IND vs SA: పుట్టిన రోజు నాడు 11 రికార్డులను అందుకున్న విరాట్ కోహ్లీ
ABN , First Publish Date - 2023-11-06T09:17:32+05:30 IST
సొంతగడ్డపై జరుగుతున్న ప్రపంచకప్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ చెలరేగుతున్నాడు. ప్రత్యర్థి బౌలర్లను ఊచకోత కోస్తూ పరుగుల వరద పారిస్తున్నాడు. రెండు సెంచరీలు, 4 హాఫ్ సెంచరీలతో ఈ టోర్నీలోనే అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు.
కోల్‌కతా: సొంతగడ్డపై జరుగుతున్న ప్రపంచకప్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ చెలరేగుతున్నాడు. ప్రత్యర్థి బౌలర్లను ఊచకోత కోస్తూ పరుగుల వరద పారిస్తున్నాడు. రెండు సెంచరీలు, 4 హాఫ్ సెంచరీలతో ఈ టోర్నీలోనే అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు. ఈ క్రమంలోనే కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియం వేదికగా ఆదివారం సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లోనూ కోహ్లీ రెచ్చిపోయాడు. అజేయ సెంచరీతో దుమ్ములేపాడు. ఆదివారం కోహ్లీ పుట్టిన రోజు కూడా కావడం గమనార్హం. దీంతో సెంచరీ సాధించి తన పుట్టిన రోజును కోహ్లీ మరింత ప్రత్యేకంగా మలచుకున్నాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ 11 రికార్డులను కూడా ఖాతాలో వేసుకున్నాడు. దీంతో రికార్డుల కింగ్ అనిపించుకున్నాడు.
49- సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో సాధించిన సెంచరీ వన్డే ఫార్మాట్లో కోహ్లీకి 49వది. దీంతో ఈ ఫార్మాట్లో అత్యధిక సెంచరీలు చేసిన క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సెంచరీల రికార్డును కోహ్లీ సమం చేశాడు. కాగా సచిన్ కంటే వేగంగా కోహ్లీ 49 సెంచరీల మార్కును అందుకున్నాడు. అలాగే కోహ్లీ తన మొదటి వన్డే సెంచరీతోపాటు 49వ వన్డే సెంచరీని కూడా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలోనే సాధించడం గమనార్హం.
50- వైట్ బాల్ క్రికెట్‌లో అనగా వన్డేలు, టీ20ల్లో కలిపి కోహ్లీకి ఇది 50వ సెంచరీ. దీంతో వైట్ బాల్ క్రికెట్‌లో 50 సెంచరీలు చేసిన మొదటి బ్యాటర్‌గా కోహ్లీ చరిత్ర సృష్టించాడు. కాగా కోహ్లీ వన్డేల్లో 49 సెంచరీలతోపాటు టీ20ల్లో కూడా ఓ సెంచరీ చేశాడు.
3- ఈ మ్యాచ్‌లో చేసిన రన్స్ ద్వారా ప్రపంచకప్‌లో కోహ్లీ 1,500 పరుగులను పూర్తి చేసుకున్నాడు. దీంతో ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో కోహ్లీ మూడో స్థానానికి చేరుకున్నాడు.
119- కోహ్లీ సాధించిన సెంచరీ వన్డే ఫార్మాట్లో అతనికి 119వ 50+ స్కోర్ కావడం గమనార్హం. దీంతో వన్డేల్లో అత్యధిక సార్లు 50+ స్కోర్లు సాధించిన బ్యాటర్ల జాబితాలో కోహ్లీ రెండో స్థానానికి చేరుకున్నాడు. ఈ క్రమంలో శ్రీలంక మాజీ క్రికెటర్ కుమార సంగక్కర(118) రికార్డును కోహ్లీ బ్రేక్ చేశాడు. ఈ జాబితాలో మాష్టర్ బ్లాష్టర్ సచిన్ టెండూల్కర్ మొదటి స్థానంలో ఉన్నాడు. కాగా సచిన్ 145 సార్లు 50+ స్కోర్లు సాధించాడు.
5- వన్డేల్లో సౌతాఫ్రికాపై కోహ్లీకి ఇది ఐదో సెంచరీ. దీంతో ఈ ఫార్మాట్లో సౌతాఫ్రికాపై అత్యధిక సెంచరీలు చేసిన సచిన్ టెండూల్కర్, డేవిడ్ వార్నర్ రికార్డును కోహ్లీ సమం చేశాడు.
7- అంతర్జాతీయ క్రికెట్‌లో పుట్టిన రోజు నాడు సెంచరీ చేసిన ఏడో బ్యాటర్ విరాట్ కోహ్లీ. భారత్ తరఫున మూడో ఆటగాడు. ప్రపంచకప్‌లో పుట్టిన రోజు నాడు సెంచరీ సాధించిన మూడో ఆటగాడు. మొత్తంగా కోహ్లీ కంటే ముందు సచిన్ టెండూల్కర్, వినోద్ కాంబ్లీ, సనత్ జయసూర్య, రాస్ టేలర్, టామ్ లాథమ్, మిచెల్ మార్ష్ పుట్టిన రోజు నాడు సెంచరీ సాధించారు.
22- వన్డేల్లో మొదట బ్యాటింగ్ చేసినప్పుడు విరాట్ కోహ్లీకి ఇది 22వ సెంచరీ. దీంతో వన్డేల్లో మొదటి బ్యాటింగ్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్లలో ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు రికీ పాంటింగ్ (22)ను సమం చేశాడు.
6046- ఈ మ్యాచ్‌లో చేసిన రన్స్ ద్వారా వన్డేల్లో స్వదేశంలో కోహ్లీ 6 వేల పరుగులను పూర్తి చేసుకున్నాడు. దీంతో స్వదేశంలో వేగంగా ఈ మార్కు అందుకున్న బ్యాటర్‌గా నిలిచాడు.
1- ఈ మ్యాచ్‌లో అందుకున్న ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ద్వారా ఐసీసీ టోర్నమెంట్లలో అత్యధికసార్లు ఈ అవార్డు అందుకున్న ప్లేయర్‌గా విరాట్ కోహ్లీ నిలిచాడు. కాగా వన్డే ఫార్మాట్లో కోహ్లీకి ఇది 41వ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు.
55- అంతర్జాతీయ క్రికెట్‌లో తమ జట్టు గెలిచిన మ్యాచ్‌ల్లో అత్యధిక సార్లు సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు రికీ పాంటింగ్‌తో కలిసి విరాట్ కోహ్లీ మొదటి స్థానంలో ఉన్నాడు. వీరిద్దరు తమ తమ జట్టు గెలిచిన మ్యాచ్‌ల్లో 55 సెంచరీలు నమోదు చేశారు.
3058- సౌతాఫ్రికాపై అన్ని ఫార్మాట్లలో కలిపి విరాట్ కోహ్లీ 3 వేల పరుగులను పూర్తి చేసుకున్నాడు. దీంతో ఈ ఘనత సాధించిన రెండో భారత బ్యాటర్‌గా నిలిచాడు. ఇప్పటివరకు సౌతాఫ్రికాపై అన్ని ఫార్మాట్లలో కలిపి 58 మ్యాచ్‌లాడిన కోహ్లీ 3,058 పరుగులు చేశాడు. ఇందులో 8 సెంచరీలు, 14 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక వన్డేల్లో సౌతాఫ్రికాపై విరాట్ 1,500 పరుగులను పూర్తి చేసుకున్నాడు.
ఇక ఈ మ్యాచ్ విషయానికొస్తే దక్షిణాఫ్రికాతో పోరులో టీమిండియాదే గెలుపు అనుకున్నారు కానీ.. ప్రత్యర్థి మరీ ఇంత దారుణంగా ఆడుతుందని ఎవరూ భావించలేదు. తొలుత బ్యాటింగ్‌లో ఆపై బౌలింగ్‌లో టీమిండియా అదిరే ప్రదర్శన చేయడంతో సఫారీలతో మ్యాచ్ పూర్తిగా ఏకపక్షమైంది. ఛేదనలో తమ బలహీనతను పునరావృతం చేస్తూ 243 పరుగుల తేడాతో భారీ ఓటమిని మూటగట్టుకున్నారు. ఆదివారంనాటి మ్యాచ్‌లో తొలుత భారత్ 50 ఓవర్లలో 5 వికెట్లకు 326 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (121 బంతుల్లో 10 ఫోర్లతో 101 నాటౌట్) శతక్కొట్టగా, శ్రేయాస్ (87 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 77) హాఫ్ సెంచరీతో మెరిశాడు. రోహిత్ శర్మ (24 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 40) ధనాధన్ ఆరంభం ఇవ్వగా, జడేజా (15 బంతుల్లో 3 ఫోర్లు, సిక్సర్‌తో 29 నాటౌట్), సూర్యకుమార్ (14 బంతుల్లో 5 ఫోర్లతో 22) విజృంభించారు. అనంతరం దక్షిణాఫ్రికా 27.1 ఓవర్లలో 83 పరుగులకే కుప్పకూలింది. జాన్సెన్ (14) టాప్ స్కోరర్. డ్యూసెన్, బవుమా, మిల్లర్ మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. జడేజా (5/33) ఐదు వికెట్లతో వణికించగా, కుల్దీప్ (2/7), షమి (2/18) చెరో రెండు వికెట్లతో ప్రత్యర్థి పనిబట్టారు. కోహ్లీ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు.