Karnataka Assembly Polls: డీకే ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై సిద్ధూ క్లారిటీ...

ABN , First Publish Date - 2023-04-04T17:17:05+05:30 IST

మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్‌(DK Shiva Kumar) ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై మరోసారి క్లారిటీ ఇచ్చారు.

Karnataka Assembly Polls:  డీకే ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై సిద్ధూ క్లారిటీ...
Siddaramaiah remarks on CM post

బెంగళూరు: కర్ణాటక శాసన సభ ఎన్నికల (Karnataka Assembly Polls) వేళ కాంగ్రెస్‌ (Congress) పార్టీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్‌(DK Shiva Kumar) ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై మరోసారి క్లారిటీ ఇచ్చారు. డీకేకు కూడా సీఎం అభ్యర్థిత్వంపై ఆసక్తి ఉండి ఉండొచ్చని అయితే తాను ముఖ్యమంత్రి అభ్యర్థి అని పునరుద్ఘాటించారు. డీకేకు సీఎం కావాలని ఉన్నా వంద శాతం తానే ముఖ్యమంత్రి అభ్యర్థిని అని సిద్ధూ ఇటీవలే ప్రకటించుకున్నారు. తన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందని సిద్ధూ చెప్పుకొచ్చారు. డీకేపై అధిష్టానం సంతృప్తిగా లేదని తాను అనలేదంటూ సిద్ధూ వివరణ ఇచ్చారు.

దీనిపై డీకే కూడా స్పందించారు. ముందు బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని డీకే చెబుతున్నారు. మే 10న జరిగే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 115 నుంచి 127 స్థానాలతో విజయదుందుభి మోగించనుందని ఒపీనియన్‌ పోల్‌ సర్వే తెలిపింది.

కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ ఢిల్లీలో నేడు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల రెండో జాబితా విడుదల చేయనుంది. ఈ తరుణంలో సీఎం సీటుపై తగవులు తగవని కాంగ్రెస్ పార్టీ పెద్దలు సూచిస్తున్నా ప్రకటనలు వస్తూనే ఉన్నాయి. ఇవే తనకు చివరి ఎన్నికలని చెబుతూ వస్తోన్న సిద్ధరామయ్య ఎన్నికల నోటిఫికేషన్ వేళ డీకేను బిత్తరపోయేలా చేశారు. వాస్తవానికి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే డీకే శివకుమార్ సీఎం పదవి చేపట్టాలని అభిలషిస్తున్నారు. గడచిన ఐదేళ్లుగా కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి అన్నీ తానై నడిపిస్తున్న డీకేకు సిద్ధూ తాజా ప్రకటన గొంతులో వెలక్కాయ పడ్డ చందంగా తయారైంది. జి. పరమేశ్వర కూడా గతంలో సీఎం కుర్చీ తనకు కావాలని ప్రకటనలు కూడా చేశారు.

కర్ణాటకలో ఐదేళ్లుగా బీజేపీ పాలన సాగింది. బస్వరాజ్ బొమ్మై పాలనలో అవినీతి పెరిగిందని ఆరోపిస్తోన్న కాంగ్రెస్ పార్టీ బీజేపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకూడదని యత్నించాల్సింది పోయి సీఎం కుర్చీ కోసం నేతలు తగవులాడుకునే పరిస్థితి ఏర్పడితే పార్టీకే నష్టమని రాజకీయ పరిశీలకులు హెచ్చరిస్తున్నారు. రాహుల్ ఎంపీ అభ్యర్ధిత్వం నేపథ్యంలో వచ్చిన సానుభూతిని ఓట్ల సునామీగా మార్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీ నేతలు యత్నించాలని అధిష్టానం సూచిస్తున్నా... రాష్ట్ర స్థాయిలో కుమ్ములాటలు చెడ్డపేరు తెస్తున్నాయి.

ఓవైపు డబుల్ ఇంజిన్ సర్కారు నినాదంతో మరో ఛాన్స్ ఇవ్వాలని బీజేపీ దూకుడుగా ప్రచారం చేస్తోంది. నేరుగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) , కేంద్ర హోం మంత్రి అమిత్ షా(Amit Shah), బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda), యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ (Yogi), మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యెడియూరప్ప (BS Yediyurappa) తదితరులు కర్ణాటకలో విస్తృతంగా పర్యటిస్తూ ఓటర్లకు నచ్చచెబుతున్నారు. హిజాబ్ వివాదం, టిప్పు సుల్తాన్ వివాదం, హలాల్ వివాదం, పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాపై కఠిన చర్యలు, ముస్లిం రిజర్వేషన్ల రద్దు తదితర అంశాలు ఇటీవల కర్ణాటకలో ప్రధానాంశాలయ్యాయి. బీజేపీ ఇటీవలే 4 శాతం రిజర్వేషన్లను ఒక్కలిగ, లింగాయత్‌ కులాలకు 2శాతం చొప్పున కేటాయించారు. దీంతో 2సీలోని ఒక్కలిగ(Vokkaligas) రిజర్వేషన్లు 4శాతం నుంచి 6 శాతానికి, 2డీలోని లింగాయత్‌ (Lingayat) రిజర్వేషన్లు 5 శాతం నుంచి 7 శాతానికి పెరిగాయి. ముస్లింలు కోర్టును ఆశ్రయించినా ఇబ్బందులు రాకుండా ఉండేందుకు వారిని 10 రిజర్వేషన్‌ ఉన్న ఈడబ్ల్యూఎస్‌లో చేర్చారు. అలాగే ఎస్సీ రిజర్వేషన్లను 15 శాతం నుంచి 17 శాతానికి, ఎస్టీ రిజర్వేషన్‌ను 3 శాతం నుంచి 7 శాతానికి పెంచారు. మొత్తం రిజర్వేషన్లను 50 శాతం నుంచి 56 శాతానికి పెంచారు. హిజాబ్ వివాదం, టిప్పు సుల్తాన్ వివాదం, హలాల్ వివాదం, తదితర అంశాలు ఎన్నికల్లో కీలకం కానున్నాయి.

కర్ణాటకలో గెలిస్తే అదే ఊపును మరో ఆరు నెలల్లో జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ(Telangana Assembly Polls) ప్రదర్శించేందుకు బీజేపీకి అవకాశం చిక్కుతుంది. మరో ముఖ్యమైన అంశం ఏంటంటే 2024 లోక్‌సభ ఎన్నికలు(2024 Lok Sabha Polls) కూడా సమీపిస్తుండటంతో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలంటే కర్ణాటకలో కూడా గెలిచి తీరాల్సిందే. 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కర్ణాటకలో బీజేపీ ఎంపీలు 28 మంది గెలిచారు. ఒక రకంగా బీజేపీ మ్యాజిక్ నెంబర్ 272ను దాటడంలో కర్ణాటక కీలక పాత్ర పోషించినట్లైంది. మే 10న జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కనుక ఓటమి పాలైతే బీజేపీ ఉత్తరాది పార్టీ అని తేలిపోయిందంటూ కాంగ్రెస్, ఇతర పార్టీలు ప్రచారం చేస్తాయి. అంతేకాదు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ దూకుడుగా వ్యవహరించలేదు. అధికారం కోల్పోతే 2024 లోక్‌సభ ఎన్నికల్లోనూ ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయి.

జేడీఎస్ (JDS)కూడా ఎన్నికల ప్రచారం జోరుగా సాగిస్తోంది. ఇప్పటికే అనేక చోట్ల అభ్యర్థులను ప్రకటించి ప్రభుత్వ వ్యతిరేక ఓటు తమ పార్టీకి పడేలా జేడీఎస్ వ్యూహాత్మక ప్రచారం సాగిస్తోంది. ఎక్కువ ఎమ్మెల్యే సీట్లు సంపాదించి కింగ్ మేకర్‌ పాత్ర పోషించాలని జేడీఎస్ అధినేత కుమారస్వామి(Kumara Swami) యోచిస్తున్నారు.

ఎంఐఎం(MIM) కూడా ముస్లిం ఓట్లు గంపగుత్తగా తమ పార్టీకే పడేలా వ్యూహాలు రచిస్తోంది. కర్ణాటకలో ఇటీవల జరిగిన పరిణామాలతో ముస్లింలు ఎంఐఎంకు దగ్గరౌతున్నారని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఇదే జరిగితే ముస్లిం ఓట్లను ఆశిస్తోన్న కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలినట్లేనంటున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలడంతో పాటు ముస్లింల ఓట్లను ఎంఐఎం పార్టీ రాబట్టుకుంటే నేరుగా బీజేపీకి లాభిస్తుందంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉందంటున్నారు.

వరుసగా ఏ పార్టీకీ అధికారం కట్టబెట్టని కన్నడిగులు ఈసారి ఏ పార్టీని గెలిపిస్తారో అనేది సస్పెన్స్ గా మారింది.

224మంది సభ్యులున్న కర్ణాటక అసెంబ్లీలో బీజేపీకి 119మంది, కాంగ్రెస్‌‌కు 75 మంది, జేడీఎస్‌కు 28మంది సభ్యులుండగా 2సీట్లు ఖాళీగా ఉన్నాయి.

కర్ణాటక (Karnataka)లో మే 10న ఎన్నికలు నిర్వహించనున్నారు. ఓట్ల లెక్కింపు మే 13న జరుగుతుందని ఎన్నికల కమిషన్ ప్రకటించింది.

Updated Date - 2023-04-04T17:29:08+05:30 IST