Etela Rajender: ‘మాకో రూం ఇయ్యరా’... శాసనసభలో ఈటల

ABN , First Publish Date - 2023-02-08T13:04:20+05:30 IST

అసెంబ్లీలో బీజేపీకి గది కేటాయించకపోవడంపై ఆ పార్టీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.

Etela Rajender: ‘మాకో రూం ఇయ్యరా’... శాసనసభలో ఈటల

హైదరాబాద్: అసెంబ్లీ (Telangana Assembly)లో బీజేపీ (BJP)కి గది కేటాయించకపోవడంపై ఆ పార్టీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (BJP MLA Etela Rajender) అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ అంశాన్ని సభలో లేవనెత్తుతూ... అసెంబ్లీలో టిఫిన్ చేయడానికి కూడా తమకు రూం లేదని అన్నారు. రూం కూడా కేటాయించకపోవడం ఎమ్మెల్యేలను అవమానించడమే అని తెలిపారు. తాము కార్లలో కూర్చుంటున్నామని అన్నారు. ‘‘అసెంబ్లీలో బీజేపీ సభ్యులకు ఆఫీస్ కేటాయించాలి. ముగ్గురు ఎమ్మెల్యేలం ఉన్నాము కానీ మాకు ఆఫీస్ ఇవ్వడం లేదు. కనీసం యూరినల్స్ కు వెళ్లేందుకు కూడా మాకు వెసులుబాటు లేదు. ఇంత అవమానమా?. ఈ విషయంపై స్పీకర్‌ను అర డజను సార్లు కలిశాం. ఏదైనా సమస్యపై కూర్చుని మాట్లాడేందుకు ఒక రూం ఇయ్యరా. బీజేపీ సభ్యులను బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) మీటింగ్‌కు కూడా పిలుస్తలేరు. గతంలో సీపీఐ, సీపీఎం, ఒక్కొక్క సభ్యులు ఉన్నప్పటికీ బీఏసీకి పిలిచారు. ఇది అన్యాయం కాదా?’’ అంటూ ప్రశ్నించారు.

కాగా ఈటల మాటలకు మంత్రి హరీష్ రావు (Minister Harish Rao) మధ్యలో అడ్డుతగిలారు. సీనియర్ సభ్యులుగా తమకు నిబంధనలు తెలియవా అని ప్రశ్నించారు. ఐదుగురు సభ్యులు ఉంటేనే ఛాంబర్ ఇవ్వాలని నిబందన ఉందన్న విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి గుర్తుచేశారు. బడ్జెట్‌పై చర్చ జరుగుతున్న సమయంలో బడ్జెట్ పరిమితికి లోబడి, ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ.. బడ్జెట్‌పై విలువైన సూచనలు, సలహాలు ఇవ్వాలని మంత్రి హరీష్ రావు (Telangana Minister) కోరారు.

అయినప్పటికీ గది అంశంపై ఈటల మాట్లాడుతుండటంతో... సమస్య ఉంటే తన ఛాంబర్‌కు వచ్చి కలవాలని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి (Speaker Pocharam Srinivas Reddy)సూచించారు. మంత్రులు చెప్పిన విధంగా బడ్జెట్‌పై తమకు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. సీనియర్ శాసనసభ్యులు అయిన తమరు నిబంధనలు పాటించి... దానికి అనుగుణంగా వెళ్లాలని స్పీకర్ పోచారం తెలిపారు. దీంతో ఎమ్మెల్యే ఈటల రాజేందర్ బడ్జెట్‌పై అభిప్రాయాలను సభ ముందు ఉంచారు.

Updated Date - 2023-02-08T13:25:46+05:30 IST