BJP MLA: ఆలస్యంగా నిద్రలేచిన విద్యాశాఖ మంత్రికి కృతజ్ఞతలు... రఘునందన్ సెటైరికల్ ట్వీట్
ABN , First Publish Date - 2023-07-20T15:50:21+05:30 IST
గ్రేటర్‌లో భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం విద్యాసంస్థలకు రెండు రోజుల పాటు సెలవు ప్రకటించింది. ఈ విషయాన్ని విద్యాశాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.
హైదరాబాద్: గ్రేటర్‌లో భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం విద్యాసంస్థలకు రెండు రోజుల పాటు సెలవు ప్రకటించింది. ఈ విషయాన్ని విద్యాశాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Minister Sabita Indra Reddy) ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. అయితే పాఠశాలలు ప్రారంభమయ్యాక ఆలస్యంగా సెలవులు ప్రకటించడంపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు (BJP MLA Raghunandan Rao) సెటైరికల్ కామెంట్లు చేశారు. ట్విట్టర్ వేదికగా స్పందించిన ఎమ్మెల్యే.. ‘‘పిల్లలు స్కూల్ వెళ్లిన తర్వాత నిద్రలేచి విద్యాలయాలకు సెలవులు ప్రకటించిన విద్యాశాఖ మంత్రి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు’’ అంటూ రఘునందన్ రావు ట్వీట్ చేశారు.
మరోవైపు విద్యాశాఖ మంత్రి సెలవు ప్రకటించకముందే ఉదయం పాఠశాలలు ప్రారంభమైపోయాయి. అనేక మంది విద్యార్థులు పాఠశాలలకు కూడా వెళ్లిపోయారు. సెలవులపై మంత్రి ఆలస్యంగా ప్రకటన చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ తీరుపై సోషల్ మీడియాలో నెటిజన్లు సెటైర్లు విసురుతున్న పరిస్థితి. మేడం ఆలస్యంగా లేచారా అంటూ మండిపడుతున్నారు. గత రెండు రోజులుగా వర్షాలు కురుస్తుంటే ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేదంటూ తల్లిదండ్రులు కూడా విమర్శలు గుప్పిస్తున్నారు.