MLA Rajasingh: టీడీపీలో చేరడంపై రాజాసింగ్ క్లారిటీ
ABN , First Publish Date - 2023-04-29T12:00:24+05:30 IST
టీడీపీలో చేరతారంటూ వస్తున్న వార్తలపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ క్లారిటీ ఇచ్చారు.
హైదరాబాద్: టీడీపీలో (TDP) చేరతారంటూ వస్తున్న వార్తలపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (Goshamahal MLA Rajasingh) క్లారిటీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీలో తాను చేరటం లేదని... బీజేపీలో (BJP) కొనసాగాలనేది తన అభిమతమన్నారు. బీజేపీ విధించిన సస్పెన్షన్ ఎత్తివేతపై ఆఖరి క్షణం వరకు ఎదురుచుస్తానని చెప్పారు. సస్పెన్షన్ ఎత్తివేయకుంటే రాజకీయాలకు దూరంగా జరిగి.. హిందూ ధర్మం కోసం పనిచేస్తానన్నారు. అలాగే టీడీపీ అధినేత చంద్రబాబుపై (TDP Chief Chandrababu Naidu) రాజాసింగ్ ప్రసంశల వర్షం కురిపించారు. తెలంగాణ అభివృద్ధికి కారణం చంద్రబాబు అని.. కేసీఆర్‌తో (Telangana CM KCR) ఏమీ కాలేదన్నారు. రానున్న ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో (Andhrapradesh) చంద్రబాబు మళ్ళీ గెలిచే అవకాశాలున్నాయని తెలిపారు. చంద్రబాబు అంటే తనకు చాలా గౌరవమని... రాజకీయంగా తనకు చంద్రబాబే లైఫ్ ఇచ్చారన్నారు. ‘‘గౌరవం ఉండటం వేరు.. రాజకీయాలు వేరు. ఆంధ్రాలో టీడీపీ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నాను. నా మెంటాలిటీకి బీజేపీ మాత్రమే సూట్ అవుతుంది’’ అని రాజాసింగ్ పేర్కొన్నారు.
కాగా.. రాజాసింగ్ 2009లో జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసి కార్పొరేటర్‌గా గెలిచిన విషయం తెలిసిందే. అనంతరం బీజేపీలో చేరి 2014 అసెంబ్లీ ఎన్నికల్లో గోషామహల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2018లోనూ అదే స్థానం నుంచి రాజాసింగ్ గెలుపొందారు. అయితే ఓ వర్గంపై చేసిన వ్యాఖ్యల కారణంగా రాజాసింగ్ జైలుకు వెళ్లగా.. బీజేపీ అధిష్ఠానం ఆయనను సస్పెండ్ చేసింది. ఇప్పటికీ సస్పెన్షన్ ఎత్తివేతపై పార్టీ నిర్ణయం తీసుకోకపోవడంతో ఆయన టీడీపీలో చేరేందుకు సిద్ధమైనట్లు జోరుగా ప్రచారం జరిగింది. తాజాగా తాను టీడీపీలో చేరడం లేదంటూ రాజాసింగ్ చెప్పడంతో రూమర్లకు ఫుల్‌స్టాప్ పడినట్లైంది.