Nama Nageswara Rao: అవిశ్వాస తీర్మానంపై చర్చలో కేంద్రాన్ని ఏకిపారేసిన బీఆర్ఎస్ ఎంపీ

ABN , First Publish Date - 2023-08-09T16:14:41+05:30 IST

విభజన చట్టంలో ఎన్నో హామీలు ఇచ్చారు. తెలంగాణ విషయంలో కేంద్రం ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. నిన్న బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే మాట్లాడుతూ తన నియోజకవర్గానికి ఎయిమ్స్, కేంద్రీయ విద్యాలయాలు వచ్చాయని చెప్పారు.

Nama Nageswara Rao: అవిశ్వాస తీర్మానంపై చర్చలో కేంద్రాన్ని ఏకిపారేసిన బీఆర్ఎస్ ఎంపీ

ఢిల్లీ: అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇస్తున్నట్లు బీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నేత నామ నాగేశ్వర రావు (Nama nageswara rao) తెలిపారు. అవిశ్వాస తీర్మానంపై చర్చలో భాగంగా ఆయన సభలో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘‘విభజన చట్టంలో ఎన్నో హామీలు ఇచ్చారు. తెలంగాణ విషయంలో కేంద్రం ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. నిన్న బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే మాట్లాడుతూ తన నియోజకవర్గానికి ఎయిమ్స్, కేంద్రీయ విద్యాలయాలు వచ్చాయని చెప్పారు. మరి తెలంగాణకు ఎందుకు ఇవ్వడం లేదు?. తెలంగాణ భారతదేశంలోనే ఉంది కదా?, నవోదయ విద్యాలయాలు ఇవ్వలేదు. ఆల్రెడీ మంజూరు చేసిన ఐటీఐఆర్ ప్రాజెక్టును కేంద్రం రద్దు చేసింది. తెలంగాణ అమలు చేస్తున్న కొన్ని పథకాలను కేంద్రం కాపీ చేస్తోంది. మంచిదే. ప్రతి ఏటా రైతులకు ఎకరానికి ఏడాదికి రూ. 10 వేలు తెలంగాణలో ఇస్తున్నాం. ప్రతి ఇంటికీ పైప్ లైన్ ద్వారా సురక్షిత తాగునీటిని అందిస్తున్నాం. తెలంగాణ ఏర్పడే నాటికి తాగడానికి నీళ్లు లేవు. వ్యవసాయానికి నీళ్లు లేవు. మేం తీసుకొచ్చిన మిషన్ భగీరథను కాపీ చేసి.. హర్ ఘర్ జల్ అంటున్నారు. అన్ని రాష్ట్రాలకు నిధులు ఇస్తారు. కానీ మిషన్ భగీరథకు మాత్రం కేంద్రం నుంచి నిధులు ఇవ్వలేదు.‌‌’’ అని కేంద్రాన్ని నామా నిలదీశారు.

బీఆర్ఎస్ ఎంపీ నామా మాట్లాడుతుండగా బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే మధ్యలో జోక్యం చేసుకుని కాళేశ్వరం ప్రాజెక్టు కోసం రూ. 86 వేల కోట్లు కేంద్రం ఇచ్చిందని గుర్తుచేశారు.

అనంతరం నామా తన ప్రసంగాన్ని కొనసాగించారు. ‘‘మిషన్ భగీరథ కోసం నిధులు ఇవ్వాలని నీతి ఆయోగ్ సిఫార్సు చేసింది. అయినా సరే కేంద్రం ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. రైతులకు 24 గంటలూ ఉచిత కరెంట్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే. అమెరికాలో పవర్ కట్ ఉండొచ్చేమో.. కానీ తెలంగాణలో ఒక్క నిమిషం కూడా కరెంట్ పోదు. తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్రం అంధకారంలో ఉండేది. పంటల దిగుబడిలో పంజాబ్‌ను అధిగమించి రికార్డు స్థాయిలో ఉత్పత్తి చేస్తున్నాం. ఆదాయంలో తెలంగాణ దేశంలోనే నెంబర్-1 గా ఉంది. కేంద్ర ప్రభుత్వ మద్దతు లేకపోయినా సరే మేము నెంబర్ 1కి చేరుకోగలిగాం. కేంద్రం అనేక అంశాల్లో విఫలమైంది. చమురు ధరలు పెరిగాయి. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. దేశంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోయింది. మేము ఎన్డీఏ కాదు.. ఇండియా కూటమి కూడా కాదు. మాది భారత రాష్ట్ర సమితి. దేశ ప్రజలతో మేమున్నాం.’’ అని పేర్కొన్నారు.

‘‘మణిపూర్ విషయంలో ప్రపంచం ముందు భారత్ తలదించుకోవాల్సి వస్తోంది. సుప్రీంకోర్టు కూడా ముగ్గురు మాజీ జడ్జిలతో కమిటీ ఏర్పాటు చేసింది. 15వ లోక్‌సభ సమయంలో మీరు ప్రతిపక్షంలో ఉన్నారు. అప్పుడు కాశ్మీర్‌లో జరిగిన హింసపై అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలని సుష్మస్వరాజ్‌తో పాటు మేము డిమాండ్ చేశాం. అదే రీతిలో మణిపూర్‌కు అఖిలపక్ష బృందాన్ని కేంద్రం తీసుకెళ్లాలి.’’ అని నామా డిమాండ్ చేశారు.

Updated Date - 2023-08-09T16:14:41+05:30 IST