IND vs AUS 3rd ODI: టాస్ ఆస్ట్రేలియాదే.. ఓపెనర్లుగా రోహిత్, కోహ్లీ.. టీమిండియా తుది జట్టులో 6 మార్పులు!

ABN , First Publish Date - 2023-09-27T13:14:06+05:30 IST

భారత్‌తో మూడో వన్డే మ్యాచ్‌లో పర్యాటక జట్టు ఆస్ట్రేలియా జట్టు టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కాయిన్ వేయగా ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ హెడ్స్ చెప్పాడు.

IND vs AUS 3rd ODI: టాస్ ఆస్ట్రేలియాదే.. ఓపెనర్లుగా రోహిత్, కోహ్లీ.. టీమిండియా తుది జట్టులో 6 మార్పులు!

రాజ్‌కోట్: భారత్‌తో మూడో వన్డే మ్యాచ్‌లో పర్యాటక జట్టు ఆస్ట్రేలియా జట్టు టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కాయిన్ వేయగా ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ హెడ్స్ చెప్పాడు. కాయిన్ హెడ్స్ పడింది. దీంతో టాస్ గెలిచిన కమిన్స్ మొదట బ్యాటింగ్ చేస్తామని చెప్పాడు. ఈ మ్యాచ్‌లో భారత జట్టు తమ తుది జట్టులో ఏకంగా 6 మార్పులు చేసింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, వాషింగ్టన్ సుందర్, సిరాజ్ జట్టులోకి రాగా.. శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ ఈ మ్యాచ్ ఆడడం లేదు. గిల్, కిషన్, రుతురాజ్ ఆడడం లేదు కాబట్టి ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మకు జోడిగా విరాట్ కోహ్లీ ఓపెనింగ్‌లో ఆడే అవకాశాలున్నాయి. అదే జరిగితే వన్డేల్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కలిసి ఓపెనర్లుగా ఆడడం ఇదే మొదటి సారి అవుతుంది. అటు ఆస్ట్రేలియా కూడా తమ తుది జట్టులో ఏకంగా 5 మార్పులు చేసింది. కెప్టెన్ కమిన్స్‌తోపాటు స్టార్క్, మాక్స్‌వెల్ తుది జట్టులోకి వచ్చారు. తన్వీర్ సంఘా ఈ మ్యాచ్‌తో వన్డేల్లోకి అరంగేట్రం చేస్తున్నాడు. కాగా మూడు వన్డేల సిరీస్‌ను టీమిండియా ఇప్పటికే 2-0తో గెలుచుకుంది. ఈ మూడో వన్డేను కూడా గెలిచి సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాలని పట్టుదలగా ఉంది. మరోవైపు ఇప్పటికే సిరీస్ కోల్పోయిన ఆస్ట్రేలియా చివరి మ్యాచ్‌లోనైనా గెలవాలని భావిస్తోంది.


తుది జట్లు

భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ కృష్ణ

ఆస్ట్రేలియా: మిచెల్ మార్ష్, డేవిడ్ వార్నర్, స్టీవెన్ స్మిత్, మార్నస్ లబుషేన్, అలెక్స్ కారీ(వికెట్ కీపర్), గ్లెన్ మాక్స్‌వెల్, కామెరాన్ గ్రీన్, పాట్ కమిన్స్(కెప్టెన్), మిచెల్ స్టార్క్, తన్వీర్ సంఘా, జోష్ హాజిల్‌వుడ్

Updated Date - 2023-09-27T13:39:03+05:30 IST