Share News

TS Assembly Polls : మోదీ చేతిలో కీలుబొమ్మల్లా కేసీఆర్, అసదుద్దీన్‌.. కాంగ్రెస్ సరికొత్త ప్రచారం..!!

ABN , First Publish Date - 2023-11-11T14:28:29+05:30 IST

Telangana Elections: తెలంగాణలో ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ పక్కా వ్యూహంతో ముందుకు సాగుతోంది. ఏ చిన్నపాటి అవకాశం వచ్చినా సరే సువర్ణావకాశంగా మలుచుకుని.. ఎన్నికల ప్రచారం జోరుగా చేస్తోంది. బీఆర్‌ఎస్‌, బీజేపీ ఒక్కటే అని.. బీజేపీకి ఓటేస్తే బీఆర్‌ఎస్‌కు వేసినట్టే అంటూ హస్తం నేతలు విమర్శలు చేస్తున్నారు.

TS Assembly Polls : మోదీ చేతిలో కీలుబొమ్మల్లా కేసీఆర్, అసదుద్దీన్‌.. కాంగ్రెస్ సరికొత్త ప్రచారం..!!

హైదరాబాద్: తెలంగాణలో ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ పక్కా వ్యూహంతో ముందుకు సాగుతోంది. ఏ చిన్నపాటి అవకాశం వచ్చినా సరే సువర్ణావకాశంగా మలుచుకుని.. ఎన్నికల ప్రచారం జోరుగా చేస్తోంది. బీఆర్‌ఎస్‌ (BRS), బీజేపీ (BJP) ఒక్కటే అని.. బీజేపీకి ఓటేస్తే బీఆర్‌ఎస్‌కు వేసినట్టే అంటూ హస్తం నేతలు విమర్శలు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు తమ ప్రచారంలో అధికార పార్టీ, బీజేపీపై దుమ్మెత్తిపోస్తూనే ఉన్నారు. అయితే తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) ఈరోజు (శనివారం) హైదరాబాద్‌కు వస్తున్నారు. ఈ క్రమంలో మోదీ పర్యటనకు ముందు కాంగ్రెస్ పార్టీ వినూత్న ప్రచారానికి తెరలేపింది.


ఇంతకీ ఏమిటా ప్రచారం..!

‘బీఆర్ఎస్, ఎంఐఎంలను తోలుబొమ్మల్లా ఆడిస్తున్న ప్రధాని మోదీ’ అంటూ తోలుబొమ్మలతో కూడిన ఫ్లెక్సీలు, బ్యానర్లు చేసింది. భాగ్యనగరంలోని పలు ప్రాంతాల్లో ఈ బ్యానర్లను కాంగ్రెస్ ఏర్పాటు చేసింది. బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు బీజేపీ చేతిలో తోలుబొమ్మలు అంటూ అర్ధం వచ్చేలా వీటిని రూపొందించారు. ఈ తోలుబొమ్మల ఏర్పాటుతో బీఆర్ఎస్, ఎంఐఎంలను బీజేపీ చేతిలో కీలుబొమ్మలు అనే విషయాన్నే చెప్పకనే చెప్పింది. మోదీ, కేసీఆర్, అసదుద్దీన్ ఓవైసీలను తోలుబొమ్మల్లా ఆడిస్తున్నట్లు ఇందులో కనిపిస్తోంది. హైటెక్‌సిటీ, బేగంపేట లాంటి అనేక ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ ఈ తోలుబొమ్మలతో కూడిన బ్యానర్లను ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ చేస్తున్న ఈ సరికొత్త ప్రచారాన్ని ప్రజలు, అటుగా వెళ్తున్న వాహనదారులు ఎంతో ఆసక్తిగా తిలకిస్తున్నారు. మరోవైపు.. సోషల్ మీడియాలోనూ ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. దీంతో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎంగా కార్యకర్తలు, అభిమానులు విమర్శలు గుప్పించుకుంటున్నారు. మరి ఈ తోలుబొమ్మల బ్యానర్ల వ్యవహారంపై బీఆర్‌ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీల రియాక్షన్ ఎలా ఉండబోతుందో చూడాలి మరి. అయితే ఇప్పటికే ఈ విషయాన్ని రాష్ట్ర కమలనాథులు మోదీ చెవిన వేశారని.. పరేడ్ గ్రౌండ్ వేదికగా జరుగనున్న బహిరంగ సభలో ప్రధాని స్పందించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.

Updated Date - 2023-11-11T14:28:37+05:30 IST