Bandi Sanjay Arrest: బండి అరెస్ట్‌కు కారణాలేంటన్న కిషన్‌రెడ్డి ప్రశ్నకు డీజీపీ ఏం సమాధానం చెప్పారో చూడండి...
ABN , First Publish Date - 2023-04-05T11:30:41+05:30 IST
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అక్రమ అరెస్ట్ ఆ పార్టీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు.
హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (BJP Leader Bandi Sanjay) అక్రమ అరెస్ట్ ఆ పార్టీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. కారణం చెప్పకుండా అరెస్టు చేయడం అప్రజాస్వామికమని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి (Union Minister Kishan Reddy) అన్నారు. ఈ క్రమంలో బండి అరెస్ట్‌పై తెలంగాణ డీజీపీ అంజనీకుమార్ (Telangana DGP Anjani Kumar)కు కేంద్రమంత్రి ఫోన్ చేశారు. బండి సంజయ్ అరెస్టుకు కారణాలేంటని డీజీపీని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. కారణం చూపకుండా ఎలా అరెస్టు చేస్తారని అడిగారు. అయితే కేసు వివరాలు కాసేపటి తర్వాత తెలియజేస్తామని డీజీపీ సమాధానమిచ్చారు. అంటే.. ఇంత హంగామా జరుగుతున్నప్పటికీ.. ఏ కేసులో బండి సంజయ్‌ను అరెస్టు చేశారో డీజీపీకి కూడా తెలియకపోవడం తెలంగాణలో పోలీసు వ్యవస్థ పనిచేస్తున్న తీరుకు నిదర్శనమని కేంద్రమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు దురృష్టకరమన్నారు. కల్వకుంట్ల కుటుంబానికి కట్టుబానిసలుగా వ్యవహరించొద్దంటూ పోలీసులకు కిషన్ రెడ్డి సూచించారు.
బీఆర్‌ఎస్‌కు కాలం చెల్లింది: డీకే అరుణ్
మరోవైపు బండి సంజయ్ అరెస్ట్‌పై బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఆయన అరెస్ట్‌ను నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీకి కాలం చెల్లిందని డీకే అరుణ (DK Aruna) అన్నారు. ప్రజలు త్వరలో బీఆర్‌ఎస్ (BRS)కు బొంద పెడుతారన్నారు. ఓ జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, పార్లమెంట్ సభ్యుడని లేకుండా, అకారణంగా అక్రమంగా అరెస్ట్ చేయడం సిగ్గుమాలిన చర్య అని మండిపడ్డారు. బండి సంజయ్‌ను వెంటనే విడుదల చేయాలని డీకే అరుణ డిమాండ్ చేశారు.
కారణం చెప్పకుండా అరెస్ట్ దుర్మార్గం: ఈటల
బండి సంజయ్ అరెస్ట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నామని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (Huzurabad MLA Etela Rajender) అన్నారు. ఒక ఎంపీనీ కారణం చెప్పకుండా అరెస్ట్ చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. కేసీఆర్ (CM KCR) చెప్పినట్టు పోలీసులు వెన్నెముక లేకుండా వ్యవహరిస్తున్నారన్నారు. పేపర్ లీకేజీ వ్యవహారంలో ప్రభుత్వ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి, తప్పు దోవపట్టించడానికి నిదర్శనం బండి సంజయ్ అరెస్ట్ అని.. ఆయన్ను వెంటనే విడుదల చేయాలని ఈటల డిమాండ్ చేశారు.