TSRTC Bandh: డిపో దాటి బస్సులు రావొద్దు.. మంత్రి ఆదేశం.. ప్రయాణికుల ఆగ్రహం

ABN , First Publish Date - 2023-08-05T09:24:23+05:30 IST

ఆర్టీసీ విలీనం బిల్లుకు గవర్నర్ తమిళిసై ఆమోదం తెలపకపోవడం.. కొంత సమయం కావాలనడంపై టీఎస్‌ఆర్టీసీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రం వ్యాప్తంగా ఈరోజు ఆర్టీసీ బంద్‌కు పిలుపునిచ్చింది. ఈరోజు ఉదయం 10 గంటల వరకు ఆర్టీసీ బస్సుల బంద్ కొనసాగనుంది.

TSRTC Bandh: డిపో దాటి బస్సులు రావొద్దు.. మంత్రి ఆదేశం.. ప్రయాణికుల ఆగ్రహం

హైదరాబాద్: ఆర్టీసీ విలీనం బిల్లుకు గవర్నర్ తమిళిసై (Governor Tamilisai) ఆమోదం తెలపకపోవడం.. కొంత సమయం కావాలనడంపై టీఎస్‌ఆర్టీసీ (TS RTC) ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రం వ్యాప్తంగా ఈరోజు (శనివారం) ఆర్టీసీ బంద్‌కు పిలుపునిచ్చింది. ఈరోజు ఉదయం 10 గంటల వరకు ఆర్టీసీ బస్సుల బంద్ కొనసాగనుంది. అయితే డిపో దాటి బస్సులు బయటికి వెళ్లొద్దంటూ ఆర్టీసీ ఉన్నతాధికారులకు మంత్రి పువ్వాడ అజయ్ (Minister Puvvada Ajay) ఆదేశాలు జారీ చేశారు. మంత్రి ఆదేశాలపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే బస్సులను బంద్ చేయించడంపై ప్రయాణికులు మండిపడుతున్నారు. సిటీలో బస్సుల్లేక విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎంజీబీఎస్, జేబీఎస్ బస్టాండ్లలో జిల్లాలకు వెళ్లే ప్రయాణికులు బస్సుల కోసం పడిగాపులు కాస్తున్నారు. అసెంబ్లీ ప్రారంభమయ్యే వరకు బస్సులు నడపొద్దు అంటూ డిపో మేనేజర్లకు ఆర్టీసీ ఉన్నతాధికారులు హుకుం జారీ చేశారు. మరోవైపు జిల్లాల వ్యాప్తంగా కూడా ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. ఇదిలాఉండగా.. గురుకుల టీచర్ పరీక్షలపై బస్సుల బంద్ ప్రభావం తీవ్రంగా కనబడుతోంది. ఉదయం 8.30 గంటలకు గురుకుల పరీక్షకు హాజరుకావాల్సి ఉంది. అయితే.. బస్సుల బంద్తో అభ్యర్థుల్లో తీవ్ర ఆందోళన కనబడింది. హైదరాబాద్ లోనే కాకుండా వివిధ జిల్లాల్లో గురుకుల టీచర్‌ పరీక్ష కేంద్రాల వద్ద ఇదే పరిస్థితి నెలకొంది.


మహబూబ్ నగర్: గవర్నర్ ఆర్టీసీ బిల్లును వెంటనే ఆమోదించాలని డిమాండ్ చేస్తూ డిపోల ముందు ఆర్టీసీ కార్మికులు నిరసనకు దిగారు. ఉమ్మడి పాలమూరు జిల్లా పరిధిలోని 10 డిపోల పరిధిలో 890 బస్సులు నిలిచిపోయాయి.

ఖమ్మం: జిల్లా వ్యాప్తంగా బస్ డిపోల ముందు ఆర్టీసీ కార్మికులు ఆందోళనకు దిగారు. ఆర్టీసీ విలీనానికి సంబంధించిన బిల్‌ను గవర్నర్ ఆమోదించకపోవటాన్ని నిరసిస్తూ కార్మికులు ఆందోళన చేపట్టారు. దీంతో ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. డిపోల ముందు కార్మికుల ధర్నాకు దిగారు.

కరీంనగర్: గవర్నర్ తీరుపై నిరసనగా బస్సు డిపోల ముందు కార్మికులు ఆందోళనకు దిగారు. ఆర్టీసీ బిల్లును వెంటనే ఆమోదించాలని డిమాండ్ చేశారు. మెదక్: సంగారెడ్డి, మెదక్ జిల్లాలోని అన్ని ఆర్టీసీ డిపోల ఎదుట కార్మికులు నిరసనకు దిగారు. ఆర్టీసీ విలీన బిల్లుకు వెంటనే ఆమోదం తెలపాలని కార్మికులు డిమాండ్ చేశారు.

యాదాద్రి : సీఎం కేసీఆర్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టేలా గవర్నర్ అనుమతించాలని కోరుతూ యాదగిరిగుట్ట బస్సు డిపో ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో బస్సులు నిలిపివేసి కార్మికులు నిరసనకు దిగారు.

puvvada.jpg

వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు ఆందోళన బాట పట్టారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయకుండా అడ్డుకుంటున్న గవర్నర్‌కు వ్యతిరేకంగా భూపాలపల్లి ఆర్టీసీ డిపో ముందు బస్సులను నిలిపివేసి నల్ల బ్యాడ్జీలతో ఆర్టీసీ కార్మికులు నిరసన తెలిపారు. హన్మకొండ జిల్లా పరకాల డిపో ఎదుట ఆర్టీసీ కార్మికులు ఆందోళనకు దిగారు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీన బిల్లును వెంటనే ఆమోదించాలని డిమాండ్ చేశారు. రెండు గంటల పాటు ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. ఆర్టీసీ విలీనం బిల్లుపై సంతకం చేయకుండా గవర్నర్ తమిళసై చేస్తున్న జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ జనగామ ఆర్టీసీ డిపోలో ఆర్టీసీ ఉద్యోగులు బస్సులను నిలిపివేసి నల్ల బ్యాడ్జిలతో నిరసన తెలిపారు.

ఆదిలాబాద్ : జిల్లా కేంద్రం తో పాటు నిర్మల్, భైంసా, ఉట్నూర్, మంచిర్యాల, ఆసిఫాబాద్ డిపోల్లో ఆర్టీసీ కార్మికులు నిరసనకు దిగారు. దీంతో బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. వీలీనం బిల్లును గవర్నర్ వెంటనే ఆమోదించాలని డిమాండ్ చేశారు.

జగిత్యాల: ఆర్టీసీ కార్మికుల ఆందోళనతో బస్సులు డిపోల్లో నిలిచిపోయాయి. ఆర్టీసీ బిల్లును గవర్నర్ ఆమోదించాలని డిమాండ్ చేశారు. గత రెండు గంటలుగా బస్సులను నిలిపివేశారు.


కాగా.. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీన బిల్లును గవర్నర్ ఆమోదం కోసం ప్రభుత్వం రాజ్‌భవన్‌కు పంపింది. అయితే ఆర్టీసీ విలీనంపై ప్రభుత్వన్ని గవర్నర్ వివరణ కోరారు. నిబంధనలను పరిశీలించిన అనంతరం ప్రభుత్వం నుంచి రిప్లై రావాలని తమిళ సై అడిగారు. ఆర్టీసీ ఉద్యోగులు, సంస్థ ప్రయోజనాల దృష్ట్యా సర్కార్ తక్షణమే వివరణ అందజేయాలని ఆదేశించారు. ప్రభుత్వం ఇచ్చే వివరణ ఆధారంగా బిల్లు ఆమోదంపై నిర్ణయం తీసుకుంటానని గవర్నర్ తమిళిసై స్పష్టం చేశారు. ఈ నిర్ణయమే ఆర్టీసీ కార్మికుల ఆందోళనకు కారణమైంది.

9governor.jpg

Updated Date - 2023-08-05T09:25:05+05:30 IST