Ashwin: ఆస్ట్రేలియాతో సిరీస్‌కు అశ్విన్‌ను ఎంపిక చేయడానికి కారణమిదేనా?.. మరి అక్షర్ పటేల్ పరిస్థితేంటి?..
ABN , First Publish Date - 2023-09-19T15:56:28+05:30 IST
మరో 15 రోజుల్లో వన్డే ప్రపంచకప్ ప్రారంభం కానుంది. అంతకన్న ముందు ఈ నెల 22 నుంచి ఆస్ట్రేలియాతో టీమిండియా 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడనుంది.
మరో 15 రోజుల్లో వన్డే ప్రపంచకప్ ప్రారంభం కానుంది. అంతకన్న ముందు ఈ నెల 22 నుంచి ఆస్ట్రేలియాతో టీమిండియా 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడనుంది. వన్డే ప్రపంచకప్‌నకు ముందు ఈ సిరీస్ టీమిండియాకు సన్నాహకంగా ఉపయోగపడనుంది. దీంతో వన్డే ప్రపంచకప్ ఆడే జట్టే ఈ సిరీస్‌లో బరిలోకి దిగుతుందని అంతా భావించారు. కానీ ఎవరూ ఊహించని విధంగా అసలు ప్రపంచకప్ జట్టులోనే లేని సీనియర్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్‌ను ఈ సిరీస్‌కు ఎంపిక చేశారు. దీంతో ప్రపంచకప్‌నకు ముందు టీమిండియా తప్పు చేస్తుందా? అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే అశ్విన్‌ను ఆస్ట్రేలియాతో సిరీస్‌కు ఎంపిక చేయడం వెనక పెద్ద కారణమే ఉందని తెలుస్తోంది. ఆసియా కప్ సూపర్ 4లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ గాయపడిన సంగతి తెలిసిందే. దీంతో అతను శ్రీలంకతో ఫైనల్ మ్యాచ్ ఆడలేదు. అయితే అక్షర్ పటేల్ గాయం తీవ్రతపై కానీ, ఎప్పటివరకు కోలుకుంటాడనే అంశంపై కానీ బీసీసీఐ ఇప్పటివరకు ఎలాంటి స్పష్టతనివ్వలేదు.
కాగా అక్షర్ పటేల్ వన్డే ప్రపంచకప్ జట్టులో ఉన్న సంగతి తెలిసిందే. ఒకవేళ అక్షర్ పటేల్ వన్డే ప్రపంచకప్ నాటికి పూర్తిగా కోలుకోకపోతే అశ్విన్‌ను జట్టులోకి తీసుకోవాలనే ఆలోచనలో టీమ్ మేనేజ్‌మెంట్ ఉందని సమాచారం. అందుకే అశ్విన్‌ను అప్పటికప్పుడు జట్టులోకి తీసుకోకుండా ఆస్ట్రేలియాతో సిరీస్‌కు ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. దీంతో అశ్విన్‌కు కూడా ఈ సిరీస్ సన్నాహకంగా ఉండనుంది. అయితే ఆసియా కప్ ఫైనల్‌లో ఆడిన వాషింగ్టన్ సుందర్ కూడా రేసులో ఉన్నప్పటికీ ప్రపంచకప్ జరిగే సమయంలో అతను చైనాలో జరిగే ఆసియా క్రీడల్లో ఉంటాడు. పైగా సుందర్‌తో పోలిస్తే అశ్విన్‌కు అపారమైన అనుభవం ఉంది. దీంతో అక్షర్ పటేల్ అందుబాటులో లేకపోతే అశ్విన్‌ను తీసుకోవాలనే ఆలోచనలో టీమ్ మేనేజ్‌మెంట్ ఉందని సమాచారం. ఇదే విషయమై కెప్టెన్ రోహిత్ శర్మ సైతం ఇది వరకే హింట్ ఇచ్చాడు. కొంతకాలంగా వన్డేలు ఆడకపోయిన అశ్విన్‌కు అపార అనుభవం ఉందని, అతను వన్డే ప్రపంచకప్ జట్టులో ఉండాలని తాను కోరుకుంటున్నట్టు చెప్పాడు. అవసరమైతే అశ్విన్‌ను ప్రపంచకప్‌లో ఆడిస్తామని, తాము ఇదే విషయమై ఇప్పటికే అతనితో మాట్లాడినట్టు రోహిత్ తెలిపాడు. దీనిని బట్టి వన్డే ప్రపంచకప్ జట్టులో అశ్విన్‌కు చోటు దక్కే అవకాశాలున్నాయి. ఇక అశ్విన్ చివరగా 2022 జనవరిలో వన్డే మ్యాచ్ ఆడాడు.
ఇప్పటికే టీమిండియా వన్డే ప్రపంచప్ స్క్వాడ్‌ను ఐసీసీకి అందించారు. కానీ ఆటగాళ్లు ఎవరైనా గాయపడితే వారి స్థానంలో మరొకరిని ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ లెక్కన తెలుగు కుర్రాడు తిలక్ వర్మకు కూడా ప్రపంచకప్ జట్టులో చోటు దక్కిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆసియా కప్‌లో మళ్లీ వెన్ను నొప్పికి గురైన శ్రేయస్ అయ్యర్ ఫిట్‌నెస్‌పై ఇంకా అనుమానాలున్నాయి. ఒక వేళ ప్రపంచకప్ నాటికి శ్రేయస్ అయ్యర్ పూర్తి ఫిట్‌నెస్ సాధించకపోతే తిలక్‌ను జట్టులోకి తీసుకునే అవకాశాలు లేకపోలేదు. పైగా ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు తిలక్ వర్మను కూడా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.