Amaravati : ఇంధన రంగం.. ఆర్థిక భంగం
ABN , Publish Date - Aug 20 , 2024 | 04:49 AM
రాష్ట్ర ఇంధన రంగం ఆర్థికంగా కుదేలైపోయింది. ఐదేళ్ల జగన్ పాలనలో ఏకంగా రూ.1,77,244 కోట్ల అప్పుల్లో కూరుకుపోయింది. పైగా ఈ భారమంతా సాధారణ వినియోగదారులపైనే పడింది. మరోవైపు చేసిన అప్పులకు వాయిదాలు చెల్లించేందుకు మరిన్ని అప్పులు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది.
విధ్వంసం విలువ 1.77 లక్షల కోట్లు
జగన్ అసమర్థ విధానాలే కారణం.. భారమంతా వినియోగదారులపైనే
నష్టాలపై ఇంధన సంస్థల ఆందోళన
నెలనెలా పెరుగుతున్న వడ్డీల భారం
వాయిదాల చెల్లింపులకూ అప్పులు
కూటమి సర్కారుకు తలనొప్పులు
రాష్ట్ర ఇంధన రంగం ఆర్థికంగా కుదేలైపోయింది. ఐదేళ్ల జగన్ పాలనలో ఏకంగా రూ.1,77,244 కోట్ల అప్పుల్లో కూరుకుపోయింది. పైగా ఈ భారమంతా సాధారణ వినియోగదారులపైనే పడింది. మరోవైపు చేసిన అప్పులకు వాయిదాలు చెల్లించేందుకు మరిన్ని అప్పులు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది.
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
సొంతంగా హైడల్ విద్యుత్తు సంస్థలను నిర్వహించిన అనుభవం ఉందంటూ గొప్పలు పోయిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. తాను అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఇంధన రంగాన్ని సర్వనాశనం చేశారు. 2019-24 మధ్య జగన్ అనుసరించిన అసమర్థ విధానాల కారణంగా విద్యుత్తు సంస్థలు రూ.1,77,244 కోట్ల అప్పుల్లో కూరుకుపోయినట్టు ఇంధనశాఖ నిర్ధారించింది.
ఆదాయ, వ్యయాల వ్యత్యాసంలేకుండా.. లాభనష్టాలతో సంబంధం లేకుండా విద్యుత్తు సంస్థలు నడవాలన్న రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఏపీఈఆర్‌సీ) నిబంధనల మేరకు.. నష్టాలన్నీ ‘ట్రూఅప్’ పేరిట వినియోగదారులపైనే పడనుంది. అంటే.. జగన్ నిర్వాకంతో వారిపై ఏకంగా రూ.1,77,244 కోట్ల భారం పడుతోంది. విద్యుత్ రంగంపై సంపూర్ణ అవగాహన ఉందంటూ చెబుతూ వచ్చిన జగన్ ఏకంగా రూ.1,77,244 కోట్ల నష్టాన్ని మోపడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ నష్టాలకు జగన్ అసమర్థ పాలనా విధానాలే కారణమని ఇంధన శాఖ స్పష్టం చేసింది. అధికారాన్ని కోల్పోయిన జగన్.. అన్ని రంగాల్లోనూ భారీ ఆర్థిక భారాన్ని మోపి వెళ్లిపోయారు. ఇంధన రంగం ఏకంగా రూ.1,77,244 కోట్ల ఆర్థిక భారాన్ని మోయాల్సిన పరిస్థితి ఏర్పడింది. జగన్ వేసిన ఈ భారాన్ని వినియోగదారుల నుంచి వసూలు చేస్తే రాజకీయంగా నష్టం కలుగుతుందని కూటమి ప్రభుత్వం భావిస్తోంది.
విద్యుత్ చార్జీలు పెంచబోమని ఎన్నికల్లో కూటమి హామీ ఇచ్చింది. సహజంగా.. ఈ హామీ 2024 ఆర్థిక సంసవత్సరం నుంచి వర్తిస్తుంది. కానీ.. 2024కు ముందే జగన్ ఇంధన సంస్థలను నష్టాల ఊబిలోకి నెట్టేశారు.
9 సార్లు చార్జీలు పెంచి కూడా
జగన్ హయాంలో 9 సార్లు విద్యుత్ చార్జీలను పెంచడం ద్వారా రూ.64,000 కోట్ల మేర భారం మోపారు. అప్పటి విపక్షాలు, ఇంధన రంగ నిపుణులు, వామపక్షాలు, ప్రజాసంఘాలు గగ్గోలు పెట్టినా స్పందించలేదు. వాస్తవానికి 2019 ఎన్నికలకు ముందు విద్యుత్తు చార్జీలను తగ్గిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
కానీ అధికారంలోకి వచ్చాక ఆ హామీని బుట్టదాఖలు చేసి.. ప్రజలపై తొమ్మిదిసార్లు విద్యుత్తు చార్జీల కొరడా ఝళిపించారు. దీనిలోనూ తాను అధికారంలోలేని 2014-19కు సంబంధించి రూ.3,669 కోట్లను ట్రూఅప్ చార్జీల కింద వసూలు చేశారు. కాగా, రాష్ట్ర ఇంధన శాఖ తాజాగా అప్పుల వివరాలను విడుదల చేసింది.
దీని ప్రకారం రూ.1,29,503 కోట్లు అప్పు ఉన్నట్టు చూపిస్తున్నా.. జాబితాలో పేర్కొన్న వివరాల ప్రకారం రూ.1,77,244 కోట్ల మేరకు నష్టం వాటిల్లినట్టు స్పష్టమైంది. ఇదిలావుంటే, కరోనా సమయంలో రాష్ట్ర థర్మల్ కేంద్రాల్లో ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేసిన జగన్.. తన అస్మదీయ విద్యుత్ కేంద్రాల నుంచి స్వల్పకాలిక విద్యుత్ కొనుగోళ్లు చేపట్టారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.