TPCC Chief: మంత్రి కేటీఆర్ ఢిల్లీ టూర్ ఎందుకో చెప్పిన రేవంత్
ABN , First Publish Date - 2023-06-29T10:39:21+05:30 IST
ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ కుర్చీ కదులుతుందనే కేటీఆర్ ఢిల్లీలో గల్లీ గల్లీ ప్రదక్షిణలు చేస్తున్నారన్నారు. కేటీఆర్ పర్యటన కంటోన్మెంట్ రోడ్ల కోసమో, మెట్రో రైలు కోసమో, రాష్ట్ర ప్రయోజనాల కోసమో కాదని.. కల్వకుంట్ల కుటుంబ సభ్యుల కంపెనీలపై ఐటీ దాడుల నేపథ్యంలోనే కేటీఆర్ ఢిల్లీ టూర్ అంటూ వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR), మంత్రి కేటీఆర్‌పై (Minister KTR) టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ కుర్చీ కదులుతుందనే కేటీఆర్ ఢిల్లీలో గల్లీ గల్లీ ప్రదక్షిణలు చేస్తున్నారన్నారు. కేటీఆర్ పర్యటన కంటోన్మెంట్ రోడ్ల కోసమో, మెట్రో రైలు కోసమో, రాష్ట్ర ప్రయోజనాల కోసమో కాదని.. కల్వకుంట్ల కుటుంబ సభ్యుల కంపెనీలపై ఐటీ దాడుల నేపథ్యంలోనే కేటీఆర్ ఢిల్లీ టూర్ అంటూ వ్యాఖ్యలు చేశారు. ఐటీ దాడుల్లో చాలా రహస్య ఆస్తుల వివరాలు దొరికాయన్నారు. పత్రికల్లో, మీడియాలో రాకుండా కేటీఆర్ మేనేజ్ చేశారని అన్నారు. ఐటీ దాడుల్లో పట్టుకున్న ఆస్తులను విడిపించుకోవడానికి కేసీఆర్ మోదీకి లొంగిపోయారని వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ చుట్టూ ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేసినా తెలంగాణ గల్లీల్లో కేసీఆర్‌ను ఎవరూ నమ్మరన్నారు. పదేళ్లు కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్నారని మండిపడ్డారు. 100 కోట్ల లిక్కర్ స్కాంలో కేజ్రీవాల్‌పై విచారణ జరిపిస్తున్న మోదీ... లక్ష కోట్లు దోచుకున్న కేసీఆర్‌ను ఎందుకు విచారణ చేయడంలేదని టీపీసీసీ చీఫ్ ప్రశ్నించారు.
నిన్న వెళ్లి నడ్డాను, అమిత్ షాను కలిసి వచ్చిన బీజేపీ నాయకులు ఇంకా భ్రమలు పెట్టుకోవద్దన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ది మీరు అనుకుంటే తెగిపోయే బంధం కాదని.. బీఆర్ఎస్, బీజేపీది ఫెవికాల్ బంధమని చెప్పుకొచ్చారు. తెలంగాణకు పట్టిన చీడ వదలాలంటే ఏకైక ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీనే అని స్పష్టంచేశారు. కాంగ్రెస్ వేదికగానే కేసీఆర్ పాలన నుంచి తెలంగాణకు విముక్తి లభిస్తుందన్నారు. ఢిల్లీలో ఎన్ని ప్రదక్షిణలు చేసినా జవాబు రాదని తెలిపారు. తెలంగాణ గల్లీల్లో పర్యటించి కేసీఆర్ పాలన నుంచి తెలంగాణకు విముక్తి కల్పిద్దాం అంతా కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఢిల్లీ బీజేపీ నేతలు, కేసీఆర్ ఒక్కటే అని అన్నారు. తెలంగాణను చివరకు రోడ్లు అమ్ముకునే పరిస్థితికి కేసీఆర్ తీసుకొచ్చారని విమర్శించారు. కేసీఆర్‌కు ఇష్టమైన ప్రాంతం దుబాయ్ అని... దోచుకున్న సొమ్ముతో అక్కడికే పారిపోతారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు.