IND vs AUS: జార్వో మళ్లీ వచ్చాడు.. వరల్డ్ కప్‌లో టీమిండియాకు మరో ప్లేయర్ దొరికేశాడు!
ABN , First Publish Date - 2023-10-08T16:13:51+05:30 IST
జార్వో ఈ పేరు గుర్తుందా. ఎక్కడో విన్నట్టు అనిపిస్తుంది కదూ!.. అదేనండి 2021లో భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగిన టెస్టు సిరీస్‌లో మ్యాచ్ జరుగుతుండగా మైదానంలో వచ్చి అందరినీ షాక్‌కు గురి చేశాడు. అప్పట్లో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాడు.
చెన్నై: జార్వో ఈ పేరు గుర్తుందా. ఎక్కడో విన్నట్టు అనిపిస్తుంది కదూ!.. అదేనండి 2021లో భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగిన టెస్టు సిరీస్‌లో మ్యాచ్ జరుగుతుండగా మైదానంలో వచ్చి అందరినీ షాక్‌కు గురి చేశాడు. అప్పట్లో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాడు. అయితే ఆ జార్వో ఇప్పుడు మళ్లీ వచ్చేశాడు. భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లోకి ఎంటర్ అయ్యాడు. గతంలో మాదిరిగానే ఈ సారి కూడా టీమిండియా జెర్సీ ధరించి మ్యాచ్ జరుగుతుండగా మైదానంలోకి ప్రవేశించాడు. ప్రపంచకప్‌లో భాగంగా చెన్నై వేదికగా నేడు భారత్, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ జరుగుతుండగా 69 నంబర్ గల టీమిండియా జెర్సీ ధరించి భద్రతా సిబ్బంది కళ్లు గప్పి మైదానంలోకి వచ్చాడు. జెర్సీపై అతని పేరు కూడా ఉంది. దీంతో వెంటనే అప్రమత్తమైన మ్యాచ్ సిబ్బంది వెంటనే అతడిని మైదానం నుంచి బయటికి పంపించింది. ఒకసారి బయటికి పంపినప్పటికీ జార్వో మరోసారి మైదానంలోకి ప్రవేశించడం గందరగోళానికి దారి తీసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మొదట మ్యాచ్ ఇంకాసేపట్లో ప్రారంభం అవుతుందనగా జార్వో మైదానంలోకి ప్రవేశించాడు. అప్పుడు జార్వోను బయటికి పంపించేందుకు టీమిండియా సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లీతోసహా గ్రౌండ్ సిబ్బంది ప్రయత్నించడం ఒక ఫోటోలో కనిపించింది. మరో ఫోటోలో మ్యాచ్ మధ్యలో మైదానంలోకి ప్రవేశించిన జార్వోకు టీమిండియా వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ బయటికి వెళ్లే మార్గం చూపిండం చూడొచ్చు. ఏది ఏమైనా జార్వో చిలిపి చేష్టలు మరోసారి వైరల్‌గా మారాయి.
జార్వో పూర్తి పేరు డేనియల్ జార్విస్. మొదటిసారిగా 2021లో ఇంగ్లండ్‌లో టీమిండియా పర్యటన సందర్భంగా వెలుగులోకి వచ్చాడు. 28 ఆగష్టు 2021న భారత్, ఇంగ్లండ్ మధ్య రెండో టెస్టు మ్యాచ్ జరుగుతుండగా టీమిండియా జెర్సీ ధరించి మైదానంలోకి ప్రవేశించాడు. ఆ తర్వాత లార్డ్స్, హెడింగ్లీ వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్‌ల్లోనూ అతను ఇదే విధంగా ప్రవర్తించాడు. టీమిండియా రెండో వికెట్ పడగానే విరాట్ కోహ్లీ రాక కోసం అందరూ టీమిండియా డగౌట్ కోసం చూస్తుంటే అతని కంటే ముందుగానే జార్వో మైదానంలోకి ప్రవేశించాడు. టీమిండియా జెర్సీ ధరించి చేతిలో బ్యాట్, తలకు హెల్మెట్‌తో బ్యాటింగ్ చేయడానికి వచ్చాడు. ఆ తర్వాత మరోసారి టీమిండియా ఆటగాళ్లు ఫీల్డింగ్ చేయడానికి మైదానంలోకి వెళ్తుండగా వారితో కలిసి జార్వో కూడా వెళ్లాడు, మరోసారి అయితే టీమిండియా ఫీల్డింగ్ చేస్తుండగా ఆకస్మాత్తుగా మైదానంలోకి ప్రవేశించి చేతిలో బంతి లేకపోయినప్పటికీ బౌలింగ్ చేశాడు. అంతేకాకుండా అప్పుడు బ్యాటింగ్ చేస్తున్న ఇంగ్లండ్ బ్యాటర్ బెయిర్‌స్టోను ఢీకొట్టబోయాడు. దీంతో తన ఏకాగ్రత దెబ్బ తిందని మ్యాచ్ అనంతరం బెయిర్ స్టో చెప్పాడు.
జార్వో మైదానంలోకి వచ్చిన ప్రతిసారి బయటికి తీసుకెళ్లిన గ్రౌండ్ సిబ్బంది అతనికి ఎంత చెప్పినా తీరు మార్చుకోలేదు. హెచ్చరించిన కూడా వినలేదు. దీంతో అతడిని ఇంగ్లండ్ పోలీసులు అరెస్ట్ కూడా చేశారు. తాజాగా మరోసారి అదే విధంగా ప్రవర్తించాడు. సాధారణంగా ఇంగ్లండ్‌లో నివసించే జార్వో ప్రపంచకప్ కోసమే ఇండియాకు వచ్చాడు. అయితే జార్వో తన చిలిపి చేష్టలతో ఆటగాళ్లకు ఇబ్బంది కల్గిస్తున్నప్పటికీ ప్రతిసారి అచ్చం టీమిండియా క్రికెట్ మాదిరిగా జెర్సీ ధరించి మైదానంలోకి వస్తున్నాడు. దీనిని బట్టి జార్వో టీమిండియాకు పెద్ద ఫ్యాన్ అని అర్థమవుతోంది. ఇక జార్వో తాజా చేష్టలను ఉద్దేశించి సోషల్ మీడియాలో నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. వరల్డ్ కప్‌లో టీమిండియాకు మరో ప్లేయర్ దొరికేశాడని అంటున్నారు. మరికొందరేమో టీమిండియా తరఫున ఆడాలనే జార్వో కోరిక ఎన్నటికైన నెరవేరాలని ఆశిస్తున్నామని సరాదాగా రాసుకొస్తున్నారు.