Etela Rajender: బీఆర్‌ఎస్‌ది నీచమైన కల్చర్
ABN , First Publish Date - 2023-10-26T14:06:31+05:30 IST
బీఆర్‌ఎస్‌ది నీచమైన కల్చర్ అని గజ్వేల్ బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ విరుచుకుపడ్డారు.
సిద్దిపేట: బీఆర్‌ఎస్‌ది (BRS) నీచమైన కల్చర్ అని గజ్వేల్ బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ (BJP Leader Etela Rajender) విరుచుకుపడ్డారు. గురువారం వర్గల్ మండల కేంద్రంలోని శ్రీ విద్యా సరస్వతి ఆలయాన్ని ఈటెల దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తన మీటింగులు తాను ఏర్పాటు చేసుకోవాలి.. ప్రచారం చేసుకోవాలి.. కాని ఇతరుల మీటింగులను అడ్డుకోవడం దుర్మార్గమని మండిపడ్డారు. ఇలాంటి నీచమైన పనే హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్ ఆచరించిందని తెలిపారు. గజ్వేల్‌లోనూ అదే పని చేస్తున్నదన్నారు. ఇప్పటి వరకు తమకున్న సమాచారం మేరకు గజ్వేల్‌లో తమ మీటింగ్‌కు ప్రజలు రాకుండా బీఆర్‌ఎస్ అడ్డుకుంటోందని వ్యాఖ్యలు చేశారు. గ్రామాల్లో దావత్‌లు ఇవ్వడం, డబ్బులు ఇస్తామని ప్రలోభాలు పెడుతున్నట్లు తెలుస్తోందన్నారు. ఇవన్నీ కుట్రలు, కుతంత్రాలు హుజురాబాద్‌లో కూడా చేశారని.. మళ్ళీ ఇక్కడ చేస్తున్నారన్నారు. వారి కుట్రలను, ప్రలోభాలను, అడ్డగోలుగా డబ్బుల పంపిణీ అధిగమించి హుజురాబాద్‌లో ఎలాగైతే విజయం సాధించామో అలాగే ఇక్కడా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. మన కడుపుకొట్టి, నోరు కొట్టి వేల కోట్లు సంపాదించి, ఆ డబ్బుతో మన ఆత్మగౌరవాన్ని కొనే ప్రయత్నం చేస్తున్నారన్నారు. గజ్వేల్‌లో ప్రయివేటు కంపెనీల కోసం భూములు గుంజుకుని పేదవారి ఉసురు పోసుకున్నారన్నారు. ఇక్కడ జరిగే యుద్ధం మహాభారత కురుక్షేత్రాన్ని తలపించబోతున్నదన్నారు. కౌరవులకు, పాండవులకు జరగబోయే ఈ యుద్ధంలో ధర్మానిదే విజయమని ఈటెల రాజేందర్ చెప్పుకొచ్చారు.