున్నారు. పార్టీని తన నియంత్రణలోకి తీసుకోవడం కోసం కొందరు ఎమ్మెల్యేలు, సీనియర్ ఆఫీస్ బేరర్ల నుంచి అఫిడవిట్లను తీసుకున్నారు.

వీథి పోరాటం

అజిత్ పవార్, ఛగన్ భుజ్‌బల్ మద్దతుదారులు మంగళవారం నాసిక్ నగరంలోని పార్టీ కార్యాలయాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీంతో శరద్ పవార్ వర్గం తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. శరద్ వర్గం నేతలు కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు, కానీ వారిని పోలీసులు అడ్డుకున్నారు.

ఎన్‌సీపీ వివాదం త్వరలో ఈసీ వద్దకు..

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) పేరు, ఎన్నికల గుర్తు తమకే దక్కాలని అజిత్ పవార్ వర్గం త్వరలో ఎన్నికల కమిషన్ (EC)ని ఆశ్రయించబోతోంది. దీనిని ముందే పసిగట్టిన శరద్ పవార్ వర్గం ఈసీ వద్ద కెవియెట్ దాఖలు చేసింది. ఏదైనా నిర్ణయం తీసుకోవడానికి ముందు తమ వాదన వినాలని కోరింది. అజిత్ వర్గం ఈసీని ఆశ్రయించడానికి ముందు బుధవారం జరిగే సమావేశం విజయవంతమవడం చాలా ముఖ్యం.

శరద్ పవార్‌కు ఝలక్ ఇచ్చిన అజిత్ పవార్, మరో ఎనిమిది మంది ఎన్‌సీపీ ఎమ్మెల్యేలు జూలై 2న ఏక్‌నాథ్ షిండే మంత్రివర్గంలో చేరిన సంగతి తెలిసిందే. ఎన్‌సీపీకి 53 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో అజిత్ పవార్‌కు ఎందరు మద్దతిస్తున్నదీ బుధవారం స్పష్టంగా తెలిసిపోయే అవకాశం ఉంది. అజిత్ పవార్‌కు 24 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, శరద్ పవార్‌ను 14 మంది ఎమ్మెల్యేలు సమర్థిస్తున్నారని తెలుస్తోంది. మిగిలిన ఎమ్మెల్యేల గురించి స్పష్టత లేదు. అయితే తనకు 40 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని అజిత్ పవార్ చెప్తున్నారు.

శరద్ ఫొటో వివాదం

తన ఫొటోను వాడుకోవద్దని అజిత్ పవార్ వర్గాన్ని శరద్ పవార్ హెచ్చరించినప్పటికీ, అజిత్ పవార్ పట్టించుకోవడం లేదు. శరద్ పవార్ ఫొటోతో కూడిన పోస్టర్లను అజిత్ నిర్వహిస్తున్న సమావేశ ప్రాంగణంలో ఏర్పాటు చేశారు.

అజిత్ పవార్ మద్దతుదారు, రాష్ట్ర మంత్రి ఛగన్ భుజ్‌బల్ మాట్లాడుతూ, తమ మద్దతుదారులు ఎందరో వేదికపై చూడవచ్చునని చెప్పారు. తమ మద్దతుదారులు తమ వివరాలను తెలియజేస్తూ పత్రాలపై సంతకాలు చేస్తున్నారన్నారు.

ఇవి కూడా చదవండి :

Destination weddings: శివపార్వతులు సత్య యుగంలో పెళ్లి చేసుకున్న చోట పెరుగుతున్న పెళ్లిళ్లు

Quran Desecration : స్వీడన్‌లో ఖురాన్‌కు అవమానం.. పాకిస్థాన్ ప్రభుత్వం నిరసన..

Updated Date - 2023-07-05T11:59:55+05:30 IST