Rahul Gandhi Vs Dhankar : రాహుల్ గాంధీకి ఉప రాష్ట్రపతి ధన్‌కర్ చురకలు
ABN , First Publish Date - 2023-06-07T11:02:18+05:30 IST
అమెరికాలో చేసిన వ్యాఖ్యలపై ఉప రాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌కర్న ర్మగర్భంగా స్పందించారు.
న్యూఢిల్లీ : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Congress leader Rahul Gandhi) అమెరికాలో చేసిన వ్యాఖ్యలపై ఉప రాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌కర్ (Vice President Jagdeep Dhankhar) నర్మగర్భంగా స్పందించారు. దేశంలోని వ్యవస్థలపై బురదజల్లేవారిని దూరం పెట్టాలంటే రియర్‌వ్యూ మిర్రర్‌లో చూడాలన్నారు. యాక్సిడెంట్ చేయాలని నిర్ణయించుకున్నవారి నుంచి తప్పించుకోవడం కోసం రియర్‌వ్యూ మిర్రర్‌లో చూడాలని చెప్పారు.
రాహుల్ గాంధీ ఇటీవల అమెరికాలో ఓ కార్యక్రమంలో భారతీయ మూలాలుగలవారితో మాట్లాడుతూ, బీజేపీ (BJP), ఆరెస్సెస్ (RSS)లపై విరుచుకుపడ్డారు. భవిష్యత్తు వైపు చూసే సామర్థ్యం వీటికి లేదన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) భారతీయ కారును రియర్‌వ్యూ మిర్రర్‌లో చూస్తూ నడుపుతున్నారని, దీనివల్ల ఒకదాని తర్వాత మరో యాక్సిడెంట్ అవుతుందని వ్యాఖ్యానించారు. ఇది మోదీ విధానమని, ఆయన రియర్‌వ్యూ మిర్రర్‌లో మాత్రమే చూస్తారని, కారు ఎందుకు ప్రమాదానికి గురవుతోందో అర్థం చేసుకోలేరని చెప్పారు. ఈ కార్యక్రమం న్యూయార్క్‌లోని జవిట్స్ సెంటర్‌లో జరిగింది. దీనిలో దాదాపు 3000 మంది పాల్గొన్నారు.
ఈ నేపథ్యంలో జగ్‌దీప్ ధన్‌కర్ మంగళవారం ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్స్ సర్వీస్ అధికారులతో న్యూఢిల్లీలోని తన అధికారిక నివాసంలో మంగళవారం మాట్లాడారు. మన దేశం 2047 నాటికి (అభివృద్ధి చెందిన దేశాల్లో) ప్రథమ స్థానంలో ఉంటుందన్నారు. అయితే మనలో కొందరు దీనిని గర్వకారణంగా భావించడం లేదన్నారు. తప్పుడు మార్గదర్శనంలో నడుస్తున్నవారు మన దేశం ప్రస్తుతం సాధిస్తున్న విజయాలను, మన సత్తాను తెలుసుకోలేక, అయోమయంలో ఉన్నారన్నారు. ‘నంబర్ వన్ నేషన్’ అంటే ఏమిటో ఆయన వివరించలేదు. దేశం లోపల, బయట ఉన్న కొందరు వ్యక్తులు మనల్ని సరిపోల్చడానికి, మదింపు చేయడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. ఇతరులు మనల్ని మదింపు చేయడాన్ని మనం అంగీకరించబోమని చెప్పారు. వారి మదింపు నిష్పాక్షికమైనది కాదన్నారు. ప్రపంచం సుస్థిరంగా, సామరస్యంతో, ప్రశాంతంగా ఉండాలని మన దేశం కోరుకుంటుందని, అందుకే కొందరికి ఈ దేశం అభివృద్ధి రుచించడం లేదని, వారు మన దేశాభివృద్ధిని జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పారు. చరిత్ర భారాన్ని మోయవద్దని, అది ప్రగతిని అడ్డుకుంటుందని అధికారులకు చెప్పారు.
ఇవి కూడా చదవండి :
Odisha Train Accident : డబ్బు కోసం ఇంత దారుణమా? ఒడిశా రైలు ప్రమాద మృతుల శవాలతో మోసాలు!
Wrestlers : రెజ్లర్లను చర్చలకు పిలిచిన కేంద్ర ప్రభుత్వం