Viral News: ఈ ఇల్లు మాకొద్దంటున్నా.. దంపతులకు అద్దెకు ఇచ్చిన యజమాని.. 25 రోజుల తర్వాత వెళ్లి చూడగా.. వారు చేసిన నిర్వాకం..
ABN , First Publish Date - 2023-04-23T18:10:56+05:30 IST
25 రోజులకు గాను విల్లాను బుక్ చేసుకున్న దంపతులు.. చివరకు నచ్చకపోవడంతో మాకొద్దంటూ తిరస్కరించారు. అయితే యజమాని అంగీకరించకపోవడంతో తప్పక ఉండాల్సి వచ్చింది. అయితే చివరగా దంపతులు చేసిన నిర్వాకం చూసి ..
ఒకప్పుడు ఏది కొనాలన్నా.. అద్దెకు తీసుకోవాలన్నా.. ప్రత్యక్షంగా చూసి, నచ్చితేనే కొనేవారు. కానీ మారుతున్న కాలం కొద్దీ ప్రస్తుతం అన్ని విషయాల్లోనూ ఎక్కువగా ఆన్లైన్ పైనే ఆధారపడుతున్నారు. ఫొటోలు, వీడియోలు చూసి నచ్చితే వెంటనే ఆర్డర్ చేసేస్తుంటారు. అయితే ఈ క్రమంలో కొన్నిసార్లు అనేక సమస్యలు ఎదురవుతుంటాయి. ఇలాంటి సమస్యలకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఇలాంటి వార్త ఒకటి వైరల్ అవుతోంది. 25 రోజులకు గాను విల్లాను బుక్ చేసుకున్న దంపతులు.. చివరకు నచ్చకపోవడంతో మాకొద్దంటూ తిరస్కరించారు. అయితే యజమాని అంగీకరించకపోవడంతో తప్పక ఉండాల్సి వచ్చింది. అయితే చివరగా దంపతులు చేసిన నిర్వాకం చూసి యజమాని ఖంగుతిన్నాడు. వివరాల్లోకి వెళితే..
విహారయాత్ర నిమిత్తం చైనా (China) నుంచి దక్షిణ కొరియా (South Korea) వచ్చిన దంపతులు.. ఇక్కడి సియోల్ ప్రాంతంలోని 25 రోజులు ఉండేందుకు ఓ విల్లాను (Villa) బుక్ చేసుకున్నారు. అయితే తీరా అక్కడికి వెళ్లి చూస్తే.. ఆ భవనం నగరానికి దూరంగా నిర్మానుష్యం ప్రదేశంలో ఉంది. దీంతో తమకు ఆ విల్లా వద్దు అంటూ దంపుతులు తిరస్కరించారు. అయితే అప్పటికే బుక్ చేసి ఉండడంతో సదరు యజమాని ససేమిరా అన్నాడు. ఎలాగైనా అద్దెకు ఉండాల్సిందే అంటూ కండీషన్ పెట్టారు. దీంతో ఆ దంపతులు (couple) పట్టరాని కోపం వచ్చింది. అయినా చేసేదేమీలేక అంగీకరించారు. అయితే ఎలాగైన భవన యజమానిపై ప్రతీకారం (couple revenge on the house owner) తీర్చుకోవాలని అనుకున్నారు.
విల్లా యజమానిపై కోపంతో ఆ విల్లాలోని అన్ని లైట్లు, నీటి కొళాయిలతో పాటూ గ్యాస్ ఉపకరణాలను కూడా ఆన్ చేసి పెట్టారు. తర్వాత అక్కడ ఉండకుండా తమకు నచ్చిన ప్రాంతంలో మరో ఇల్లు తీసుకున్నారు. 25 రోజుల పాటు మధ్య మధ్యలో విల్లా వద్దకు వచ్చి.. తప ప్లాన్ వర్కవుట్ అవుతుందా లేదా అని చెక్ చేసుకుంటూ ఉండేవారు. గడువు అనంతరం విల్లాను ఖాళీ చేసి వెళ్లారు. చివరగా విల్లాను చూసుకోవడానికి వచ్చిన యజమాని.. లోపల ఆ దంపతుల నిర్వాకం చూసి ఖంగుతిన్నాడు. తనకు మొత్తం రూ.64,271ల బిల్లు వచ్చిందని వాపోయాడు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది.