Telangana BJP: ఎడమొహం, పెడమొహంగా ఉన్న తెలంగాణ బీజేపీ నేతలు..ఢిల్లీ పర్యటన తర్వాత నేతల్లో మార్పు..!

ABN , First Publish Date - 2023-03-10T11:44:27+05:30 IST

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు దూకుడు పెంచాయి‌. అధికారమే లక్ష్యంగా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ...

Telangana BJP: ఎడమొహం, పెడమొహంగా ఉన్న తెలంగాణ బీజేపీ నేతలు..ఢిల్లీ పర్యటన తర్వాత నేతల్లో మార్పు..!

తెలంగాణ బీజేపీలో ఢిల్లీ టూర్ ఎఫెక్ట్‌ స్పష్టంగా కన్పిస్తోందా?.. అమిత్‌ షా వార్నింగ్‌తో ఆధిపత్య పోరుకు ఫుల్‌స్టాప్ పడ్డట్లేనా?.. ఒకే ఒక్క సభతో కీలక నేతలంతా సెట్‌ అయ్యారా?.. ఎడమొహం, పెడమొహంగా ఉన్న ముఖ్య నేతలు కూడా.. ఇకపై కలసికట్టుగా పని చేయబోతున్నారా?.. ఇంతకీ.. కమలనాథుల ఢిల్లీ టూర్‌లో ఏం జరిగింది?.. ఎడమొహం, పెడమొహంగా ఉన్న నేతలెవరు?..అనే మరిన్ని విషయాలను ఏబీఎన్ ఇన్‎సైడ్‎లో తెలుసుకుందాం..

Untitled-2202.jpg

ఆధిపత్యపోరుతో ఆయా పార్టీల సతమతం

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు దూకుడు పెంచాయి‌. అధికారమే లక్ష్యంగా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ప్లాన్స్ రెడీ చేస్తున్నాయి‌. అదే సమయంలో.. నేతల మధ్య ఆధిపత్యపోరుతో ఆయా పార్టీలు సతమతమవుతున్నాయి. అధికార బీఆర్ఎస్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు, టికెట్ ఆశిస్తోన్న నేతలకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది‌‌. కాంగ్రెస్‌లోనూ వ్యవహారం.. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి వర్సెస్ సీనియర్లు అన్నట్లుగా మారింది. దానికి తగ్గట్లే.. రెండు వర్గాలు పాదయాత్రతో ప్రజల్లోకి వెళ్తున్నాయి‌. బీజేపీలో కూడా ముఖ్య నేతల మధ్య ఆధిపత్యపోరు నడుస్తోందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ముఖ్యంగా.. తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్, సీనియర్ నేత ఈటల రాజేందర్, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వర్గాలుగా విడిపోయిందన్న ఊహాగానాలు సొంత పార్టీలోనే సాగుతున్నాయి. దాంతో ఆధిపత్యపోరు బీజేపీకి చేటుగా మారింది.‌

Untitled-2154.jpg

బీజేపీ నేతల మధ్య సమన్వయలోపంపై సీరియస్

ఇదిలావుంటే... తెలంగాణ బీజేపీ నేతల ఆధిపత్యపోరు అంశం హస్తినకు చేరింది. బీజేపీ నేతల మధ్య సమన్వయలోపంపై హైకమాండ్ ఫోకస్ పెట్టింది. తెలంగాణ కమలనాథులను అమిత్ షా ఢిల్లీకి పిలిచారు. దానిలో భాగంగా.. తెలంగాణ బీజేపీ నేతలు.. జేపీ నడ్డా, అమిత్ షాతో భేటీ అయ్యారు. ఆ సందర్భంగా.. బీజేపీ నేతల మధ్య సమన్వయలోపంపై అమిత్ షా సీరియస్ అయినట్లు తెలుస్తోంది. దాంతో.. హస్తిన పర్యటన తర్వాత తెలంగాణ బీజేపీ నేతల మధ్య కొంత మార్పు వచ్చిందని ప్రచారం జరుగుతోంది. ఢిల్లీ టూర్ ప్రభావం కన్పిస్తోందన్న కామెంట్స్ సొంత పార్టీలోనే విన్పిస్తున్నాయి. అందుకు బీజేపీ కార్యాలయంలో జరిగిన నిరసన కార్యక్రమాన్ని నిదర్శనంగా చూపిస్తున్నారు.

Untitled-2458.jpg

మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు వ్యతిరేకంగా బండి సంజయ్ ఆధ్వర్యంలో నిరసన దీక్ష జరిగింది. ఆ దీక్షకు ఈటల రాజేందర్‌తోపాటు.. లక్ష్మణ్, డీకే అరుణ, ఇంద్రసేనారెడ్డి, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, విజయశాంతి, బూర నర్సయ్యగౌడ్ లాంటి సీనియర్‌ నేతలు హాజరయ్యారు. అయితే.. బండి సంజయ్, ఈటల రాజేందర్ ఒకే వేదిక పంచుకోవడంపై బీజేపీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. ‌బీజేపీ సహ ఇన్‌చార్జ్ అర్వింద్ మీనన్‌తో కలసి బండి‌, ఈటల దీక్షలో కూర్చున్నారు‌. దాంతో.. ఢిల్లీ టూర్ వర్కౌట్ అయిందన్న కామెంట్స్ విన్పిస్తున్నాయి.

Untitled-25455.jpg

కలసి వేదిక పంచుకోవడంపై ఉత్సాహం

వాస్తవానికి.. తెలంగాణ బీజేపీ నేతల మధ్య సమన్వయలోపంపై గత వారం అమిత్ షా సీరియస్ అయ్యారు. అందులో భాగంగానే.. ముఖ్య నేతలు ఒకే వేదిక పంచుకున్నారన్న టాక్‌ బీజేపీలో నడుస్తోంది. ‌ముఖ్యంగా.. బండి సంజయ్, ఈటల రాజేందర్ కొన్నాళ్లుగా ఎడముఖం పెడముఖంగా ఉంటున్నారన్న చర్చ బీజేపీ సర్కిల్స్‌లో ఉంది. ఆ చర్చకు బలాన్ని చేకూర్చుతూ.. ఈటల రాజేందర్ కూడా సొంతంగా జిల్లాల పర్యటనలు చేస్తున్నారు. ఆ నేపథ్యంలో.. చాలాకాలం తర్వాత బండి సంజయ్‌తో కలసి ఈటల రాజేందర్ వేదిక పంచుకోవడం బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. అమిత్ షా, జేపీ నడ్డాతో సమావేశం ముగిసిన తర్వాత కూడా బండి సంజయ్, ఈటల రాజేందర్ కలసి ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. అమిత్ షా సూచనలతోనే ఇద్దరు కీలక నేతలు మీడియా ముందుకొచ్చారని తెలుస్తోంది. దానికి కొనసాగింపుగానే తెలంగాణ బీజేపీ ఆఫీసులోని నిరసన దీక్షలోనూ ఇరువురూ వేదిక పంచుకున్నారన్న చర్చ జోరందుకుంది.

Untitled-23458.jpg

బీజేపీ క్యాడర్‌కు సానుకూల సంకేతాలు

మరోవైపు... తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ గ్రూపులు పక్కనపెట్టి పనిచేయాలని అమిత్ షా ఆదేశించినట్లు తెలుస్తోంది. నాయకుల సమన్వయం లేకుంటే కష్టమని వార్నింగ్ కూడా ఇచ్చారు. నాయకులు తీరు మార్చుకోకుంటే అంతిమంగా పార్టీ నష్టపోతోందని హెచ్చరించారు. తెలంగాణలో పార్టీ పరిస్థితి బాగుందని.‌‌. తమ దృష్టి అంతా అక్కడే ఉందని అమిత్ షా చెప్పారు. దాంతో.. తెలంగాణ బీజేపీ నాయకులు అలర్ట్ అయ్యారు‌. చిన్నచిన్న అభిప్రాయభేదాలు, మనస్పర్థలు పక్కన పెట్టాలని కమలనాథులు నిర్ణయించారు. దానిలో భాగంగానే.. అమిత్ షాను కలసి వచ్చాక జరిగిన మొదటి కార్యక్రమం కావడంతో బండి సంజయ్‌తో ఈటల రాజేందర్ వేదిక పంచుకున్నారన్న చర్చ జరుగుతోంది. అందుకే.. బీజేపీ హైకమాండ్‌తోపాటు.. పార్టీ క్యాడర్‌కు సానుకూల సంకేతాలు పంపాలని ముఖ్య నేతలు నిర్ణయించారు. అటు.. బండి సంజయ్ నాయకత్వంలో మహిళలపై అత్యాచారాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని ఈటల ప్రకటించడం శుభపరిణామంగా బీజేపీ శ్రేణులు భావిస్తున్నాయి.

Untitled-2654.jpg

మొత్తంగా.. ఢిల్లీ పర్యటన తర్వాత తెలంగాణ బీజేపీ నేతల్లో మార్పు వచ్చినట్లే కనిపిస్తోంది. ఎన్నికలు సమీపిస్తోన్న వేళ నేతలంతా కలసికట్టుగా పనిచేయాలని నిర్ణయించడం బీజేపీలో జోష్‌ నింపుతోంది.

Updated Date - 2023-03-10T11:44:27+05:30 IST