Komatireddy Venkatreddy: ఏపీకి ప్రత్యేక హోదాపై తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2023-12-12T11:23:38+05:30 IST
Telangana: ఏపీకి ప్రత్యేక హోదాపై తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే అని అన్నారు.
న్యూఢిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదాపై తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (Telangana Minister Komatireddy Venkat Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో (Telangana Bhavan) మీడియాతో మాట్లాడుతూ.. ఏపీకి ప్రత్యేక హోదా (AP Special Status) ఇవ్వాల్సిందే అని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా గత ప్రధాని మన్మోహన్ (Former PM Manmohan) , సోనియాగాంధీ (Sonia Gandhi) తీసుకున్న నిర్ణయం అని తెలిపారు. ఏపీని ఆదుకోవాలని పార్లమెంట్‌లో ఇచ్చిన హామీ అది అని చెప్పుకొచ్చారు. విభజన సమయంలో ఇచ్చిన హామీ అమలుపరచకపోవడం బాధాకరమన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం తన వంతు ప్రయత్నం చేస్తానన్నారు. ప్రధాని హోదాలో మన్మోహన్ ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చారని... ప్రస్తుత ప్రధాని దానిపై నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోడీ ఏపీకి ప్రత్యేక హోదాను అమలు చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు.
త్వరలో తెలంగాణ భవన్ నిర్మిస్తాం..
ఢిల్లీలో త్వరలో తెలంగాణ భవన్ నిర్మిస్తామని మంత్రి కోమటిరెడ్డి స్పష్టం చేశారు. భవన్ నిర్మాణానికి సంబంధించిన అంశాన్ని సీఎం ముందు ఉంచుతామని తెలిపారు. తెలంగాణ ప్రజాప్రతినిధులకు, అధికారులకు అనువుగా భవన్ నిర్మాణం చేస్తామని చెప్పారు. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్‌తో భేటీ కానున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో రోడ్ల నిర్మాణంపై చైర్మన్‌తో చర్చిస్తానని.. తెలంగాణలో 340 కిలోమీటర్ల మేర హైవేను ఆరు లైన్లుగా నిర్మాణం చేయాలని కోరనున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వెల్లడించారు.