Khan Sir: ఈ అన్నకు ఎన్ని రాఖీలు కట్టారో చూడండి.. వంద కాదు.. వెయ్యి కాదు.. ఏకంగా..

ABN , First Publish Date - 2023-08-30T20:08:16+05:30 IST

మన సాంప్రదాయంలో రాఖీ పండుగకు ప్రత్యేక గుర్తింపు ఉంది. రక్షా బంధన్ సందర్భంగా తమ సోదరులకు సోదరీమణులు రాఖీలు కట్టడం ఆనవాయితీ. దూరప్రాంతాల్లో నుంచి సైతం వచ్చి తమ సోదరులకు సోదరీమణులు రాఖీలు కడుతుంటారు.

Khan Sir: ఈ అన్నకు ఎన్ని రాఖీలు కట్టారో చూడండి.. వంద కాదు.. వెయ్యి కాదు.. ఏకంగా..

పాట్నా: మన సాంప్రదాయంలో రాఖీ పండుగకు ప్రత్యేక గుర్తింపు ఉంది. రక్షా బంధన్ సందర్భంగా తమ సోదరులకు సోదరీమణులు రాఖీలు కట్టడం ఆనవాయితీ. దూరప్రాంతాల్లో నుంచి సైతం వచ్చి తమ సోదరులకు సోదరీమణులు రాఖీలు కడుతుంటారు. సోదరీమణులు ఎంత మంది ఉంటే సోదరుల చేతులకు అన్ని రాఖీలు కనిపిస్తుంటాయి. ఈ క్రమంలో పలువురు సోదరుల చేతులకు రాఖీలు కాస్త ఎక్కువగానే కనిపిస్తుంటాయి. అయితే ఎంత ఎక్కువ ఉన్న 10కి మించి ఉండకకపోవచ్చు. కానీ ఒకే వ్యక్తికి 7 వేల రాఖీలు కడితే ఎలా ఉంటుంది. రాఖీల బరువుతో అతను చేతిని పైకెత్తడమే కష్టమైపోతుంది. వినడానికి నమ్మశక్యం కానీ విధంగా ఉంది కదూ! కానీ ఇది నిజం. ఓ వ్యక్తికి దాదాపు 7 వేల రాఖీలు కట్టారు. నిజం చెప్పాలంటే ఆ సంఖ్య 10 వేలుగా ఉండాలి. కానీ రద్దీ ఎక్కువగా ఉండడంతో అందరికీ రాఖీలు కట్టడం వీలు కాకపోవడంతో 7 వేల దగ్గరే ఆగిపోయింది. అయితే ఇలా ఒకే వ్యక్తికి 7 వేల రాఖీలు కట్టడం ప్రపంచ రికార్డుగా చెప్పుకోవచ్చు. ఈ ఘటన బీహార్ రాజధాని పాట్నాలో చోటు చేసుకుంది. ఓ కోచింగ్ సెంటర్‌లో విద్యార్థినులు తమకు పాఠాలు నేర్పిన గురువుపై తమ అభిమానాన్ని రాఖీల రూపంలో వ్యక్తపరచారు.


పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ప్రముఖ ఆన్‌లైన్ ట్యూటర్, ప్రముఖ విద్యావేత్త అయిన ఖాన్ సార్ అనే వ్యక్తి పాట్నాలో చాలా కాలంగా ఓ కోచింగ్ సెంటర్ నడుపుతున్నారు. ఆ కోచింగ్ సెంటర్‌లో ఉద్యోగాలకు సంబంధించిన కోచింగ్ ఇస్తున్నారు. అలా ఇప్పటివరకు తన కోచింగ్ సెంటర్ నుంచి అనేక బ్యాచ్‌లకు చదువు చెప్పారు. అయితే బుధవారం ఖాన్ సార్ తన కోచింగ్ సెంటర్‌లో రక్షాబంధన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివిధ బ్యాచ్‌లకు చెందిన 10 వేల మంది విద్యార్థినులు హాజరయ్యారు. దాదాపు 7 వేల మంది విద్యార్థినులు ఖాన్ సార్ చేతికి రాఖీలు కట్టారు. ఇలాంటిది గతంలో ఎప్పుడూ జరగలేదని ఇదొక ప్రపంచ రికార్డని ఖాన్ సార్ చెబుతున్నారు. ఖాన్ సార్ ప్రతి అమ్మాయిని వ్యక్తిగతంగా కలుసుకుని రాఖీ కట్టేలా చూసుకున్నారు. కాగా ఈ కార్యక్రమానికి రెండున్నర గంటలపాటు సమయం పట్టింది. అయితే అంతమంది విద్యార్థినులు ఒక్క సారిగా రావడంతో రాఖీ కట్టేందుకు అందరికీ వీలు పడలేదు. దీంతో అందరూ రాఖీలు కట్టలేకపోయారు. ఒక వేళ మిగతా వారు కూడా కట్టి ఉంటే 10 వేల రాఖీలు అయ్యేవి. రాఖీల బరువుతో ఖాన్ సార్‌కు చేయి పైకెత్తడం కూడా కష్టమైపోయింది.

8ffb82fa-6812-4ab7-9a07-09a84fbb146c.webp

ఓ జాతీయ మీడియా ఛానెల్‌తో ఖాన్ సార్ మాట్లాడుతూ.. తనకు సొంత సోదరి లేదని తెలిపారు. అందువల్ల తాను తన కోచింగ్ సెంటర్‌లోని అమ్మాయిలందరినీ తన సోదరీమణులుగా భావిస్తానని పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం వారితో రాఖీలు కట్టించుకుంటానని తెలిపారు. ప్రపంచంలో ఎవరికీ కూడా తనకు కట్టినన్ని రాఖీలు కట్టి ఉండరని ఖాన్ సార్ హర్షం వ్యక్తం చేశారు. ‘‘నా క్లాసులు వినడానికి వేర్వేరు ప్రాంతాల నుంచి విద్యార్థినులు వస్తున్నారు. వారి కుటుంబాలను వదిలి నా కోచింగ్ సెంటర్‌లో చదువుకుంటున్నారు. వారు తమ కుటుంబాలకు దూరంగా ఉన్నామనే బాధను దూరం చేయడానికి నేను వారిని సోదరీమణులుగా చూసుకుంటున్నాను. వారు విజయం సాధించడంలో, మంచి ఉద్యోగాలు సాధించడంలో నేను అను నిత్యం వారికి సహాయం చేస్తాను’’ అని ఖాన్ సార్ పేర్కొన్నారు. ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థినులు ఖాన్ సర్‌ను ప్రపంచంలోనే ఉత్తమ ఉపాధ్యాయుడు, సోదరుడు అని కొనియాడారు. అతడిని మించిన సోదరుడు లేడని వారు చెప్పారు. కొంతమంది విద్యార్థులు తమ జీవితాంతం ఖాన్ సర్‌కు రాఖీలు కట్టాలనే కోరికను వ్యక్తం చేశారు.

Updated Date - 2023-08-30T20:11:27+05:30 IST