MLC Kavitha : రేపు ఈడీ విచారణ.. ఇంతలోనే ట్విస్ట్ ఇచ్చిన కవిత
ABN , First Publish Date - 2023-03-15T11:41:03+05:30 IST
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రేపు (మార్చి 16) ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే ఆమె ఇప్పటికే ఢిల్లీకి వెళ్లారు.
ఢిల్లీ : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) రేపు (మార్చి 16) ఢిల్లీ లిక్కర్ స్కాం (Delhi Liquor Scam) కేసులో ఈడీ (ED) విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే ఆమె ఇప్పటికే ఢిల్లీకి వెళ్లారు. అయితే ఈడీ విచారణకు ముందే ఆమె ఓ ట్విస్ట్ ఇచ్చారు. ఈడీ నోటీసులపై సుప్రీంకోర్టు (Supreme Court)ను కవిత (Kavitha ED Enquiry) ఆశ్రయించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కార్యాలయానికి మహిళను విచారణకు పిలవవచ్చా? అనే అంశంపై సుప్రీంకోర్టులో ఆమె పిటిషన్ దాఖలు చేశారు. ఒక మహిళను ఈడీ విచారణకు పిలుస్తోందని ఇది పూర్తిగా చట్టానికి విరుద్ధమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కవిత తరుఫు లాయర్ వివరించారు. ఈ కేసులో కవితకు చుక్కెదురైంది. మధ్యంతర రిలీఫ్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అయితే ఈ కేసు విచారణను సుప్రీంకోర్టు ధర్మాసనం మార్చి 24కు వాయిదా వేసింది. దీంతో రేపు ఈడీ విచారణకు కవిత హాజరు కానున్నారు.
కొండగట్టు అంజన్నకు మొక్కి..
ఎమ్మెల్సీ కవిత ఢిల్లీకి వెళ్లడానికి ఒకరోజు ముందు అంటే నిన్న ఆమె కొండగట్టు అంజన్నకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో మంగళవారం పూజలు నిర్వహించారు. వేకువజామున 5 గంటలకు ఆలయానికి వచ్చి స్వామి సన్నిధిలో దాదాపు గంట సేపు గడిపారు. వ్యక్తిగత సహాయ సిబ్బంది, గన్‌మన్‌లతో మాత్రమే కవిత గుడికి వచ్చారు. గురువారం ఈడీ విచారణ ఉన్న నేపథ్యంలో ఆమె అంజన్నను దర్శించుకోవడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. కాగా, మహిళా రిజర్వేషన్ బిల్లుపై కవిత నేతృత్వంలో బుధవారం ఢిల్లీలో రౌండ్ టేబుల్ సమావేశం జరగనుంది.
11న తొలిసారి విచారణ..
దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఈ నెల 11న తొలిసారిగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ విచారించింది. నాటి ఉదయం 11 గంటలకు ప్రారంభమైన క్వశ్చన్ అవర్ రాత్రి 8 గంటల వరకూ జరిగింది. మొత్తం 9 గంటలపాటు కవితను ఈడీ అధికారులు విచారించారు. అయితే నిజానికి సాయంత్రం 5.30 గంటలకే విచారణ ముగియాల్సి ఉండగా.. అనూహ్యంగా అధికారులు ఆ సమయాన్ని పెంచారు. రూల్ ప్రకారం మహిళలను సాయంత్రం 6 వరకూ మాత్రమే విచారించాల్సి ఉన్నా, సమయం దాటినా కవితను ఈడీ బయటకు పంపలేదు. ఈడీ వైఖరితో బీఆర్‌ఎస్ శ్రేణులు ఆందోళనలో పడ్డాయి. అయితే.. కవిత బయటికి రాగానే.. బీఆర్ఎస్ శ్రేణులు హ్యాపీగా ఫీలయ్యి ఈలలు, కేకలు, నినాదాలతో హోరెత్తించాయి.