Share News

AP Politics: ఆసక్తికరంగా శింగనమల పోరు.. కాంగ్రెస్ బోణీ కొట్టేనా?

ABN , Publish Date - May 05 , 2024 | 11:43 PM

రాయలసీమలో అత్యంత ఆసక్తికర పోరు నడిచే నియోజకవర్గాలు అనగానే టక్కున గుర్తొచ్చేవి కడప, పులివెందుల రాజకీయాలు. వీటితోపాటు అనంతపురం జిల్లా శింగనమల రాజకీయాలు ప్రస్తుతం ఆసక్తికరంగా మారాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన పోటీ అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి మధ్య ఉండనుండగా.. శింగనమలలో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందని రాజకీయ నిపుణులు అంటున్నారు.

AP Politics: ఆసక్తికరంగా శింగనమల పోరు.. కాంగ్రెస్ బోణీ కొట్టేనా?

శింగనమల: రాయలసీమలో అత్యంత ఆసక్తికర పోరు నడిచే నియోజకవర్గాలు అనగానే టక్కున గుర్తొచ్చేవి కడప, పులివెందుల రాజకీయాలు. వీటితోపాటు అనంతపురం జిల్లా శింగనమల రాజకీయాలు ప్రస్తుతం ఆసక్తికరంగా మారాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన పోటీ అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి మధ్య ఉండనుండగా.. శింగనమలలో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందని రాజకీయ నిపుణులు అంటున్నారు.

సమైక్యంధ్ర ఉద్యమం కాలం నుంచి ప్రత్యేక గుర్తింపు పొందిన నేత మాజీ మంత్రి, ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్(Sake Sailajanath). రాష్ట్ర విభజన అనంతరం ఏపీలో కాంగ్రెస్(Congress) ఉనికే ప్రశ్నార్థకంగా మారిన తరుణంలో శైలజానాథ్ శింగనమల నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. సమైక్యవాదానికి కట్టుబడి ఉన్న నేతగా ఆయన జిల్లాలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.


అధికారంలో ఉన్న వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నుంచి ఆయనకు పోటీ ఉండబోతోంది. 2004, 2009లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి శైలజానాథ్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం మాజీ దివంగత సీఎంలు వైఎస్ రాజశేఖర రెడ్డి, రోశయ్య, మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో మంత్రిగా పని చేశారు.

తనకు సెంటిమెంట్‌లా మారిన శింగనమల నుంచి 2024 అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి బరిలోకి దిగడంతో శింగనమల రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్ పార్టీ ప్రాభవం కోల్పోయినా.. ఆయన ఇతర పార్టీల్లోకి వెళ్లలేదు. వైసీపీ, టీడీపీ నుంచి ఆహ్వానాలు అందినా.. కాంగ్రెస్‌లోనే కొనసాగారు. గెలుపు దిశగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న శైలజానాథ్ అందులో భాగంగా ఇతర పార్టీల్లోని తన పాత మిత్రుల మద్దతు కూడబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.


వైసీపీ, టీడీపీ నుంచి ఎవరంటే..

ఈ స్థానంలో వైసీపీ నుంచి వీరాంజనేయులు, టీడీపీ నుంచి బండారు శ్రావణి పోటీ పడుతున్నారు. ఇటీవలే శైలజానాథ్ నామినేషన్ వేస్తున్న సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలే కాకుండా ఇతర పార్టీల కార్యకర్తలు కూడా భారీగా చేరుకుని సెల్ఫీల కోసం ఎగబడ్డారు. ఈ స్థానం నుంచి వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే జొన్నలగడ్డపై ఉన్న వ్యతిరేకత కారణంతో ఆ పార్టీ నూతన అభ్యర్థిగా వీరాంజనేయులును ప్రకటించింది.

దీంతో ఆయనకు సొంతపార్టీ నుంచే నేతల సహకరించట్లేదు. ఈ స్థానం నుంచి పోటీ చేస్తున్న వైసీపీ అభ్యర్థి వీరాంజనేయులుపై ఉన్న వ్యతిరేకత శైలజానాథ్‌కి కలిసొచ్చే అవకాశం ఉంది. ఒకరకంగా ముక్కోణపు పోరుగా మారిన ఈ నియోజకవర్గంలో ఎవరు విజయం సాధిస్తారోనని ఆసక్తికరంగా మారింది.

Updated Date - May 06 , 2024 | 12:03 AM