Share News

Heavy Rains: సీఎం చంద్రబాబు వెళ్లొచ్చినా అధికారుల్లో రాని మార్పు

ABN , Publish Date - Sep 02 , 2024 | 11:31 AM

భారీ వర్షాలకు బెజవాడ వణికిపోయింది.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇంట్లో నుంచి బయటికి వచ్చేసిన జనాలు ఎంతో మంది ఉంటే.. నీళ్లు, అన్నం పెట్టి కాపాడంటూ మహాప్రభో అంటూ ఇళ్లలో ఇరుక్కుపోయిన ప్రజలు చేతులెత్తి మొక్కుతున్న పరిస్థితి. ఇబ్రహీంపట్నంలోని ఫెర్రి గాజులపేటలో టిఫిన్లు, భోజనాలు లేక వరద బాధితులు అల్లాడుతున్నారు. విషయం తెలుసుకుని చలించిపోయిన సీఎం నారా చంద్రబాబు ఆ ప్రాంతానికి వెళ్లి పరామర్శించి..

Heavy Rains: సీఎం చంద్రబాబు వెళ్లొచ్చినా అధికారుల్లో రాని మార్పు
CM Chandrababu Naidu

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు (Heavy Rains) బెజవాడ (Vijayawada) గజ గజ వణికిపోయింది.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇంట్లో నుంచి బయటికి వచ్చేసిన జనాలు ఎంతో మంది ఉంటే.. నీళ్లు, అన్నం పెట్టి కాపాడండి మహాప్రభో అంటూ ఇళ్లలో ఇరుక్కుపోయిన ప్రజలు చేతులెత్తి మొక్కుతున్న పరిస్థితి. ఇబ్రహీంపట్నంలోని ఫెర్రి గాజులపేటలో టిఫిన్లు, భోజనాలు లేక వరద బాధితులు అల్లాడుతున్నారు. విషయం తెలుసుకుని చలించిపోయిన సీఎం నారా చంద్రబాబు (CM Nara Chandrababu) ఆ ప్రాంతానికి వెళ్లి పరామర్శించి.. ధైర్యం చెప్పి అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఇలా రాత్రంతా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన చంద్రబాబు.. తెల్లవారుజామున 4 గంటల వరకూ సహాయక చర్యలను పర్యవేక్షిస్తూనే ఉన్నారు. కేవలం రెండు గంటలు మాత్రమే విశ్రాంతి తీసుకుని తిరిగి రంగంలోకి దిగారు. సీఎం ఇంత చేస్తున్నా అధికారులు మాత్రం ఏ మాత్రం సహకరించకపోవడం విచిత్రంగా ఉంది.


Chandrababu-Ibrahimpatnam.jpg

పట్టించుకోరేం..?

ముఖ్యమంత్రి ఆదేశాలతో అక్కడికెళ్లి టిఫిన్లు, భోజనాలు ఏర్పాట్లు చేసి పంపిణీ చేయాల్సిన అధికారులు (Govt Officials) కనీసం పట్టించుకోకపోవడం గమనార్హం. సాక్షాత్తూ సీఎం వరద ప్రభావిత ప్రాంతానికి వెళ్లొచ్చినా అధికారుల్లో మార్పు రాని పరిస్థితి. మరోవైపు.. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు హైవే పైనే జనాలు జీవిస్తున్నారు. కనీసం వాష్ రూమ్ సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. దీంతో అధికారుల తీరుపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎంవో నుంచి క్లియర్‌ కట్‌గా ఆదేశాలు వెళ్లినా కనీసం అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. వాస్తవానికి కూటమి సర్కార్ ఏర్పడిన నాటి నుంచి పలు విభాగాల్లో అధికారులు ఓవరాక్షన్ చేస్తున్నారన్నది జగమెరిగిన సత్యమే. ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు క్లాస్ తీసుకుంటున్నప్పటికీ ఎలాంటి మార్పు రావట్లేదు. ఇప్పుడు కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో జనాలు ఇబ్బంది పడుతుంటే.. అధికారులు తమకేమీ పట్టనట్లు ఉండటం ఎంత వరకు సమంజసం అంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


boats.jpg

ఎన్డీఆర్ఎఫ్ ఎప్పుడొస్తుందో..?

ఇదిలా ఉంటే.. ఇబ్రహీంపట్నం వద్ద గంట గంటకూ వరద ఉద్ధృతి పెరిగిపోతుండటంతో చుట్టు పక్కల ప్రజలు భయపడిపోతున్నారు. ఎప్పుడేం జరుగుతుందో అంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇళ్లలో నుంచి బయటికి వచ్చేస్తున్న పరిస్థితి. ఇబ్రహీంపట్నంలోని ఫెర్రీ గ్రామంలో ప్రెగ్నెంట్‌తో ఉన్న మహిళను బయటకు తీసుకుని రావటానికి మత్స్యకారులు వెళ్లారు. మరోవైపు.. వరద బాధితులు ప్రమాదం అంచున ఉన్నారు. కాపాడండి.. కాపాడండి అంటూ ఇళ్లపై నుండి కాపాడాలని ఆర్తనాదాలు పెడుతున్నారు. అయితే.. ఇప్పటివరకు ఇబ్రహీంపట్నంకు ఎన్డీఆర్ఎఫ్ చేరుకోలేదు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వస్తే కానీ సహాయ చర్యలు ముందుకు వెళ్ళని పరిస్థితి నెలకొంది. ప్రాణాలు అరచేతుల్లో పట్టుకొని బిక్కుబిక్కుమంటూ వరద బాధితులు గడుపుతున్నారు. కనీసం త్రాగడానికి నీళ్ళు లేవని.. మమ్మల్ని పట్టించుకునే నాథుడే లేడా అంటూ బాధితులు ఆవేదన చెందుతున్నారు. కాగా.. లుధీయానా నుంచి ఆర్మీ విమానంలో గన్నవరం విమానాశ్రయానికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయి. అక్కడి నుంచి ఆర్మీ హెలికాప్టర్‌లో బొట్లతో విజయవాడ వరద ప్రాంతాల్లోకి వెళ్లాయి. సుమారు 100 మందితో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు విజయవాడకు చేరుకున్నాయి. బోట్స్ ద్వారా సింగ్ నగర్ ముంపు ప్రాంతంలో ఆహారం పంపిణీ చేయడం జరిగింది. పెద్ద ఎత్తున బోట్స్ రావడంతో ఇళ్ల నుంచి బాధితులను బయటకు తెచ్చే పనులను వేగవంతంచేయడం జరిగింది.

ChandraBabu-001.jpg

ప్రకాశం బ్యారేజీకి కొట్టుకొచ్చిన బోట్లు.. గేట్‌కు డ్యామేజీ.. ఎన్నో అనుమానాలు!

Updated Date - Sep 02 , 2024 | 11:32 AM