Jaahnavi Kandula: తెలుగు విద్యార్థిని మృతి కేసు.. అమెరికా పోలీస్ అధికారి వెకిలీ కామెంట్లపై భారత్ సీరియస్..!
ABN , First Publish Date - 2023-09-14T11:13:00+05:30 IST
అగ్రరాజ్యం అమెరికాలో రోడ్డు ప్రమాదంలో చనిపోయిన తెలుగు విద్యార్థిని జాహ్నవి కందుల (Jaahnavi Kandula) మృతిపై సియాటిల్ పోలీసు అధికారి కెవిన్ డేవ్ వెకిలి వ్యాఖ్యలు చేయడం అతని బాడీ కెమెరాలో రికార్డు అయింది.
ఇంటర్నెట్ డెస్క్: అగ్రరాజ్యం అమెరికాలో రోడ్డు ప్రమాదంలో చనిపోయిన తెలుగు విద్యార్థిని జాహ్నవి కందుల (Jaahnavi Kandula) మృతిపై సియాటిల్ పోలీసు అధికారి కెవిన్ డేవ్ వెకిలి వ్యాఖ్యలు చేయడం అతని బాడీ కెమెరాలో రికార్డు అయింది. ఆ వీడియో కాస్తా బయటకు రావడంతో సదరు అధికారిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వీడియోపై తాజాగా భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఈ విషయంపై వెంటనే దర్యాప్తు చేయాలని యూఎస్ అధికారులను డిమాండ్ చేసింది.
ఈ మేరకు శాన్‌ఫ్రాన్సిస్కోలోని భారత ఎంబసీ (Indian Embassy) ట్వీట్ చేసింది. "జాహ్నవి కందుల మృతి కేసు విచారణలో భాగంగా తాజాగా వెలుగులోకి వచ్చిన విషయాలు తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేశాయి. వాషింగ్టన్, సియాటిల్‌లోని ఉన్నతాధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లాం. దీనిపై పూర్తిస్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశాం. ఈ ఘటనతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకోవాలని కోరాం. అలాగే సంబంధిత అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నాం" అని ఎంబసీ తన ట్వీట్‌లో పేర్కొంది.
ఇదిలాఉంటే.. కర్నూలు జిల్లాకు చెందిన జాహ్నవి (23) ఉన్నత చదువుల కోసం 2021లో అమెరికాకు వెళ్లారు. నార్త్‌ఈస్టర్న్ యూనివర్సిటీ సియాటెల్ క్యాంప్‌సలో పీజీలో చేరారు. ఈ ఏడాది జనవరి 23న కాలినడకన రోడ్డు దాటుతున్న జాహ్నవిని పోలీసు పెట్రోలింగ్ వాహనం ఢీకొనడంతో ఘటన స్థలంలోనే ఆమె చనిపోయారు. ఆ సమయంలో ఆ వాహనాన్ని కెవిన్ డేవ్ అనే పోలీసు అధికారి నడుపుతున్నారు. దర్యాప్తు నిమిత్తం అక్కడికి వచ్చిన పోలీసు అధికారి డానియల్ అక్కడ జోకులు వేయడం, నవ్వడం అతని బాడీ కెమెరాలో రికార్డయ్యింది. ‘ఆమె మామూలు మనిషే. 11 వేల డాలర్ల చెక్కు రాసేయండి సరిపోతుంది. ఆమె వయసు 26 ఉండొచ్చు. ఆమె జీవితానికి విలువ తక్కువ’ అని డానియల్ చులకనగా వ్యాఖ్యానించారు.