Share News

World cup: 48 ఏళ్ల ప్రపంచకప్‌లో చరిత్ర సృష్టించిన శ్రేయస్ అయ్యర్.. తొలి భారత ఆటగాడిగా..

ABN , First Publish Date - 2023-11-06T11:28:04+05:30 IST

వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. కీలక సమయంలో విలువైన ఇన్నింగ్స్ ఆడిన శ్రేయస్ అయ్యర్ 77 పరుగులతో సత్తా చాటాడు.

World cup: 48 ఏళ్ల ప్రపంచకప్‌లో చరిత్ర సృష్టించిన శ్రేయస్ అయ్యర్.. తొలి భారత ఆటగాడిగా..

కోల్‌కతా: వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. కీలక సమయంలో విలువైన ఇన్నింగ్స్ ఆడిన శ్రేయస్ అయ్యర్ 77 పరుగులతో సత్తా చాటాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీతో కలిసి మూడో వికెట్‌కు 130 పరుగుల సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ ప్రపంచకప్‌లో శ్రేయస్ అయ్యర్‌కు ఇది మూడో హాఫ్ సెంచరీ. ఈ మూడు హాఫ్ సెంచరీలు కూడా నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసిన సమయంలోనే సాధించడం గమనార్హం. కాగా 48 ఏళ్ల ప్రపంచకప్ చరిత్రలో ఒక ఎడిషన్‌లో భారత్ తరఫున నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసి 3 సార్లు 50+ స్కోర్లు ఎవరూ చేయలేదు. దీంతో ఈ ఘనత సాధించిన తొలి భారత బ్యాటర్‌గా శ్రేయస్ నిలిచాడు. ఈ క్రమంలో భారత్ తరఫున ఒక ప్రపంచకప్ ఎడిషన్‌లో నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసి అత్యధిక సార్లు 50+స్కోర్లు సాధించిన బ్యాటర్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర సృష్టించాడు. కాగా ఈ ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 62 బంతుల్లో 53 పరుగులు చేసిన శ్రేయస్ అయ్యర్ నాటౌట్‌గా నిలిచాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో కీలక సమయంలో 56 బంతుల్లోనే 82 పరుగులు చేశాడు. ఇక ఆదివారం సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 87 బంతుల్లో 77 పరుగులు చేశాడు.


ఇక ఈ మ్యాచ్ విషయానికొస్తే దక్షిణాఫ్రికాతో పోరులో టీమిండియాదే గెలుపు అనుకున్నారు కానీ.. ప్రత్యర్థి మరీ ఇంత దారుణంగా ఆడుతుందని ఎవరూ భావించలేదు. తొలుత బ్యాటింగ్‌లో ఆపై బౌలింగ్‌లో టీమిండియా అదిరే ప్రదర్శన చేయడంతో సఫారీలతో మ్యాచ్‌ పూర్తిగా ఏకపక్షమైంది. ఛేదనలో తమ బలహీనతను పునరావృతం చేస్తూ 243 పరుగుల తేడాతో భారీ ఓటమిని మూటగట్టుకున్నారు. ఆదివారంనాటి మ్యాచ్‌లో తొలుత భారత్‌ 50 ఓవర్లలో 5 వికెట్లకు 326 పరుగులు చేసింది. విరాట్‌ కోహ్లీ (121 బంతుల్లో 10 ఫోర్లతో 101 నాటౌట్‌) శతక్కొట్టగా, శ్రేయాస్‌ (87 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 77) హాఫ్‌ సెంచరీతో మెరిశాడు. రోహిత్‌ శర్మ (24 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 40) ధనాధన్‌ ఆరంభం ఇవ్వగా, జడేజా (15 బంతుల్లో 3 ఫోర్లు, సిక్సర్‌తో 29 నాటౌట్‌), సూర్యకుమార్‌ (14 బంతుల్లో 5 ఫోర్లతో 22) విజృంభించారు. అనంతరం దక్షిణాఫ్రికా 27.1 ఓవర్లలో 83 పరుగులకే కుప్పకూలింది. జాన్సెన్‌ (14) టాప్‌ స్కోరర్‌. డ్యూసెన్‌, బవుమా, మిల్లర్‌ మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. జడేజా (5/33) ఐదు వికెట్లతో వణికించగా, కుల్దీప్‌ (2/7), షమి (2/18) చెరో రెండు వికెట్లతో ప్రత్యర్థి పనిబట్టారు. కోహ్లీ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచాడు.

Updated Date - 2023-11-06T11:57:50+05:30 IST