Revanth: బీజేపీ, బీఆర్ఎస్ ఉప ఎన్నికల్లో వందల కోట్లు ఖర్చు చేశాయి
ABN , First Publish Date - 2023-10-17T16:19:01+05:30 IST
హైదరాబాద్: సీఎం కేసీఆర్, మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ పదే పదే కాంగ్రెస్‌పై ఆరోపణలు చేస్తున్నారని, డబ్బులు, మందు పంచి ఎన్నికల్లో గెలవాలని కాంగ్రెస్ చూస్తోందని ఆరోపిస్తున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ అన్నారు.
హైదరాబాద్: సీఎం కేసీఆర్ (CM KCR), మంత్రులు హరీష్ రావు (Harish Rao), కేటీఆర్ (KTR) పదే పదే కాంగ్రెస్ (Congress)పై ఆరోపణలు చేస్తున్నారని, డబ్బులు, మందు పంచి ఎన్నికల్లో గెలవాలని కాంగ్రెస్ చూస్తోందని ఆరోపిస్తున్నారని టీపీసీసీ చీఫ్ (TPCC Chief) రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ హుజూరాబాద్, మునుగోడు ఉప ఎన్నికల్లో డబ్బు, లిక్కర్ పంచి ఎన్నికల్లో గెలవాలని చూశారని, బీజేపీ (BJP), బీఆర్ఎస్ (BRS) పోటీ పడి ఉప ఎన్నికల్లో వందల కోట్లు ఖర్చు చేశాయని రేవంత్ ఆరోపించారు. నెలరోజుల్లో రూ. 60 కోట్ల మద్యం అమ్మకాలు జరిగితే... మునుగోడు ఉప ఎన్నిక జరిగిన 30 రోజుల్లో రూ. 300 కోట్ల మద్యం అమ్మారన్నారు. మునుగోడులో కాంగ్రెస్ చుక్క మందు, డబ్బు పంచలేదని స్పష్టం చేశారు. దేశంలోనే హుజూరాబాద్ అత్యంత ఖరీదైన ఎన్నికలని ఆనాడు విశ్లేషకులు చెప్పారన్నారు. మునుగొడు ఉప ఎన్నికల్లో అంతకంటే ఎక్కువ ధన ప్రవాహం జరిగిందన్నారు. అందుకే తమపై ఆరోపణలు చేస్తున్న కేసీఆర్‌కు సూటిగా సవాల్ విసిరానని, చుక్క మందు, డబ్బు పంచకుండా ఎన్నికలు నిర్వహించాలని సవాల్ విసిరానని రేవంత్ పేర్కొన్నారు.
కాంగ్రెస్ ఆరు గ్యారంటీలతోనే ఎన్నికలకు వెళుతోందని, అమరవీరుల స్థూపం దగ్గరకు వచ్చి ప్రమాణం చేద్దామని ఆహ్వానించానని, సీఎం కేసీఆర్ రాకపోగా... స్థూపం వద్దకు వెళితే తనను పోలీసులు అరెస్టు చేస్తారా? అంటూ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ముందస్తు అనుమతి పేరుతో పోలీసులు నిర్బంధించారని, కాంగ్రెస్ కార్యకర్తలపై దాడులు చేశారన్నారు. తెలంగాణ ప్రజలు కోరింది స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అభివృద్ధి అని, నీళ్లు, నిధులు, నియామకాలను కేసీఆర్ తన కుటుంబానికే పరిమితం చేశారని ఆరోపించారు. తాను విసిరిన సవాల్‌ను స్వీకటించకపోవడంతో... సీఎం కేసీఆర్ ఎన్నికల్లో డబ్బు, మద్యాన్ని నమ్ముకున్నారని స్పష్టత వచ్చిందన్నారు.
నిరుద్యోగ యువతి ప్రవళిక ఆత్మహత్య చేసుకుంటే... ఆ కుటుంబం పరువును మంటగలిపేలా ప్రభుత్వం వ్యవహరించిందని, ప్రేమ విఫలమై చనిపోయిందని పోలీసు అధికారి ఎలా చెబుతారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. నిర్భయ చట్టాన్ని ఉల్లంఘించి వివరాలు ఎలా బయటపెడతారు?.. కోర్టు అనుమతితో ఆధారాలు తీసుకున్నాకే వివరాలు వెల్లడించాలని.. కానీ అవేవీ చేయలేదన్నారు. తాను ప్రశ్నిస్తే... ప్రెస్ మీట్ పెట్టిన అధికారిని కాకుండా వేరే అధికారిని సస్పెండ్ చేశారన్నారు. రిటైర్ అయిన అధికారులను ప్రభుత్వం ఎందుకు కొనసాగిస్తోందని నిలదీశారు. వారిని ప్రయివేట్ సైన్యంగా చేసుకుని కేసీఆర్ తమపై దాడులు చేయిస్తున్నారన్నారు. నిన్న గన్ పార్క్ వద్ద నిరసనలు చేసినవారికి నిబంధనలు వర్తించవా?.. కాంగ్రెస్‌ను తిట్టి ధర్నా చేసే వారికి రిటర్నింగ్ అధికారి అనుమతి అవసరం లేదా? అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ ఇచ్చిన హామీలలో అన్నింటినీ రెట్టింపు చేసి సీఎం కేసీఆర్ మేనిఫెస్టోలో పెట్టారని రేవంత్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాలిస్తామని చెప్పామని.. మరి ముఖ్యమంత్రి ఉద్యోగ నియామకాల ఊసే ఎత్తలేదన్నారు. ప్రవళిక కుటుంబ సభ్యులను రేపు రాహుల్ గాంధీ వద్దకు తీసుకెళ్లాలనుకుంటే... బీఆర్ఎస్ నేతలను పంపి ఆ కుటుంబాన్ని ప్రగతి భవన్‌లో బంధిస్తారట... సీఎం ఇంతటి దిగజారుడు చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ‘‘నిరుద్యోగ యువకులారా మీ శక్తిని తక్కువ అంచనా వేయకండి... 30 లక్షల నిరుద్యోగ యువకులారా... ఇక్కడి నుంచి పిలుపునిస్తున్నా..
ఈ 45 రోజులు ప్రతీ నిరుద్యోగ యువకుడు ముందుకొచ్చి కేసీఆర్, కేటీఆర్ ఉద్యోగాలను ఊడగొట్టాలి... కాంగ్రెస్ అధికారంలోకి రాగానే జాబ్ క్యాలండర్ ప్రకారం ఉద్యోగ నియామకాలు చేపడుతుంది... ఏడాదిలోగా 2లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం.. మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది.. ఒక ఆడబిడ్డ కుటుంబాన్ని అవమానించేలా వ్యవహరించిన ప్రభుత్వానికి బుద్ది చెప్పాలి’’ అని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.