Shikhar Dhawan: క్రికెటర్ శిఖర్ ధావన్‌కు విడాకులు మంజూరు.. విచారణలో బయటపడ్డ సంచలన విషయాలు

ABN , First Publish Date - 2023-10-05T09:37:04+05:30 IST

టీమిండియా వెటరన్ క్రికెటర్ శిఖర్ ధావన్‌కు విడాకులు మంజూరయ్యాయి. శిఖర్ ధావన్, ఆయేషా ముఖర్జీ దంపతులకు ఢిల్లీలోని ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. దీంతో వారి 11 ఏళ్ల వివాహం బంధం రద్దైంది.

Shikhar Dhawan: క్రికెటర్ శిఖర్ ధావన్‌కు విడాకులు మంజూరు.. విచారణలో బయటపడ్డ సంచలన విషయాలు

న్యూఢిల్లీ: టీమిండియా వెటరన్ క్రికెటర్ శిఖర్ ధావన్‌కు విడాకులు మంజూరయ్యాయి. శిఖర్ ధావన్, ఆయేషా ముఖర్జీ దంపతులకు ఢిల్లీలోని ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. దీంతో వారి 11 ఏళ్ల వివాహం బంధం రద్దైంది. పరస్పర అంగీకారంతో ఇద్దరు విడాకులు తీసుకున్నారని కోర్టు తెలిపింది. అయితే విచారణ సమయంలో పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ధావన్ పడిన మానసిక వేదన కోర్టు దృష్టికి వచ్చింది. ఈ క్రమంలో విచారణలో ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి హరీష్ కుమార్.. శిఖర్ ధావన్ చేసిన ఆరోపణలను విశ్వసించారు. భార్య ఆయేషా ముఖర్జీ తనను మానసికంగా వేధించిందన్న ధావన్ వాదనలను సమర్థించారు. కుమారుడితో కొన్నాళ్లపాటు విడిగా ఉండాలని ఆయేషా ముఖర్జీ ఒత్తిడికి గురి చేయడంతో ధావన్ మానసిక వేదనకు గురయ్యాడని న్యాయమూర్తి పేర్కొన్నారు. అయితే వారి కుమారుడిని శాశ్వత కస్టడీకి సంబంధించి ఉత్తర్వులు ఇవ్వడానికి ఢిల్లీ ఫ్యామిలీ కోర్టు నిరాకరించింది. కానీ ఆస్ట్రేలియాలో ఉన్న తన కుమారుడు జోరావర్‌ను చూసేందుకు మాత్రం ధావన్‌కు కోర్టు అనుమతించింది. స్కూల్ అకడమిక్ షెడ్యూల్‌ను దృష్టిలో ఉంచుకుని, సెలవుల్లో ధావన్, అతని కుటుంబసభ్యులను కలిసేందుకు జోరావర్‌ను ఇండియాకు తీసుకురావాలని ఆయేషాను కోర్టు ఆదేశించింది. అలాగే వీడియో కాల్స్ ద్వారా ధావన్ తన కొడుకుతో టచ్‌లో ఉండేందుకు కూడా కోర్టు అనుమతించింది.


‘‘వివాహానికి ముందు ధావన్‌తో కలిసి ఇండియాలో నివసించేందుకు ఆయేషా అంగీకరించింది. కానీ ఆమెకు అప్పటికే మొదటి వివాహం ద్వారా జన్మించిన ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. దీంతో ధావన్‌కు ముందుగా ఇచ్చిన మాట ప్రకారం ఇండియాలో ఎక్కువ కాలం నివసించలేదు. కుమారుడు జోరావర్‌ను కూడా ఆస్ట్రేలియాలోనే పెంచింది. ఇందులో ధావన్ తప్పు లేకున్నా అతనికి కుమారుడిని దూరం చేసిన ఆయేషా మానసిక ఆవేదనకు గురిచేసింది. అలాగే ధావన్ తన సొంత డబ్బుతో కొనుగోలు చేసిన మూడు ఆస్తులలో ఒకదానిని 99 శాతం తన పేరిట రాయాలాని ఆయేషా ఒత్తిడి చేసింది. మిగిలిన రెండు ఆస్తుల్లో తనను ఉమ్మడి యజమానిగా ఉంచాలని ధావన్‌ను వేధించింది. ధావన్ పరువుకు నష్టం కలిగించేలా అతని తోటి క్రికెటర్లు, ఐపీఎల్ ఫ్రాంచైజీలకు ఆయేషా సందేశాలు పంపించింది.’’ అని కోర్టు పేర్కొంది. అలాగే ఆయేషా కుమారుడితో ఇండియాలో ఉన్న సమయంలో కూడా ఆస్ట్రేలియాలో ఉన్న కుమార్తెల పాఠశాల ఫీజుల కోసం ధావన్ నుంచి డబ్బులు వసూల్ చేసినట్లు అతని తరఫు న్యాయవాది అమన్ హోంగోరాణి కోర్టుకు తెలిపారు. నెలకు రూ.80 లక్షల నుంచి రూ. కోటి వరకు పంపాలని ఒత్తిడి చేసినట్లు వివరించారు. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకున్న కోర్టు విడాకులు మంజూరు చేసింది.

Untitled-1-copy-29.jpg

కాగా ధావన్-ఆయేషాలకు 2012లో వివాహం జరిగింది. ధావన్ కన్నా ఆయేషా 10 సంవత్సరాలు పెద్దది అయినప్పటికీ కుటుంబసభ్యులను ఒప్పించి మరి వివాహం చేసుకున్నాడు. అలాగే ఆయేషాకు అప్పటికే వివాహం అయి ఇద్దరు కూతుళ్లు ఉండడంతో వారిని కూడా స్వీకరించాడు. ఆ తర్వాత ధావన్-ఆయేషా దంపతులకు 2014లో జోరావర్ పుట్టాడు. ఇక కొన్నేళ్లుగా విడిగా ఉంటున్న ఈ దంపతులు తాజాగా విడాకులు తీసుకున్నారు.

Updated Date - 2023-10-05T09:37:04+05:30 IST