Bandi Sanjay: ఇదిగో... అదిగో పోడు భూములకు పట్టాలిస్తామన్నారు.. అమలేది?
ABN , First Publish Date - 2023-05-19T14:57:16+05:30 IST
దళితులు, గిరిజనులు సాగు చేసుకుంటున్న అసైన్డ్ భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారాలను ఆపాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.
హైదరాబాద్: దళితులు, గిరిజనులు సాగు చేసుకుంటున్న అసైన్డ్ భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారాలను ఆపాలని బండి సంజయ్ (Telangana BJP Chief Bandi Sanjay) డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు (CMKCR) బండి సంజయ్ లేఖ రాశారు. ఎన్నో ఏళ్ల క్రితం దళితులకు, గిరిజనులకు అసైన్డ్ చేసిన భూములను లాక్కుంటూ రియల్ వ్యాపారం చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూములను లాక్కోవడం అంటే వారి నోటి కాడి ముద్ద లాక్కోవడమే అని అన్నారు. దళితులకు మూడు ఎకరాల సాగుభూమి ఇస్తామన్న హామీని వమ్ము చేసి దళితులు మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిగో... అదిగో పోడు భూములకు పట్టాలిస్తామంటూ హామీలివ్వడవ్వమే తప్ప అమలేది అని ప్రశ్నించారు. ‘‘ మీ రియల్ ఎస్టేట్ దందాకు దళితుల, గిరిజనుల భూములను గుంజుకుంటారా? దళిత, గిరిజనులంటే మీకెందుకు అంత కక్ష?’’ అంటూ మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో దళితులకు, గిరిజనులకు రక్షణ కరువైందన్నారు. దళితులు, గిరిజనుల బతుకులను ఆగం చేసే చర్యలను ప్రభుత్వం వెంటనే విడనాడాలని అన్నారు. అసైన్డ్ భూముల్లో రియల్ దందాకు తెరదించకుంటే బీజేపీ తెలంగాణ శాఖ పక్షాన పెద్దఎత్తున ఆందోళన చేపడతామని బండి సంజయ్ లేఖలో పేర్కొన్నారు.