Congress 6 Guarantees: హామీల సునామీ!

ABN , First Publish Date - 2023-09-18T03:54:19+05:30 IST

తెలంగాణ(Telangana)లో వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా కార్యాచరణ ప్రారంభించిన కాంగ్రెస్‌(Congress) పార్టీ.. అందుకోసం ప్రజలకు పెద్ద ఎత్తున హామీలు ప్రకటించింది.

Congress 6  Guarantees: హామీల సునామీ!

తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్‌ వాగ్దానాలు..

ఆరు గ్యారెంటీలను ప్రకటించిన సోనియా

మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి గృహిణికీ నెలకు

రూ.2500.. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం

పేద మహిళలకు రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌

రైతులు, కౌలు రైతులకు ఏడాదికి రూ.15 వేలు,

రైతుకూలీలు, భూమిలేని నిరుపేదలకు 12 వేలు

వరికి మద్దతు ధర, క్వింటాకు రూ.500 బోనస్‌

ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద రూ.5 లక్షల సాయం

తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల స్థలం,

గృహజ్యోతి ద్వారా 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు

రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పథకం కింద 10 లక్షల బీమా

చేయూత పథకం ద్వారా 4 వేల వృద్ధాప్య పింఛన్‌

యువ వికాస్‌ కింద విద్యార్థులకు 5 లక్షల సాయం

తెలంగాణలో కాంగ్రెస్‌ సర్కారు కొలువుదీరాలి

నా స్వప్నాన్ని మీరంతా నెరవేర్చాలి: సోనియా

మోదీకి ఏ కష్టం వచ్చినా ఆదుకునేది కేసీఆరే

అందుకే కేసీఆర్‌ అవినీతిపై ఎటువంటి కేసుల్లేవు

కాంగ్రెస్‌ విజయభేరి సభలో రాహుల్‌గాంధీ

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తామని చెప్పాం. మాట నిలబెట్టుకున్నాం. ఇప్పుడు తెలంగాణకు ఇచ్చే గ్యారంటీలన్నింటినీ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన తొలిరోజు నుంచే అమల్లోకి తెస్తాం.

రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌, బీజేపీ, మజ్లిస్‌ కలిసికట్టుగా ఉన్నాయి. ఆ మూడు పార్టీలకు వ్యతిరేకంగా మేం పోరాటం చేస్తున్నాం. వంద రోజుల్లో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని గద్దె దించుతాం.

- విజయభేరి సభలో రాహుల్‌

హైదరాబాద్‌, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ(Telangana)లో వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా కార్యాచరణ ప్రారంభించిన కాంగ్రెస్‌(Congress) పార్టీ.. అందుకోసం ప్రజలకు పెద్ద ఎత్తున హామీలు ప్రకటించింది. మహిళలు, రైతులు, కౌలురైతులు, నిరుపేదలు, వృద్ధులు, యువకులు.. ఇలా అన్ని వర్గాలకూ ప్రయోజనం చేకూర్చే పథకాలను చేపట్టనున్నట్లు తెలిపింది. ఆరు గ్యారెంటీల పేరిట వీటిని ప్రకటించి.. అధికారంలోకి రాగానే అమలుకు చర్యలు తీసుకుంటామని పేర్కొంది. ఆదివారం తుక్కుగూడలో జరిగిన కాంగ్రెస్‌ విజయభేరి సభలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Mallikarjuna Kharge), ఆ పార్టీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ ఈ మేరకు ప్రకటనలు చేశారు. సభలో సోనియాగాంధీ(Sonia Gandhi) మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కొలువుదీరాలని ఆకాంక్షించారు. ఇదే తన స్వప్నమని, అందరూ కలిసి నెరవేర్చాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ‘మహాలక్ష్మి’ పథకం కింద గృహిణులకు నెలకు రూ.2500 అందిస్తామని ప్రకటించారు. అంతేకాకుండా ఆర్టీసీ బస్సుల్లో రాష్ట్రమంతటా మహిళలకు ఉచిత ప్రయాణ వసతి కల్పిస్తామన్నారు. దీంతోపాటు వంటగ్యాస్‌ సిలిండర్‌ను రూ.500కే ఇస్తామన్నారు. మహాలక్ష్మి సహా ఆరు గ్యారెంటీలను ప్రకటిస్తున్నామని, కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటయ్యాక వీటిని కచ్చితంగా అమలు చేస్తామని అన్నారు.

తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన తాము.. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో మరింత ఉన్నత స్థానానికి తీసుకెళతామని ప్రకటించారు. సమాజంలోని అన్ని వర్గాలకు మేలు జరగాలన్నదే తన ఆకాంక్ష అని వెల్లడించారు. కాంగ్రెస్‌ అగ్రనేత, ఎంపీ రాహుల్‌గాంధీ(Rahul Gandhi( మాట్లాడుతూ.. వంద రోజుల్లో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని, దీనిని ఏ శక్తీ అడ్డుకోలేదని అన్నారు. తెలంగాణలో బీజేపీ, మజ్లిస్‌, బీఆర్‌ఎ్‌సలు కలిసికట్టుగా ఉన్నాయని, అయినా అధికారంలో నుంచి దించి తీరుతామని ప్రకటించారు. ‘‘తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ కేవలం బీఆర్‌ఎ్‌సతోనే పోరాడటం లేదు. బీఆర్‌ఎ్‌సతోపాటు బీజేపీ, మజ్లి్‌సలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాం, వాస్తవానికి ఈ పార్టీలన్నీ వేర్వేరు అని చెబుతుంటాయి. కానీ, ఈ మూడు పార్టీలూ ఒక్కటే.. భాగస్వామ్య పార్టీలే. బీఆర్‌ఎస్‌ నిజస్వరూపాన్ని పార్లమెంట్‌లో నా కళ్లతో చూశా. బీజేపీకి అవసరమైనప్పుడల్లా బీఆర్‌ఎస్‌ సంపూర్ణ మద్దతుగా ఉంటుంది. 2014లో రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకే మద్దతు ఇచ్చింది. జీఎస్టీ చట్టాన్ని తొలుత ఆమోదించింది ఆ పార్టీయే. రైతు చట్టాలకూ మద్దతుగా నిలిచింది’’ అని రాహుల్‌ అన్నారు.

కాంగ్రెస్‌ సభను దెబ్బతీసేందుకు ప్రయత్నం

కాంగ్రెస్‌ విజయభేరి సభ(Congress Vijayabheri Sabha)ను ప్రకటించగానే దానిని దెబ్బతీయడానికి మూడు పార్టీలు సభలు పెట్టుకున్నాయని రాహుల్‌ ఆరోపించారు. అయినా కాంగ్రెస్‌ బలం ముందు వాళ్లు ఏం చేయలేకపోయారని, వారి ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయని అన్నారు. వారంతా ఈ రాత్రికే ఫోన్లు చేసుకొని.. కాంగ్రె్‌సను ఎలా అడ్డుకోవాలని మాట్లాడుకుంటారని వ్యాఖ్యానించారు. దేశంలో తొమ్మిదేళ్లుగా నరేంద్రమోదీ ప్రభుత్వం(Narendra Modi Govt) అదానీకి మేలు చేయడానికి పనిచేస్తోందని, అన్ని పరిశ్రమల్లో అదానీకే మేలు జరిగి.. ప్రపంచంలోనే ఆయన అత్యంత ధనవంతుడు కాగలిగాడని తెలిపారు. అదానీ(Adani) గురించి పార్లమెంట్‌లో మాట్లాడినందుకే తన సభ్యత్వం రద్దు చేయించారన్నారు. దేశ సంపదను మోదీ అదానీకి పంచుతుంటే.. రాష్ట్ర సంపదనంతా కేసీఆర్‌ తన కుటుంబానికి దోచిపెడుతున్నారని ఆరోపించారు. అయినా కేసీఆర్‌ అవినీతిపై నరేంద్రమోదీ ఎలాంటి చర్యలు తీసుకోరని అన్నారు.

మోదీ(MODI)కి జాతీయస్థాయిలో ఏ కష్టమొచ్చినా కేసీఆర్‌(KCR) మద్దతుగా ఉంటారనే ఆయన అవినీతిపై చర్యలు తీసుకోవడం లేదన్నారు. దేశంలో విపక్ష నేతలందరిపై ఏదో ఒక కేసు ఉందని, ఈడీ, సీబీఐ, ఐటీ అన్నిరకాల కేసులు విపక్ష నేతలపై పెట్టి దాడులు చేస్తున్నాయని, కానీ.. తెలంగాణ ముఖ్యమంత్రిపై, మజ్లిస్‌ నేతలపై మాత్రం ఒక్క కేసు కూడా లేకపోవడమే వారిద్దరి స్నేహానికి నిదర్శనమన్నారు. బీఆర్‌ఎస్‌ బీజేపీ రిస్తేదార్‌ సమితి (రక్తసంబంధీకుల పార్టీ) అనిఅవినీతిలో కేసీఆర్‌ అన్ని రికార్డులనూ చెరిపేశారని ఆరోపించారు. దేశవ్యాప్తంగా తాము బీజేపీతో పోరాడుతుంటే.. మజ్లిస్‌ తమను ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తోందని తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రజలకు ప్రేమను, ఐక్యతను పంచుతుంటే.. బీజేపీ మాత్రం దేశంలో హింసను, ద్వేషాన్ని నింపుతోందని మండిపడ్డారు. సోనియాగాంధీ మాట ఇస్తే నిలబెట్టుకుంటారని, ఎంత నష్టం జరిగినా వెనక్కి వెళ్లరని రాహుల్‌గాంధీ అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తామని మాట ఇచ్చి.. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చారని తెలిపారు. అయితే తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కేసీఆర్‌కు మేలు చేయడానికి కాదని, పేద ప్రజలు, రైతులు, కూలీల మేలు కోసం ఇచ్చామని పేర్కొన్నారు. కానీ, తొమ్మిదేళ్లలో ఏ వర్గానికీ మేలు జరగలేదని అన్నారు.


తొలిరోజే గ్యారెంటీలన్నీ అమల్లోకి..

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు విషయంలో మాట నిలబెట్టుకున్నట్లే.. ఇప్పుడు ఇచ్చే గ్యారంటీలన్నింటినీ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన తొలిరోజు నుంచే అమల్లోకి తెస్తామని రాహుల్‌గాంధీ ప్రకటించారు. గ్యారెంటీల్లో భాగంగా.. ‘‘సొంతిళ్లు లేని వర్గాలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షల సాయం చేస్తాం. తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన వారి కుటుంబాలకు 250 గజాల ఇంటి స్థలం ఇస్తాం. గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల దాకా ఉచితంగా కరెంట్‌ ఇస్తాం. యువ వికాస్‌ పథకం కింద విద్యార్థులకు కాలేజీల్లో చదువుకోవడంతో పాటు పోటీ పరీక్షల కోచింగ్‌కు రూ.5 లక్షల దాకా సాయం చేస్తాం. చేయూత పథకం కింద పింఛన్‌ను నెలకు రూ.4 వేలు ఇస్తాం. రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పథకం కింద రూ.10 లక్షల దాకా బీమా సౌకర్యం అమలు చేసాం. రైతు భరోసా కింద రైతులు, కౌలు రైతులకు రూ.15 వేల సాయం అందిస్తాం. రైతుకూలీలకు ఏడాదికి రూ.12 వేలు ఇస్తాం’’ అని రాహుల్‌ ప్రకటించారు. కర్ణాటకలో కాంగ్రెస్‌ ఇచ్చే హామీలు అమలు చేయదని ఎన్నికల ప్రచారంలో నరేంద్రమోదీ అన్నారని, కానీ.. మంత్రివర్గం ప్రమాణ స్వీకారం రోజే అమల్లోకి తెచ్చామని తెలిపారు. తెలంగాణలో కూడా ఇచ్చిన హామీలన్నీ మంత్రివర్గం కొలువుదీరిన రోజు నుంచే అమల్లోకి తెస్తామన్నారు.

కాళేశ్వరంలో రూ.లక్ష కోట్ల అవినీతి

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందని రాహుల్‌గాంధీ ఆరోపించారు. ధరణి పోర్టల్‌ పేరుతో స్కామ్‌లు చేశారని, రైతుల, దళితుల భూములు లాక్కున్నారని మండిపడ్డారు. రైతుబంధుతో పెద్ద రైతులకే మేలు జరుగుతోందన్నారు. రాష్ట్రంలో ఎంత మందికి ఇళ్లు ఇచ్చారని ప్రశ్నించారు. పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌లో పేపర్‌లు లీక్‌ చేశారని, రాష్ట్రంలో 2 లక్షల దాకా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా భర్తీ చేయడంలేదని అన్నారు. ప్రజల నుంచి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ లాక్కున్న డబ్బునంతా కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే వెనక్కి ఇస్తామన్నారు.

కాంగ్రెస్‌ ప్రకటించిన 6 గ్యారెంటీలు ఇవే..

1. మహాలక్ష్మి

మహిళలకు ప్రతి నెలా రూ.2500 ఆర్థిక సాయం

రూ.500కే వంటగ్యాస్‌ సిలిండర్‌

మహిళలకు రాష్ట్ర మంతటా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత పయ్రాణం

2. రైతు భరోసా

రైతులకు, కౌలు రైతులకు ఏటా ఎకరాకు రూ.15 వేల పెట్టుబడి సాయం. రైతుకూలీలకు, భూమిలేని నిరుపేదలకు రూ.12 వేల సాయం.

వరి పంటకు మద్దతు ధర కల్పించడంతోపాటు రూ 500 బోనస్‌ అందజేత

3. గృహ జ్యోతి

రాష్ట్రంలోని అన్ని కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు సరఫరా

4. ఇందిరమ్మ ఇళ్లు

ఇల్లు లేని ప్రతి కుటుంబానికీ ఇంటిస్థలం. ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం

అదనంగా తెలంగాణ ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటిస్థలం అందజేత.

5. యువవికాసం

విద్యార్థులకు విద్య భరోసా కార్డు అందజేత. రూ.5 లక్షల వ్యయ పరిమితితో, వడ్డీ రహిత ఆర్థిక సహాయక కార్డు అందజేసి కాలేజీ ఫీజులు, కోచింగ్‌ ఫీజులు, విదేశీ చదువుల ఫీజులు, విదేశీ ప్రయాణ ఖర్చులు, ట్యూషన్‌ ఫీజులు, పుస్తకాలు మరియు స్టడీ మెటీరియల్స్‌ కొనుగోలు, హాస్టల్‌ ఫీజులు, ల్యాప్‌టాప్‌, పరీక్ష ఫీజులు, పరిశోధన పరికరాలు, స్కిల్‌ డెవల్‌పమెంట్‌ కోర్సులు, ఇతర విద్యా సంబంధిత చెల్లింపులు చేసుకొనేలా సదుపాయ కల్పన.

ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్‌ స్కూల్స్‌ ఏర్పాటు.

6. చేయూత

ప్రతి నెలా రూ.4 వేల చొప్పున వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, కల్లుగీత కార్మికులు, చేనేత కార్మికులు, ఎయిడ్స్‌, ఫైలేరియా వ్యాధిగ్రస్తులు, డయాలసిస్‌ చేయించుకుంటున్న కిడ్నీ రోగులకు పింఛన్ల అందజేత.

పేదలకు రూ.10 లక్షల ఆరోగ్య బీమా వర్తింపు

Updated Date - 2023-09-18T04:25:25+05:30 IST