Heavy rains: భారీ వర్షాల కారణంగా నేడు విద్యా సంస్థలకు సెలవు.. అనేక రైళ్లు రద్దు
ABN , Publish Date - Dec 18 , 2023 | 08:17 AM
తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు జిల్లాలోని విద్యా సంస్థలకు సోమవారం రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. భారీ వర్షాలు కురుస్తున్న తిరునెల్వేలి, తూత్తుకుడి, కన్యాకుమారి, తెన్‌కాసి జిల్లాలోని విద్యా సంస్థలకు సెలవు ఇచ్చారు.
చెన్నై: తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు జిల్లాలోని విద్యా సంస్థలకు సోమవారం రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. భారీ వర్షాలు కురుస్తున్న తిరునెల్వేలి, తూత్తుకుడి, కన్యాకుమారి, తెన్‌కాసి జిల్లాలోని విద్యా సంస్థలకు సెలవు ఇచ్చారు. వీటితోపాటు విరుధ్‌నగర్ జిల్లాలో కూడా విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. విద్యా సంస్థలతోపాటు ప్రైవేట్ సంస్థలు, బ్యాంకులు వంటి వాటికి కూడా భారీ వర్షాల కారణంగా సోమవారం సెలవు ఇచ్చారు. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం తమిళనాడు, కేరళలో సోమవారం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. ప్రధానంగా దక్షిణ తమిళనాడు, దక్షిణ కేరళ, లక్షద్వీప్‌లలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.
దక్షిణ తమిళనాడులో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా ఉంది. తూత్తుకుడి ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పలు ప్రాంతాలు వరద ముంపునకు గురవుతున్నట్టు సమాచారం. వర్షాల ప్రభావం రైల్వే ప్రయాణాలపై కూడా పడింది. భారీ వర్షాల కారణంగా రైల్వే ట్రాకులు నీట మునిగాయి. రైల్వే యారుల్లోకి వర్షపు నీరు చేరింది. దీంతో పలు రైళ్లను రద్దు చేశారు. అనేక రైళ్లు పాక్షికంగా రద్దయ్యాయి. ప్రస్తుతం తూత్తుకుడిలో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. తూత్తుకుడి జిల్లాలోని కోవిల్‌పట్టి, ఎట్టయపురం, విలాతికుళం, కలుగుమలై, కయతార్, కదంబూర్, వెంబర్, సురంగుడి వంటి ప్రాంతాల్లో ఆదివారం ఉదయం నుంచి నిరంతరాయంగా వర్షం కురుస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కోవిల్‌పట్టి చుట్టుపక్కల ఉన్న నదులు, సరస్సులు పూర్తి నిండుకున్నాయి, దీంతో నదులు, సరస్సులు పొంగిపొర్లుతున్నాయి. వాతావరణ నివేదిక ప్రకారం నేడు కన్యాకుమారి, తిరునెల్‌వెల్లి, తూత్తూకుడి, రామాంతపురం, పూడుకొట్టాయి, తంజావుర్ జిల్లాలోని ఒకటి రెండు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. మంగళవారం కూడా ఈ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి.
తమిళనాడు మంత్రి రామచంద్రన్ మాట్లాడుతూ.. ప్రభుత్వం అవసరమైన సహాయక చర్యలు చేపడుతుందని చెప్పారు. రాష్ట్రానికి చెందిన 250 స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్(ఎస్‌డీఆర్‌ఎఫ్), నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్(ఎన్డీఆర్‌ఎఫ్) బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నట్టు చెప్పారు. "కోవిల్‌పట్టి పంచాయతీలోని 40 సరస్సులు పూర్తిగా నిండిపోయాయి. రెండు సరస్సులు దెబ్బతిన్నాయి. మేము వాటిని బాగు చేసాము. ఇతర సరస్సులను కూడా నిరంతరం పర్యవేక్షిస్తున్నాము" అని తూత్తుక్కుడి జిల్లా అభివృద్ధి అధికారి రాజేష్ తెలిపారు. భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో సహాయక శిబిరాలు కూడా ఏర్పాటుచేశారు. తిరునల్వేలిలో 19, కన్యాకుమారిలో నాలుగు, తూత్తుకుడిలో రెండు, తెన్‌కాసి జిల్లాలో ఒక శిబిరాన్ని ఏర్పాటు చేశారు.