YS Sharmila: రాష్ట్రపతి పాలనకై ఉమ్మడి పోరాటం చేద్దాం.. ప్రతిపక్షాలకు షర్మిల లేఖ

ABN , First Publish Date - 2023-03-02T11:19:54+05:30 IST

రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన కోసం ఉమ్మడి పోరాటం చేద్దామంటూ ప్రతిపక్షాలకు వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల లేఖలు రాశారు.

YS Sharmila: రాష్ట్రపతి పాలనకై ఉమ్మడి పోరాటం చేద్దాం.. ప్రతిపక్షాలకు షర్మిల లేఖ

హైదరాబాద్: రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన (President Rule) కోసం ఉమ్మడి పోరాటం చేద్దామంటూ ప్రతిపక్షాల (opposition parties )కు వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల (YSRTP Chief YS Sharmila) లేఖలు రాశారు. అఖిలపక్షంగా ఢిల్లీకి వెళ్లి రాష్ట్రపతిని కలుద్దామని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అప్రకటిత పరిస్థితులు నెలకొన్నాయని, ప్రశ్నించే ప్రతిపక్షాలపై కేసులు, అరెస్టులు, రాళ్ల దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ (Telangana) సమాజం దారుణ పరిస్థితులను ఎదుర్కుంటోందని తెలిపారు. అధికారపక్ష దాష్టీకాలకు ముగింపు చెప్పాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఇందు కోసం విపక్షాలు ఒక్కటై ముందుకు అడుగు వేయాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు. తెలంగాణలోని కేసీఆర్ సర్కారు (KCR Gogvernment) పాలనలోని వైఫల్యాలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అంతకంతకూ దిగజార్చుతోందని విమర్శించారు. చరిత్రలో ఎప్పుడూ లేని రీతిలో అవినీతికి పాల్పడిన వైనాన్ని చూస్తున్నామన్నారు. ప్రాజెక్టుల పేరుతో, రీడిజైనింగ్ పేరుతో వేలాది కోట్ల రూపాయలను దోచేస్తున్న కల్వకుంట్ల కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ఐక్యంగా గళమెత్తాలని వైఎస్సార్టీపీ చీఫ్ పిలుపునిచ్చారు.

రాష్ట్రంలో ప్రజాసామ్యం ఉందా?...

ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్న ప్రతిపక్షాలపై కేసులు మోపుతున్నారని మండిపడ్డారు. రాక్షసత్వంతో పోలీసులను పురిగొల్పి, వారిపై ఒత్తిడి తెచ్చి మరీ థర్డ్ డిగ్రీలు ప్రయోగిస్తూ ఆసుపత్రిపాలు చేస్తున్నారన్నారు. స్వరాష్ట్ర ఉద్యమంతో పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఈ రోజున నోరు తెరవటానికి వీల్లేని పరిస్థితులు నెలకొన్నాయన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసనలు, ఆందోళనలకు కూడా అనుమతులు ఇవ్వకుండా వేధింపులకు గురి చేస్తున్నారన్నారు. ప్రజలకు వద్దకు వెళ్లేందుకు వీల్లేకుండా అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాదయాత్రలు చేసే వారిపై అధికారమదంతో దాడులు చేస్తున్నారన్నారు. అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారిందని అన్నారు. పార్టీ కార్యకర్తల పేరుతో గూండాలను తయారు చేస్తూ, విపక్షాలు చేసే కార్యక్రమాలపై దాడులకు పురిగొల్పుతున్నారని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ సర్కారు చేసే తప్పులను వేలెత్తి చూపేవారిని హత్యలు చేసేందుకు, వేధింపులకు గురి చేయటానికి కూడా వెనుకాడని పరిస్థితి ఇప్పుడు రాష్ట్రంలో ఉందన్నారు. కేసీఆర్ నియంత పాలనతో రాజ్యాంగం కల్పించిన భావస్వేచ్ఛకు కూడా చెర పట్టించిన పరిస్థితి ఏర్పడిందన్నారు.

ఆంధ్రాపాలకుల హయాంలోనూ ఇలా జరగలేదు...

తెలంగాణలో సహజసిద్ధంగా ఉండే సోదరభావం, ప్రజల మధ్య సామరస్యం, ఐక్యత, ఇవి ఏమీ లేకుండా చేస్తున్న విధానాలను మూకుమ్మడిగా ఖండించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఓ యువనాయకుడు ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా గళం విప్పి ఆందోళన చేయడంతో తీవ్రంగా గాయపరచారన్నారు. తమకు వ్యతిరేకంగా మాట్లాడే ఎవరికైనా ఇదే పరిస్థితి ఎదురవుతుంది అన్న హెచ్చరిక తెలంగాణ సమాజానికి కేసీఆర్ సర్కారు చేసిందన్నారు. ఒక మహిళగా గడిచిన రెండేళ్లుగా తనను అంటున్న మాటలు, చేస్తున్న హేళనలను, హెచ్చరికలను లెక్క చేయకుండా ప్రజలకోసం ముందుకు సాగిపోతున్నానని అడ్డుకునేందుకు యత్నించారన్నారు. ఒక పార్టీ అధ్యక్షురాలిగా ఉన్న తనను కారులో ఉండగానే టోయింగ్ చేసిన దారుణం ఆంధ్రాపాలకుల హయాంలోనూ చోటు చేసుకోలేదన్నారు. అవినీతిపై గళం విప్పినా తీవ్రంగా స్పందిస్తూ, సంబంధం లేని సెక్షన్లతో కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తున్నారన్నారు.

అమరవీరుల త్యాగాల్ని భావితరాలకు అందించాల్సిన బాధ్యత తెలంగాణలోని ప్రతిపక్ష పార్టీల మీద ఉందన్నారు. తెలంగాణలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను విధించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రతిపక్షాల పోరు కేక నియంత కేసీఆర్ పాలనకు చరమగీతంలా మారాలన్నారు. ఈ సర్కారును బర్తరఫ్ చేయాల్సిన చారిత్రక అవసరాన్ని ఇప్పటికే తెలంగాణ గవర్నర్‌ను కలిసి నివేదించినట్లు చెప్పారు. అటు ఢిల్లీలో రాష్ట్రపతిని కలిసి కేసీఆర్ సర్కారును బర్తరఫ్ చేయాల్సిన అవసరాన్ని తెలియజేయాల్సిన పరిస్థితి ఏర్పాడిందన్నారు. ఈ అత్యవసర పరిస్థితిని గుర్తించి, అందరం కలిసి రాష్ట్రపతిని కలసి, రాష్ట్రంలో నెలకొన్న అరాచకపాలన గురించి విన్నవించాలని ప్రతిపక్షాలకు రాసిన లేఖలో షర్మిల పేర్కొన్నారు. బండి సంజయ్, రేవంత్ రెడ్డి, కోదండరాం, కాసాని జ్జానేశ్వర్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, అసదుద్దిన్ ఓవైసి, తమ్మినేని వీరభద్రం, కూనంనేని సాంభశివరావు, ఎన్ శంకర్ గౌడ్, మందక్రిష్ణ మాదిగలకు షర్మిల లేఖలు రాశారు.

Updated Date - 2023-03-02T11:19:54+05:30 IST