IND vs AUS Final: మోదీ స్టేడియమే టీమిండియా కొంపముంచిందా?.. వేరే చోట మ్యాచ్ జరిగి ఉంటే మనమే గెలిచే వాళ్లమా..?
ABN , First Publish Date - 2023-11-20T11:12:31+05:30 IST
Narendra Modi Stadium: ప్రపంచకప్ ఫైనల్లో టీమిండియాకు ఎదురైన ఘోర పరాజయం కోట్లాది మంది అభిమానులను తీవ్రంగా భాదిస్తోంది. సెమీస్ వరకు అద్భుతంగా ఆడిన టీమిండియా ఫైనల్లో ఓడిపోవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ, వెటరన్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి ఇక మళ్లీ ప్రపంచకప్ గెలిచే అవకాశం ఉండదేమో అనే బాధ అభిమానుల కలచివేస్తోంది.
అహ్మదాబాద్: ప్రపంచకప్ ఫైనల్లో టీమిండియాకు ఎదురైన ఘోర పరాజయం కోట్లాది మంది అభిమానులను తీవ్రంగా బాధిస్తోంది. సెమీస్ వరకు అద్భుతంగా ఆడిన టీమిండియా ఫైనల్లో ఓడిపోవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ, వెటరన్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి ఇక మళ్లీ ప్రపంచకప్ గెలిచే అవకాశం ఉండదేమో అనే బాధ అభిమానుల కలచివేస్తోంది. టీమిండియాలోనే కాకుండా ప్రపంచ క్రికెట్‌లోనే తమైదన ముద్ర వేసిన వీరిద్దరు ప్రపంచకప్ గెలవకపోవడాన్ని అభిమానులు భరించలేకపోతున్నారు. దీంతో మ్యాచ్ ముగిసిన ఆదివారం రాత్రి నుంచి అభిమానులంతా తీవ్ర దు:ఖంలో ఉన్నారు. ప్రస్తుతం ఎక్కడా చూసిన టీమిండియా ఓటమి గురించే చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో పలువురు అభిమానులు టీమిండియా ఓటమికి నరేంద్ర మోదీ స్టేడియాన్ని నిందిస్తున్నారు. అహ్మదాబాద్‌లోని మోదీ స్టేడియంలో మ్యాచ్ జరగడం వల్లే టీమిండియా ఓడిపోయిందని అభిప్రాయపడుతున్నారు. అక్కడ కాకుండా మరే ఇతర స్టేడియంలో మ్యాచ్ జరిగినా మనమే గెలిచేవాళ్లమని అంటున్నారు. సోషల్ మీడియాలో సైతం ఇవే కామెంట్లు వినిపిస్తున్నాయి. పలువురు విశ్లేషకలు కూడా ఈ కామెంట్లకు మద్దతిస్తున్నారు.
పలువురు అభిమానులు చెబుతున్న దాని ప్రకారం.. నరేంద్ర మోదీ స్టేడియం పిచ్ మొదట బ్యాటింగ్‌కు ఏమాత్రం సహకరించలేదు. మొదటి ఇన్నింగ్స్‌లో పిచ్ చాలా స్లోగా ఉంది. బంతి ఏ మాత్రం బ్యాట్ మీదకి రాలేదు. దీంతో టీమిండియా బ్యాటర్లకు పరుగులు చేయడం సాధ్యం కాలేదు. పిచ్ మొదటి ఇన్నింగ్స్ అంతా బౌలింగ్‌కే సహకరించింది. దీంతో ఆసీస్ బౌలర్లు పండుగ చేసుకున్నారు. అదే సెకండ్ ఇన్నింగ్స్ విషయానికొస్తే దీనికి పూర్తిగా భిన్నంగా మారిపోయింది. సెకండ్ ఇన్నింగ్స్‌లో బ్యాటర్లకు సహకరించింది. ఏ మాత్రం బౌలర్లకు సహకరించలేదు. ప్లడ్ లైట్ల వెలుతురులో పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా మారిపోయింది. దీనికి తోడు రాత్రి 7:30 గంటల నుంచి పిచ్‌పై డ్యూ వచ్చింది. దీంతో భారత బౌలర్లకు పట్టు దొరకలేదు. డ్యూ రావడంతో పిచ్ పూర్తిగా బ్యాటింగ్‌కు సహకరించింది. దీంతో ఆస్ట్రేలియా బ్యాటర్లు ట్రావిస్ హెడ్, లబుషేన్ పండుగ చేసుకున్నారు. చక్కగా క్రీజులో కుదురుకుని భారీ ఇన్నింగ్స్‌లు ఆడారు.
నిజానికి నరేంద్ర మోదీ స్టేడియం పిచ్ గతంలో బ్యాట్, బాల్‌కు సమానంగా సహకరించేది. ఎప్పుడు బ్యాటింగ్ చేసినా, బౌలింగ్ చేసిన ఓపికతో ఆడి, చక్కటి నైపుణ్యాన్ని ప్రదర్శించిన వారికే మంచి ఫలితం వచ్చేది. అసలు మ్యాచ్ ఫలితంలో టాస్ ప్రభావం ఉండేదే కాదు. అందుకే ఇక్కడ జరిగిన గత మ్యాచ్‌ల రికార్డులను గమనిస్తే 30 వన్డేల్లో మొదటి బ్యాటింగ్ చేసిన జట్లు 15 సార్లు, సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్లు 15 సార్లు గెలిచాయి. కానీ స్టేడియాన్ని ఆదునీకరించిన తర్వాత పిచ్ స్వభావం పూర్తిగా మారిపోయింది. ముఖ్యంగా ఈ ప్రపంచకప్‌లో ఈ పిచ్ వన్ సైడేడ్‌గా వ్యవహరించింది. ఫైనల్‌కు ముందు ఇక్కడ జరిగిన 4 లీగ్ దశ మ్యాచ్‌ల్లోనూ 3 సార్లు సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్లే గెలిచాయి. మొదటి బ్యాటింగ్ చేసినప్పుడు బ్యాటర్లకు పిచ్ పెదగా సహకరించలేదు. కానీ సెకండ్ బ్యాటింగ్ చేసినప్పుడు మాత్రం బ్రహ్మండంగా సహకరించింది. ఫైనల్‌లోనూ ఇదే జరిగింది. దీంతో టీమిండియా ఓటమిపాలైంది. అయితే టీమిండియా ఓటమికి పూర్తిగా పిచ్‌ను మాత్రమే నిందించలేం కానీ.. మనకు మొదటి దెబ్బ అక్కడే పడింది. ఎందుకంటే సాధారణంగానే క్రికెట్‌లో పిచ్ నుంచి కాస్త అయినా సహకారం లేనిది రాణించడం కష్టం. ఫైనల్‌లోనూ అదే జరిగింది.
అందుకే ఫైనల్ మ్యాచ్ నరేంద్రమోదీ స్టేడియంలో కాకుండా ఇంకేక్కడైనా జరిగి ఉంటే బాగుండేదని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. మిగతా ఏ మైదానంలో జరిగినా మనమే గెలిచే వాళ్లమని అంటున్నారు. 2011లో మన జట్టు ప్రపంచకప్ గెలిచిన ముంబైలోని వాంఖడే స్టేడియంలోనే ఫైనల్ మ్యాచ్ పెట్టి ఉంటే బాగుండేదని చెబుతున్నారు. పైగా అక్కడ భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌ను చూసుకుంటే రెండు ఇన్నింగ్స్‌ల్లో పిచ్ ఇరు జట్లకు సమన్యాయం చేసిందని అంటున్నారు. కాగా ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు 397 పరుగులు చేస్తే.. తర్వాత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ కూడా 327 పరుగులు చేసింది. ఒకానొక దశలో కివీస్ లక్ష్యాన్ని చేధించేలా కనిపించింది. రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ జరిగిన కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ పిచ్ కూడా రెండు ఇన్నింగ్స్‌ల్లో ఇరు జట్లకు సమన్యాయం చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 212 పరుగులకే ఆలౌటైంది. అనంతరం ఆస్ట్రేలియా లక్ష్యాన్ని 7 వికెట్లు కోల్పోయి 48వ ఓవర్లో కానీ చేధించలేదు. ఈ పిచ్ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ స్లోగానే ఉంది. అందుకే ఫైనల్ మ్యాచ్‌ను కోల్‌కతాలో లేదా ముంబైలో పెట్టాల్సిందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.