IND vs SA: మైల్‌స్టోన్ రికార్డుకు 43 పరుగుల దూరంలో విరాట్ కోహ్లీ.. పుట్టిన రోజు నాడు అందుకుంటాడా..?
ABN , First Publish Date - 2023-11-05T13:11:59+05:30 IST
వన్డే ప్రపంచకప్‌లో భాగంగా భారత్, సౌతాఫ్రికా మధ్య మ్యాచ్ జరగనుంది. టేబుల్ టాపర్లైనా రెండు టీంల మధ్య పోటీ కావడంతో అందరిలో ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా ఈ మ్యాచ్‌లో నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్న విరాట్ కోహ్లీ రాణించాలని అభిమానులు కోరుకుంటున్నారు.
కోల్‌కతా: వన్డే ప్రపంచకప్‌లో భాగంగా భారత్, సౌతాఫ్రికా మధ్య మ్యాచ్ జరగనుంది. టేబుల్ టాపర్లైనా రెండు టీంల మధ్య పోటీ కావడంతో అందరిలో ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా ఈ మ్యాచ్‌లో నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్న విరాట్ కోహ్లీ రాణించాలని అభిమానులు కోరుకుంటున్నారు. పుట్టిన రోజు నాడు కోహ్లీ సెంచరీ కొట్టాలని అభిమానులు ఆశిస్తున్నారు. కోహ్లీ ఈ మ్యాచ్‌లో సెంచరీ చేస్తే వన్డే ఫార్మాట్లో అత్యధిక సెంచరీలు చేసిన క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డును సమం చేస్తాడు. సచిన్ 49 సెంచరీలు చేయగా.. కోహ్లీ ఇప్పటివరకు 48 సెంచరీలు చేశాడు. దీంతో పుట్టిన రోజునాడు కోహ్లీ సెంచరీ చేసి సచిన్ రికార్డును సమం చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. అయితే సెంచరీ సంగతి కాస్త పక్కనపెడితే మరొక 43 పరుగులు చేస్తే సౌతాఫ్రికాపై అన్ని ఫార్మాట్లలో కలిపి కోహ్లీ 3 వేల పరుగులను పూర్తి చేసుకుంటాడు. సఫారీలపై ఈ ఘనత సాధించిన రెండో భారత ఆటగాడిగా కోహ్లీ మైల్‌స్టోన్ రికార్డును చేరుకుంటాడు. కాగా సౌతాఫ్రికాపై ఇప్పటివరకు అన్ని ఫార్మాట్లలో కలిపి 57 మ్యాచ్‌లాడిన కోహ్లీ 54 సగటుతో 2,957 పరుగులు చేశాడు. ఇందులో 7 సెంచరీలు, 14 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక సఫారీలతో 30 వన్డే మ్యాచ్‌లాడిన కోహ్లీ 61 సగటుతో 1403 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలున్నాయి. అయితే వన్డే ప్రపంచకప్‌లో సౌతాఫ్రికాపై కోహ్లీకి అంత మంచి రికార్డులు లేవు. వన్డే ప్రపంచకప్ టోర్నీలో సౌతాఫ్రికాతో 3 మ్యాచ్‌లాడిన కోహ్లీ 21 సగటుతో 65 పరుగులు మాత్రమే చేశాడు. అత్యధిక స్కోర్ 46 పరుగులుగా ఉంది. దీంతో నేడు జరిగే మ్యాచ్‌లో కోహ్లీ తన రికార్డును మెరుగు పరచుకోవాలని అభిమానులు కోరుకుంటున్నాడు.
ఇక భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య గత హెడ్ టూ హెడ్ రికార్డులను ఒకసారి పరిశీలిస్తే.. రెండు టీంలు వన్డే ఫార్మాట్లో ఇప్పటివరకు 90 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. అత్యధికంగా సౌతాఫ్రికా 50, భారత్ 37 మ్యాచ్‌ల్లో గెలిచాయి. 3 మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు. ఇక వన్డే ప్రపంచకప్ చరిత్రలో రెండు జట్లు 5 సార్లు తలపడ్డాయి. భారత్ 2 మ్యాచ్‌ల్లో, సౌతాఫ్రికా 3 మ్యాచ్‌ల్లో గెలిచాయి. రెండు జట్ల మధ్య జరిగిన చివరి 2 ప్రపంచకప్ మ్యాచ్‌ల్లో భారత జట్టే గెలిచింది. అయితే 2011లో టీమిండియా ప్రపంచకప్ గెలిచినప్పటికీ లీగ్ దశలో సౌతాఫ్రికా చేతిలో ఓడిపోయింది.