Heavy Rains: రాష్ట్రాన్ని వణికిస్తున్న భారీ వర్షాలు.. ఆరుగురు చిన్నారులు మృతి!

ABN , First Publish Date - 2023-10-02T14:26:01+05:30 IST

జార్ఖండ్ రాష్ట్రాన్ని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. శనివారం నుంచి ఎడతెరిపి లేకుండా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తుండడంతో అనేక ప్రాంతాలు నీట మునిగాయి. జన జీవనం స్తంభించిపోయింది.

Heavy Rains: రాష్ట్రాన్ని వణికిస్తున్న భారీ వర్షాలు.. ఆరుగురు చిన్నారులు మృతి!

రాంచీ: జార్ఖండ్ రాష్ట్రాన్ని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. శనివారం నుంచి ఎడతెరిపి లేకుండా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తుండడంతో అనేక ప్రాంతాలు నీట మునిగాయి. జన జీవనం స్తంభించిపోయింది. చెరువులు, నదులు, కల్వర్టులు, కుంటలు పొంగిపోర్లుతున్నాయి. దీంతో రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. గత 24 గంటల్లో పిడుగులతో కూడిన భారీ వర్షం కురిసింది. పిడుగులతో కూడిన భారీ వర్షం కారణంగా 8 మంది ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారిలో ఏకంగా ఆరుగురు చిన్నారులు ఉండడం బాధాకరం. ఆదివారం రాంచీలోని లాల్‌పూర్ ప్రాంతంలో గల హత్మా సరైతాండ్‌లో 28 ఏళ్ల వ్యక్తి పొంగిపొర్లుతున్న కాలువలో పడిపోయాడు. అయితే సోమవారం ఉదయం దేవ్ ప్రసాద్ అలియాస్ చోటూ అనే వ్యక్తి మృతదేహాన్ని సంఘటన స్థలానికి 2.5 కిలోమీటర్ల దూరంలో స్వాధీనం చేసుకున్నారు. "ఈ రోజు ఉదయం ఓ వ్యక్తి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నాం. పోస్ట్‌మార్టం కూడా నిర్వహించారు. ఆదివారం భారీ వర్షం కారణంగా పొంగిపొర్లుతున్న కాలువలో అతను పడిపోయాడు" అని గోండా పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ రవి ఠాకూర్ తెలిపారు.


జార్ఖండ్‌లోని జమ్తారా జిల్లాలో ఆదివారం పిడుగుపాటుకు గురై ఓ తల్లి ఆమె ముగ్గురు పిల్లలు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పిల్లల వయసు ఏడాదిన్నర నుంచి ఏడేళ్ల మధ్య ఉంటుంది. ఈ సంఘటన చందాదిహ్ లఖన్‌పూర్‌లో జరిగిందని నారాయణపూర్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ దిలీప్ కుమార్ తెలిపారు. బొకారో జిల్లాలో మట్టి గోడ కూలిపోవడంతో ఒక చిన్నారి మృతి చెందగా, పాలము జిల్లాలోని మాయాపూర్ గ్రామంలోని 9, 12 సంవత్సరాల వయస్సు గల ఇద్దరు బాలికలు చెరువులో మునిగి మరణించారని పోలీసులు చెప్పారు. భారీ వర్షం కారణంగా రోడ్లు, కల్వర్టులు కొట్టుకుపోయాయి. ఆదివారం రాత్రి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా రాంచీలోని రాటు ప్రాంతంలో NH-39పై రోడ్డు మళ్లించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. వర్షం ధాటికి రోడ్డు మళ్లింపు కొట్టుకుపోయింది. దీంతో రాంచీ-దాల్తోన్‌గంజ్ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. రాష్ట్రంలోని పలు నదుల్లో నీటి మట్టాలు ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. రాష్ట్ర రాజధాని రాంచీలో వర్షాల తీవ్రత తగ్గినప్పటికీ, లోహర్దగా, గుమ్లా, సిమ్‌డేగా ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో ఆరెంజ్ అలర్ట్ కూడా ప్రకటించింది. కాగా అల్పపీడన వ్యవస్థ ప్రభావంతో జార్ఖండ్‌లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని రాంచీ వాతావరణ కేంద్రం ఇన్‌ఛార్జ్ అభిషేక్ ఆనంద్ తెలిపారు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో అక్టోబర్ 4 వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆయన చెప్పారు.

Updated Date - 2023-10-02T14:26:01+05:30 IST