MS Dhoni: ఆర్సీబీ తరఫున ఒక ట్రోఫీ గెలవండి ప్లీజ్!.. ధోని ఏం చెప్పాడంటే..?
ABN , Publish Date - Dec 21 , 2023 | 11:46 AM
IPL: మహేంద్ర సింగ్ ధోని. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అంతర్జాతీయ క్రికెట్‌లో టీమిండియాకు రెండు ప్రపంచకప్‌లు అందించడంతోపాటు ఐపీఎల్‌లో చెన్నైసూపర్ కింగ్స్‌కు 5 టైటిళ్లు అందించాడు.
మహేంద్ర సింగ్ ధోని. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అంతర్జాతీయ క్రికెట్‌లో టీమిండియాకు రెండు ప్రపంచకప్‌లు అందించడంతోపాటు ఐపీఎల్‌లో చెన్నైసూపర్ కింగ్స్‌కు 5 టైటిళ్లు అందించాడు. 40 ఏళ్ల వయసులోనూ గతేడాది సీఎస్కేను ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలబెట్టాడు. కానీ చెన్నైసూపర్ కింగ్స్‌కు అన్ని విధాల సమవుజ్జీ అయినా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పరిస్థితి మాత్రం దీనికి పూర్తి విరుద్ధం. ప్రతిసారి ఆ జట్టు హాట్ ఫెవరేట్‌గా బరిలోకి దిగుతున్నప్పటికీ ట్రోఫీ మాత్రం అందని ద్రాక్షలాగే మారిపోయింది. దీంతో ట్రోఫీ కోసం వేచి చూసి చూసి ఆర్సీబీ అభిమానుల కళ్లు కాయలు కాచిపోతున్నాయి కానీ టైటిల్ మాత్రం దక్కడం లేదు. దీంతో ఒక ఈవెంట్‌లో ఓ ఆర్సీబీ వీరాభిమాని ధోనిని బెంగళూరు జట్టులోకి రావాలని, తమ కోసం ఒక ట్రోఫీ గెలవాలని అడిగాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
‘‘నేను 16 సంవత్సరాల నుంచి ఆర్సీబీకి వీరాభిమానిని. మీరు సీఎస్కే కోసం ఐదు టైటిళ్లు గెలిచారు. మీరు మా జట్టుకు మద్దతు ఇవ్వాలని, మా జట్టు తరఫున ఆడి మా కోసం ఒక టైటిల్ గెలవాలని నేను కోరుకుంటున్నాను.’’ అని ఒక ఆర్సీబీ అభిమాని కోరాడు. అభిమాని ప్రశ్నకు నవ్వుతూ సమాధానమిచ్చిన ధోని ‘‘వాళ్లది(ఆర్సీబీ) చాలా మంచి టీం. అయితే మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే.. క్రికెట్‌లో ఏది కూడా ప్రణాళిక ప్రకారం జరగదు. కాబట్టి ఐపీఎల్ గురించి మాట్లాడినట్టయితే మొత్తం 10 జట్లు మంచి ప్లేయర్లను కలిగి ఉంటాయి. జట్లన్నీ చాలా బలంగా ఉంటాయి. గాయాల కారణంగా కొంతమంది ఆటగాళ్లు జట్టుకు దూరమైతేనే సమస్య మొదలవుతుంది. వారికి(ఆర్సీబీ) చాలా మంచి జట్టు ఉంది. ఐపీఎల్‌లో ఛాంపియన్‌గా నిలవడానికి ప్రతి జట్టుకు మంచి అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి నా సొంత జట్టులో నేను ఆందోళన చెందడానికి చాలా విషయాలున్నాయి. నేను ప్రతి జట్టుకు ఆల్‌ది బెస్ట్ చెబుతున్నాను. నేను నిజంగా అంతకు మించి చేయలేను. ఎందుకంటే నేను ఇతర జట్లకు సహాయం చేశాను అనుకోండి.. అప్పుడు మా అభిమానులు ఎలా భావిస్తారు?’’ అని ధోని చెప్పాడు. కాగా ఐపీఎల్ చరిత్రలో 2009, 2011, 2016 సీజన్‌లలో మూడు సార్లు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు ఫైనల్ చేరినప్పటికీ చివరగా రనరఫ్‌తోనే సరిపెట్టుకుంది.