NRIs Protest in Sydney: అక్రమ అరెస్టులతో మా నాయకుడిని భయపెట్టలేరు
ABN , First Publish Date - 2023-09-10T11:25:28+05:30 IST
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్‌ని నిరసిస్తూ తెలుగుదేశం ఆస్ట్రేలియా ఆధ్వర్యంలో ప్రవాసాంధ్రులు సిడ్నీ నగరంలో ఆదివారం నిరసన ప్రదర్శన చేపట్టారు.
సిడ్నీ: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్‌ని నిరసిస్తూ తెలుగుదేశం ఆస్ట్రేలియా ఆధ్వర్యంలో ప్రవాసాంధ్రులు సిడ్నీ నగరంలో ఆదివారం నిరసన ప్రదర్శన చేపట్టారు. తెలుగు రాష్ట్ర అభివృద్దే ధ్యేయంగా 45 ఏళ్లపాటు మచ్చలేని రాజకీయ జీవితాన్ని గడిపిన చంద్రబాబుపై అక్రమ కేసులు బనాయించి అర్థరాత్రి అరెస్టులు చేయటాన్ని ఈ సందర్భంగా వారు తీవ్రంగా ఖండించారు.
తెలుగుదేశం పార్టీకి ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి రాబోయే ఎన్నికల్లో తన ఓటమి తప్పదని గ్రహించిన సీఎం జగన్మోహన్ రెడ్డి తన అధికారాన్ని అడ్డంపెట్టుకుని కక్షసాధింపు చర్యలకి పాల్పడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. వేలకోట్ల అవినీతి కేసుల్లో ఏ1 నిందితునిగా ఉన్న జగన్ అందరూ తనలాంటి వారే అన్న భ్రమల్లో ఉన్నారని ఎద్దేవా చేశారు. సైకో ప్రభుత్వానికి, పోలీసులకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
తెలుగుదేశం ఆస్ట్రేలియా సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ అక్రమ కేసులు అరెస్టులతో తమ నాయకుడిని, పార్టీ కార్యకర్తలని భయపెట్టలేరని అన్నారు. దీనికి తగిన సమాధానం రాబోయే ఎన్నికల్లో ఓటు ద్వారా చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. చంద్రబాబుకి సంఘీభావం తెలిజేస్తూ నిరసన కార్యక్రమానికి వచ్చిన పార్టీ అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేశారు.