TSRTC: తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం.. కొత్తగా మరో రాష్ట్రానికి సర్వీసులు
ABN , First Publish Date - 2023-02-22T17:32:13+05:30 IST
ఇరు రాష్ట్రాల ప్రజలు ఈ బస్సు సర్వీస్‌లను వినియోగించుకుని, క్షేమంగా, సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని కోరారు.
హైదరాబాద్: ఒడిశా (Odisha)కు బస్ సర్వీసులను నడపాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) (TSRTC) నిర్ణయించింది. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్న మార్గాల్లో 10 బస్సులను తిప్పేందుకు సిద్ధమైంది. ఇరు రాష్ట్రాల మధ్య పరస్పర బస్ సర్వీసుల ఏర్పాటుపై ఒడిశా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఓఎస్ఆర్టీసీ)తో టీఎస్ఆర్టీసీ ఒక ఒప్పందం చేసుకుంది. హైదరాబాద్ బస్ భవన్ (Hyderabad Bus Bhawan)లో జరిగిన కార్యక్రమంలో టీఎస్ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ సమక్షంలో సంస్థ ఎండీ వీసీ సజ్జనర్, ఓఎస్ఆర్టీసీ ఎండీ దిప్తేష్ కుమార్ పట్నాయక్ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. వాటిని పరస్పరం అందజేసుకున్నారు. ఈ ఒప్పందం ప్రకారం.. టీఎస్‌ఆర్టీసీ 10 బస్సులను ఒడిశాకు.. ఓఎస్‌ఆర్టీసీ 13 సర్వీస్‌లను తెలంగాణకు నడపనుంది.
సర్వీస్‌లు ఇలా..
హైదరాబాద్-జైపూర్ 2, ఖమ్మం-రాయఘఢ 2, భవానిపట్న - విజయవాడ (వయా భద్రాచలం) 2, భద్రాచలం-జైపూర్ 4 బస్సు సర్వీసులను టీఎస్‌ఆర్టీసీ నడపనుంది.
నవరంగ్‌పూర్-హైదరాబాద్ 4, జైపూర్-హైదరాబాద్ 2, భవానిపట్న-విజయవాడ(వయా భద్రాచలం) 2, రాయఘఢ-కరీంనగర్ 2, జైపూర్-భద్రాచలం 3 బస్సులను ఓఎస్‌ఆర్టీసీ తిప్పనుంది.
తెలంగాణ-ఒడిశా మధ్యలో ప్రయాణికులు ఎక్కువగా రాకపోకలు సాగిస్తుంటారని టీఎస్‌ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ తెలిపారు. డిమాండ్ నేపథ్యంలో ఓఎస్‌ఆర్టీసీతో అంతర్రాష్ట్ర ఒప్పందం కుదుర్చుకున్నట్లు వెల్లడించారు. రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించామని, ఆయా మార్గాల్లో 10 బస్సులతో ఒడిశాలో 3378 కిలోమీటర్ల మేర నడపాలని సంస్థ నిర్ణయించిందని తెలిపారు. ఇరు రాష్ట్రాల ప్రజలు ఈ బస్సు సర్వీస్‌లను వినియోగించుకుని, క్షేమంగా, సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని కోరారు.
ఇది కూడా చదవండి: రాజభోగం అంటే ఇతడిదే.. ఇంట్లో ఖాళీగా ఉంటోంటే.. భార్యలే ఉద్యోగాలు చేసి భర్తను పోషిస్తున్నారు..!
టీఎస్‌ఆర్టీసీ తీసుకువచ్చిన పలు కార్యక్రమాలను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ఓఎస్‌ఆర్టీసీ ఉన్నతాధికారులకు ఈ సందర్భంగా వివరించారు. టీఎస్‌ఆర్టీసీ ప్రయాణికులకు కల్పిస్తున్న సౌకర్యాలు అద్భుతంగా ఉన్నాయని ఓఎస్‌ఆర్టీసీ ఎండీ దిప్తేష్ కుమార్ పట్నాయక్ ప్రశంసించారు. తమ రాష్ట్రంలోనూ వాటిని అమలు చేసే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. ఈ ఒప్పందం వల్ల రెండు సంస్థల మధ్య స్నేహపూర్వక వాతావరణం నెలకొంటుందని తెలిపారు. ఈ ఒప్పందం ప్రకారం 13 బస్సు సర్వీస్‌లతో తెలంగాణలో 2896 కిలోమీటర్ల మేర నడుపుతన్నట్లు వివరించారు.
ఈ కార్యక్రమంలో టీఎస్ఆర్టీసీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సీవోవో) డాక్టర్ వి.రవిందర్, జాయింట్ డైరెక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు మునిశేఖర్, వినోద్ కుమార్, సీపీఎం కృష్ణకాంత్, సీటీఎం జీవనప్రసాద్, సీఎంఈ రఘునాథరావు, ఐటీ చీఫ్ ఇంజనీర్ రాజశేఖర్, సీటీఎం(ఎం అండ్ సీ) విజయ్ కుమార్, బిజినెస్ హెడ్(లాజిస్టిక్స్) సంతోష్ కుమార్, చీఫ్ మేనేజర్(ఫైనాన్స్) విజయ పుష్ఫతో పాటు ఓఎస్‌ఆర్టీసీ ఓఎస్డీ దీప్తి మహాపాత్రో, ట్రాన్స్‌ఫోర్ట్ ప్లానర్ సందీప్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: 24 ఏళ్ల కుర్రాడు.. బరువు 240 కేజీలు.. కేవలం 2 నెలల్లోనే 70 కిలోలు తగ్గిపోయాడు.. అసలు ఈ వింత ఎలా సాధ్యమైందంటే..