Share News

World cup: టీమిండియాకు సెమీస్ బెర్త్ ఖరారు అయినట్టేనా..? మరి ఇంగ్లండ్ పరిస్థితేంటి?.. ప్రస్తుత గణాంకాలివే!

ABN , First Publish Date - 2023-10-30T09:22:23+05:30 IST

భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్ 2023 రసవత్తరంగా సాగుతోంది. ముఖ్యంగా ఈ ప్రపంచకప్ సంచలనాలకు అడ్డాగా మారిపోయింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా పెద్ద జట్లను చిన్న జట్టు చిత్తుగా ఓడిస్తున్నాయి. ఈ టోర్నీలో పసికూనలుగా అడుగుపెట్టిన అఫ్ఘానిస్థాన్, నెదర్లాండ్స్ జట్లు అంచనాలకు మించి రాణిస్తున్నాయి.

World cup: టీమిండియాకు సెమీస్ బెర్త్ ఖరారు అయినట్టేనా..? మరి ఇంగ్లండ్ పరిస్థితేంటి?.. ప్రస్తుత గణాంకాలివే!

భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్ 2023 రసవత్తరంగా సాగుతోంది. ముఖ్యంగా ఈ ప్రపంచకప్ సంచలనాలకు అడ్డాగా మారిపోయింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా పెద్ద జట్లను చిన్న జట్టు చిత్తుగా ఓడిస్తున్నాయి. ఈ టోర్నీలో పసికూనలుగా అడుగుపెట్టిన అఫ్ఘానిస్థాన్, నెదర్లాండ్స్ జట్లు అంచనాలకు మించి రాణిస్తున్నాయి. పెద్ద జట్లను ఓడిస్తూ అదరగొడుతున్నాయి. నిజానికి గత ప్రపంచకప్‌ల్లోనూ పెద్ద జట్లను చిన్న జట్ల ఓడించిన దాఖలాలు ఉన్నాయి. కానీ అది ఒకటి రెండు సార్లు మాత్రమే. కానీ ఈ ప్రపంచకప్‌లో పెద్ద జట్లను చిన్న జట్లు ఓడిస్తున్న సంఖ్య ఎక్కువగా ఉంది. మరోవైపు డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో టైటిల్ ఫెవరేట్‌గా టోర్నీలోకి అడుగుపెట్టిన ఇంగ్లండ్ ఎవరూ ఊహించని విధంగా పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. ఇక సొంత గడ్డపై అంచనాలకు అనుగుణంగా రాణిస్తున్న టీమిండియా ఇప్పటివరకు ఒక మ్యాచ్ కూడా ఓడిపోకుండా పాయింట్ల పట్టికలో అగ్ర స్థానంలో కొనసాగుతోంది. ఆదివారం జరిగిన లోస్కోరింగ్ మ్యాచ్‌లోనూ దుమ్ములేపిన రోహిత్ సేన ఇంగ్లండ్‌పై 100 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ విజయంతో సెమీ ఫైనల్ బెర్త్‌కు చేరువ కూడా అయింది. ఇంగ్లండ్ మాత్రం సెమీస్ రేసు నుంచి నిష్క్రమించింది.


ప్రస్తుతం పాయింట్ల పట్టికలో టీమిండియా అగ్రస్థానంలో ఉంది. ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో ఒకటి కూడా ఓడిపోని భారత జట్టు 12 పాయింట్లు సాధించింది. నెట్ రన్‌ రేట్ కూడా +1.405గా ఉంది. ఈ టోర్నీలో ఇప్పటివరకు ఒక మ్యాచ్ కూడా ఓడిపోని జట్టు భారత్ మాత్రమే. దీంతో భారత్ సెమీస్‌ బెర్త్‌కు చేరువైంది. కాకపోతే మిగతా జట్ల సమీకరణాలు, ఇంకా మ్యాచ్‌లు మిగిలి ఉండడంతో భారత్ సెమీస్ బెర్త్ ఇంకా అధికారికంగా ఖరారు కాలేదు. ముఖ్యంగా శ్రీలంక, అఫ్ఘానిస్థాన్‌ జట్లు కూడా పాయింట్ల విషయంలో భారత్‌తో పోటీపడే అవకాశం ఉంది. ఈ రెండు టీమ్స్‌ ఐదు మ్యాచ్‌లే ఆడి నాలుగు పాయింట్లతో ఉన్నాయి. వాటికింకా నాలుగు మ్యాచ్‌లున్నాయి. ఇందులో ఏదేని జట్టు తమ మిగతా మ్యాచ్‌లన్నింటినీ గెలిస్తే అప్పుడు భారత్‌తో సమానంగా 12 పాయింట్లు సాధిస్తుంది. మరోవైపు భారత జట్టు.. శ్రీలంక, దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్‌ చేతిలో ఓడాల్సి ఉంటుంది. ఆ సమయంలో రన్‌రేట్‌ ఆధారంగా బెర్త్‌ను ఖాయం చేస్తారు. ఇలాంటి సమీకరణాల నేపథ్యంలోనే రోహిత్‌ సేన సెమీస్‌ బెర్త్‌ అధికారికం కాలేదు. కాకపోతే ప్రస్తుతం టీమిండియా ఉన్న ఫామ్ దృష్యా సునాయసంగా సెమీస్ చేరే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. మిగిలిన 3 మ్యాచ్‌ల్లో కనీసం ఒకటి గెలిచినా భారత జట్టుకు అధికారికంగా సెమీస్ బెర్త్ ఖరారు అవుతుంది. అలా కాకుండా మిగిలి 3 మ్యాచ్‌ల్లో ఓడినా టీమిండియాకు సెమీస్ చేరే అవకాశాలు ఉంటాయి.

మరోవైపు టోర్నీలో ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో ఒకే ఒక విజయం సాధించిన ఇంగ్లండ్ అధికారికంగా సెమీస్ రేసు నుంచి నిష్క్రమించినట్టే. పైగా ఆ జట్టు ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అట్టడుగున 10వ స్థానంలో ఉంది. ప్రస్తుతం ఇంగ్లండ్ ఖాతాలో 2 పాయింట్లు మాత్రమే ఉండగా.. నెట్ రన్ రేటు కూడా -1.652గా ఉంది. ఇంగ్లండ్ మిగిలిన 3 మ్యాచ్‌ల్లో గెలిచినా సెమీస్ చేరే అవకాశాలు లేవు. బహుషా ఏదైనా మహాద్భుతం జరిగితే తప్ప సెమీస్ చేరే అవకాశాలు లేవు. అది కూడా భారత్, సౌతాఫ్రికా తప్ప మిగతా జట్లన్నీ తాము ఆడే అన్నీ మ్యాచ్‌ల్లో ఓడిపోవాలి. కానీ ఇది సాధ్యమయ్యే అవకాశాలు లేవు. దీంతో ఇంగ్లండ్ జట్టు సెమీస్ రేసు నుంచి నిష్క్రమించిందనే చెప్పుకోవాలి.

Updated Date - 2023-10-30T09:22:23+05:30 IST