IND vs AUS: కోహ్లీ టెస్ట్ క్రికెట్ ఆడమన్నాడు.. ఆసక్తికరమైన విషయాలు వెల్లడించిన రాహుల్

ABN , First Publish Date - 2023-10-09T12:50:05+05:30 IST

పిచ్ చాలా స్లోగా ఉందని, కాసేపు టెస్టు మ్యాచ్ ఆడినట్లుగా ఆడమని విరాట్ కోహ్లీ తనకు సూచించాడని కేఎల్ రాహుల్ చెప్పాడు. రెండు పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయినప్పుడు తాను క్రీజులోకి వచ్చానని, అయితే ఆ సమయంలో తాను మరి ఎక్కువగా కంగారు పడలేదని తెలిపాడు.

IND vs AUS: కోహ్లీ టెస్ట్ క్రికెట్ ఆడమన్నాడు.. ఆసక్తికరమైన విషయాలు వెల్లడించిన రాహుల్

చెన్నై: పిచ్ చాలా స్లోగా ఉందని, కాసేపు టెస్టు మ్యాచ్ ఆడినట్లుగా ఆడమని విరాట్ కోహ్లీ తనకు సూచించాడని కేఎల్ రాహుల్ చెప్పాడు. రెండు పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయినప్పుడు తాను క్రీజులోకి వచ్చానని, అయితే ఆ సమయంలో తాను మరి ఎక్కువగా కంగారు పడలేదని తెలిపాడు. వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియాను కింగ్ కోహ్లీ, రాహుల్ గెలిపించిన సంగతి తెలిసిందే. వీరిద్దరి 165 పరుగుల భాగస్వామ్యం టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించింది. మ్యాచ్ అనంతరం రాహుల్ మాట్లాడుతూ ‘‘ 2 పరుగులకే కీలకమైన 3 వికెట్లు కోల్పోయినప్పుడు క్రీజులోకి వచ్చాను. ఆ సమయంలో నేను ఎక్కువగా కంగారు పడలేదు. కోహ్లీతో వికెట్ గురించి కూడా ఎక్కువగా చర్చించలేదు. కానీ కోహ్లీ ఒక్కటే చెప్పాడు. పిచ్ చాలా క్లిష్టంగా ఉంది. కాసేపు టెస్టు మ్యాచ్ ఆడినట్లు ఆడాలని సూచించాడు. ఆరంభంలో కొత్త బంతి పేసర్లకు సహకరించింది. ఆ తర్వాత స్పిన్నర్లకు సహకరించంది. చివరి 15-20 ఓవర్లు మాత్రం తేమ ప్రభావంతో బ్యాటింగ్‌కు అనుకూలంగా మారింది. అయితే ఈ పిచ్‌పై బ్యాటింగ్ చేయడం సులభం కాదు. ఇది బ్యాటర్లు, బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టింది. చివరలో సిక్స్ అద్భుతుంగా కొట్టాను. అయితే నేను సెంచరీ గురించి ఆలోచించలేదు. సెంచరీ చేయాలంటే ఎన్ని పరుగులు కావాలనే దానిపై అవగాహన ఉంది. చివరలో వరుసగా ఫోర్, సిక్సు కొడితే సెంచరీ అవుతుంది. కానీ అప్పటికీ విజయానికి 5 పరుగులు మాత్రమే కావాలి. అయితే నేను కొట్టిన బంతి నేరుగా స్టాండ్స్‌లో పడింది. సెంచరీ చేజారినందుకు బాధ లేదు. జట్టు గెలిచింది. అదే ముఖ్యం’’ అని తెలిపాడు.


కాగా ఈ మ్యాచ్‌లో కేవలం 200 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్‌ రెండు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన వేళ.. స్టార్‌ బ్యాటర్లు కేఎల్‌ రాహుల్‌ (115 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 97 నాటౌట్‌), విరాట్‌ కోహ్లీ (116 బంతుల్లో 6 ఫోర్లతో 85)ల అసాధారణ ఆటతీరుతో వహ్వా.. అనిపించారు. తమ అపార అనుభవంతో తీవ్ర ఒత్తిడిని తట్టుకుంటూ ఆసీస్‌ పేసర్లను దీటుగా ఎదుర్కొంటూ జట్టును విజయతీరాలకు చేర్చారు. దీంతో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్‌ ఆరు వికెట్ల తేడాతో నెగ్గింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌ 49.3 ఓవర్లలో 199 పరుగులకు ఆలౌటైంది. స్మిత్‌ (46), వార్నర్‌ (41), స్టార్క్‌ (28) మాత్రమే రాణించారు. జడేజాకు మూడు.. కుల్దీప్‌, బుమ్రాలకు రెండేసి వికెట్లు దక్కాయి. స్వల్ప ఛేదనలో భారత్‌ 41.2 ఓవర్లలో 4 వికెట్లకు 201 పరుగులు చేసి గెలిచింది. హాజెల్‌వుడ్‌కు మూడు వికెట్లు దక్కాయి. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా రాహుల్‌ నిలిచాడు. మరోవైపు చెపాక్‌లో ఆడిన నాలుగు వరల్డ్‌కప్‌ మ్యాచ్‌ల్లో ఆసీస్‌ ఓడడం ఇదే తొలిసారి.

Updated Date - 2023-10-09T12:50:05+05:30 IST